న్యాయశాఖ ఉద్యోగులపైనా కొరడా

న్యాయశాఖ ఉద్యోగులపైనా కొరడా - Sakshi


- 11 మంది ఉద్యోగులపై హైకోర్టు సస్పెన్షన్ వేటు

- నిరసనగా పలువురు ఉద్యోగుల రాజీనామా

- న్యాయాధికారులకు జరిగింది అన్యాయమే: తెలంగాణ విశ్రాంత హైకోర్టు జడ్జిలు

- హైకోర్టు తక్షణమే సరిదిద్దాలని డిమాండ్

- గొంతు కలిపిన రిటైర్డ్ అధికారులు, ఉద్యోగుల సంఘం

- నేడు ఇందిరాపార్కు వద్ద న్యాయవాదుల మహాధర్నా

 

 సాక్షి, హైదరాబాద్: క్రమశిక్షణ, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ నిన్నటివరకు న్యాయాధికారులపై కన్నెర్ర చేసిన హైకోర్టు ఇప్పుడు న్యాయశాఖ ఉద్యోగులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా పెన్‌డౌన్ చేశారంటూ న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జగన్నాథం, ఉపాధ్యక్షుడు రమణారావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖరరెడ్డి, అసిసోసియేట్ ప్రెసిడెంట్ రవిశంకర్, కోశాధికారి కృష్ణ నాయక్, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి లకా్ష్మరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే సిటీ సివిల్ కోర్ట్ న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సుబ్బయ్య, రంగారెడ్డి జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి.శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సి.హెచ్.వెంకట రంగారెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ కృష్ణయ్య, కోశాధికారి ఎం.రతన్‌రాజులపై కూడా సస్పెండ్ చేసింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) వెంకటప్రసాద్ పేరిట గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.



తమ అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఈ నలుగురికి హైకోర్టు తేల్చి చెప్పింది. వీరి సస్పెన్షన్‌కు నిరసనగా పలు కోర్టుల్లో పనిచేసే న్యాయశాఖ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. కూకట్‌పల్లి కోర్టులో 48 మంది, ఇబ్రహీంపట్నం కోర్టులో 12 మంది రాజీనామాలు చేశారు. రాజీనామా లేఖలను తమ జిల్లాల అధ్యక్షులకు సమర్పించారు. అయితే ఈ సస్పెన్షన్లకు భయపడేది లేదని, తమ డిమాండ్ల సాధన కోసం ఎంత వరకైనా వెళ్తామని న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నేతలు చెబుతున్నారు. అటు తెలంగాణ న్యాయాధికారులు మూకుమ్మడి సెలవులను కొనసాగిస్తున్నారు. గురువారం కూడా విధులకు దూరంగా ఉన్నారు. కాగా, తెలంగాణకు చెందిన హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు, న్యాయాధికారులు, హైకోర్టు రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులు వేర్వేరుగా గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రాథమిక కేటాయింపుల జాబితా, న్యాయాధికారుల సస్పెన్షన్, ఉమ్మడి హైకోర్టు విభజనలో అలసత్వానికి నిరసనగా శనివారం మౌన ప్రదర్శన నిర్వహించాలని తెలంగాణకు చెందిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు నిర్ణయించిట్లు తెలిసింది.

 

 జరిగింది అన్యాయమే..

 ప్రాథమిక కేటాయింపుల్లో తెలంగాణ న్యాయాధికారులకు అన్యా యం జరిగిందని రిటైర్డ్ న్యాయమూర్తులు, న్యాయాధికారులు తేల్చారు. పునర్విభజన చట్ట నిబంధనలకు, హైకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రాథమిక కేటాయింపుల జాబితాను రూపొందించారన్నారు. ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారులకు లబ్ది చేకూర్చాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశారని ఆరోపించారు. ఈ కేటాయింపుల వల్ల తెలంగాణకు చెందిన యువన్యాయవాదులు, న్యాయాధికారులకు తీరని నష్టం కలుగుతుందన్నారు. అన్యాయాన్ని సరిదిద్దేందుకు హైకోర్టు వెంటనే   సమస్యను పరిష్కరించాలని కోరారు. అలాగే తెలంగాణ న్యాయాధికారుల సస్పెన్షన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజనకు తక్షణమే చర్యలు ప్రారంభించాలని   డిమాండ్ చేశారు. ఈ మేరకు రిటైర్డ్ న్యాయమూర్తుల తరఫున జస్టిస్ వి.భాస్కరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇవే అభిప్రాయాలతో రిటైర్డ్ అధికారులు, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సయ్యాజీరావు కూడా ఓ ప్రకటన విడుదల చేశారు.

 

 న్యాయవాదుల ధర్నా

 న్యాయాధికారులపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. మొదటి, ఏడో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులకు చేరుకున్న న్యాయవాదులు.. ఆంధ్రా జడ్జిలు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. డిమాండ్లు పరిష్కారం అయ్యే వర కు ఉద్యమం ఆగదని పేర్కొన్నారు. న్యాయవాదుల జేఏసీ నేతలు గోవర్దన్‌రెడ్డి, చింతల కృష్ణ,  వెంకటేశంను పోలీసులు అరెస్టు చేసి సాయంత్రం విడిచిపెట్టారు.

 

 నేడు న్యాయవాదుల మహాధర్నా

 
న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులను రద్దు చేయాలని, ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని, న్యాయాధికారులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ న్యాయవాదుల సంఘాలు శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నా యి. ఈ ధర్నాకు అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు హాజరుకానున్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్, న్యాయవాదుల జేఏసీ, ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్, బార్ కౌన్సిల్ సభ్యులు సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ధర్నాలో తెలంగాణవ్యాప్తంగా న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది.

 

 నేటి నుంచి కోర్టు ఉద్యోగుల సమ్మె

 న్యాయాధికారుల ప్రాథమిక కేటాయిం పుల జాబితా ఉపసంహరణ, హైకోర్టు విభజన డిమాండ్‌లతో న్యాయశాఖ ఉద్యోగులు శుక్రవారం నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారు.  తాము సమ్మె నోటీసు ఇచ్చినా కనీసం చర్చలకు కూడా పిలవలేదని, దీంతో సమ్మె చేయాల్సి వస్తోందని ఉద్యోగ సంఘం నేతలు పేర్కొంటున్నారు. అటెండర్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వరకూ అందరూ సమ్మెలోకి వెళ్తుండంతో శుక్రవారం నుంచి కోర్టు తాళాలు కూడా తెరిచే అవకాశం లేదు.  ఉద్యోగుల సమ్మెతో కోర్టులు పనిచేసే అవకాశం కూడా లేదు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top