సర్కార్‌కు హైకోర్టు షాక్

సర్కార్‌కు హైకోర్టు షాక్ - Sakshi


సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండల పరిధిలోని మీర్‌పేట్, జిల్లెలగూడ, కొత్తపేట, బాలాపూర్, జల్లపల్లి, పహాడీ షరీఫ్ గ్రామ పంచాయతీలను డీనోటిఫై చేసి మున్సిపాలిటీలుగా మార్చిన వ్యవహారంలో ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 28 అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.  పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన జీవో 28ని కొట్టేసి ఈ ఆరు గ్రామ పంచాయతీల విధుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సరూర్‌నగర్ మండల ప్రజా పరిషత్ సభ్యుడు తీగల విక్రంరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.



ఈ వ్యాజ్యాన్ని విచారించిన సింగిల్ జడ్జి జీవోపై స్టేకు నిరాకరిస్తూ ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాలు చేస్తూ పిటిషనర్... ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ను గురువారం జస్టిస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ ముందుగా పంచాయతీలకు నోటీసులు జారీ చేసి అభిప్రాయాలను తెలుసుకున్నాకే డీనోటిఫై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా ఈ కేసులో ప్రభుత్వం అలా చేయలేదన్నారు.



ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన షోకాజ్ నోటీసుల ఆధారంగా ఇప్పుడు డీనోటిఫై నోటిఫికేషన్ జారీ చేశారని...కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరిగి కొత్త నోటిఫికేషన్ జారీ చేసి గ్రామ సభ నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం తప్పనిసరని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన సింగిల్ జడ్జి ఆ తరువాత ఇదే విధంగా బోడుప్పల్ మున్సిపాలిటీ ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో మాత్రం జీవో అమలుపై స్టే విధించారని, ఒకే అంశంపై పరస్పర విరుద్ధమైన ఉత్తర్వులు సరికాదన్నారు.



ఈ వాదనలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి తోసిపుచ్చారు. మున్సిపాలిటీల ఏర్పాటు ప్రభుత్వ విధాన నిర్ణయమని, విధా న నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. తాము పంచాయతీలకు నోటీసులు జారీ చేసినప్పుడు స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారని, వారు నోటీసులు ఇస్తే సరిపోతుందని హైకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం జీవో 28 అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top