ఎలాపడితే అలా క్రమబద్ధీకరణ కుదరదు

ఎలాపడితే అలా క్రమబద్ధీకరణ కుదరదు - Sakshi


కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు హైకోర్టు షాక్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఉమ్మడి హైకోర్టు షాకిచ్చింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీసులను ఎలా పడితే అలా క్రమబద్ధీకరించడానికి వీల్లేదని, ఈ విషయంలో కర్ణాటక వర్సెస్‌ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 1996, అంతకు ముందు నియమితులై, పదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీసులను మాత్రమే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.


ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌తో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన జీవో 16ను సవాల్‌ చేస్తూ జగిత్యాల జిల్లాకు చెందిన జె.శంకర్, నల్లగొండ జిల్లాకు చెందిన ఎన్‌.గోవిందరెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే.



ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. పదిహేనేళ్లుగా వివిధ శాఖల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి సేవలను క్రమబద్ధీకరించే ముందు వారి అర్హతలను పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు క్రమబద్ధీకరణ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, కమిటీ నిర్ణయం మేరకు క్రమబద్ధీకరణ చేస్తున్నామని వివరించారు.


కాంట్రాక్ట్‌ ఉద్యోగాల నియామకం ఏకపక్షంగా జరగడం లేదని, పత్రికల్లో ప్రకటనలు జారీ చేసి, అర్హతల ఆధారంగానే ఆయా శాఖలు నియామకాలు చేస్తున్నాయని తెలిపారు. ఇదే అంశంపై గతంలో వ్యాజ్యం దాఖలైందని, అందులో ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, కాబట్టి ఆ వ్యాజ్యంతో ఈ వ్యాజ్యాన్ని జత చేసి, కౌంటర్‌ దాఖలుకు గడువునివ్వాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ చట్టాన్ని అన్వయించుకున్న ప్రభుత్వం, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిమిత్తం ఈ చట్టంలోని సెక్షన్‌ 10ఏను చేర్చిందన్నారు.


క్రమబద్ధీకరణ విషయంలోనే కర్ణాటక వర్సెస్‌ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఈ సెక్షన్‌ విరుద్ధమన్నారు. గతంలో దాఖలైన వ్యాజ్యంలో ఉద్యోగుల సర్వీసులు క్రమబద్ధీకరించబోమంటూ హామీ ఇచ్చిన ప్రభుత్వం, దానిని ఉల్లంఘించి తాజాగా జీవో 16ను జారీ చేసిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిర్దిష్ట విధానం ద్వారా కాకుండా ఇతర పద్ధతుల్లో నియామకాలు పొందిన వారి సర్వీసులను ఇలా క్రమబద్ధీకరించుకుంటూ పోతుంటే, ఇక నిరుద్యోగులు ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యల వల్ల వారు ఎప్పటికీ నిరుద్యోగులుగానే ఉండిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.


ఉమాదేవి కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారం కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, దాని ప్రకారం 1996, అంతకు ముందు కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా నియమితులై, పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారి సేవలను మాత్రమే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top