వారి డబ్బు దక్కేలా చూడటమే మా లక్ష్యం

వారి డబ్బు దక్కేలా చూడటమే మా లక్ష్యం - Sakshi


అగ్రిగోల్డ్‌ కేసులో స్పష్టం చేసిన హైకోర్టు



సాక్షి, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ యాజమాన్యం చెల్లించాల్సిన మొత్తాలను డిపాజిటర్లకు దక్కేలా చూడటమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. అందులో భాగంగా ముందు ఆస్తులను వేలం వేయడం, తరువాత వేలం ద్వారా వచ్చిన మొత్తాలను డిపాజిటర్లకు ఆయా నిష్పత్తిలో పంపిణీ చేయడమే తమ ముందున్న ప్రాధాన్యత కార్యక్రమాలని తెలిపింది. ఈ రెండూ పనులు పూర్తి చేసిన తరువాతే, డిపాజిట్లు ఎగవేసిన అగ్రి యాజమాన్యంపై ప్రాసిక్యూషన్‌ వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకుంటామంది.



ఆస్తుల వేలానికి మెరుగైన స్పందన వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఏపీ సీఐడీ, అగ్రిగోల్డ్‌ యాజమాన్యానికి మరింత గడువునిచ్చింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.



పీవీ పాఠ్యాంశాన్ని ఎందుకు చేర్చడం లేదు?

ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను వివరణ కోరిన హైకోర్టు

మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పీవీ నరసింహారావుకు సంబంధించిన పాఠ్యాంశాన్ని ఎనిమిదో తరగతి హిందీ పాఠ్యపుస్తకం నుంచి తొలగించడంపై హైకోర్టు బుధవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల వివరణ కోరింది. పీవీ పాఠ్యాంశాన్ని ఎందుకు పునరుద్ధరించడం లేదో చెప్పాలంటూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు ఉత్తర్వులు  జారీ చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top