వృద్ధులను ఆకలితో చావమంటారా?

వృద్ధులను ఆకలితో చావమంటారా? - Sakshi


♦ అందుకే అర్హులైన వారికీ పెన్షన్లు నిరాకరిస్తున్నారా?

♦ సర్కార్ తీరుపై హైకోర్టు మండిపాటు

 

 సాక్షి, హైదరాబాద్: ఆకలితో చావాలనే అర్హులైన వృద్ధులకు సైతం వృద్ధాప్య పెన్షన్లు నిరాకరిస్తున్నారా? అని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పెన్షన్ల మంజూరు లో వివక్ష ఎందుకు చూపుతున్నారని నిల దీసింది. ఇన్నేళ్లు వివిధ కేటగిరీల కింద పెన్షన్ పొందుతూ వచ్చిన పిటిషనర్లకు ఇప్పుడు ఎందుకు పెన్షన్‌ను రద్దు చేశారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తమకు ఇంతకాలం ఇస్తూ వచ్చిన పెన్షన్లను ఎటువంటి సహేతుక కారణాలు చూపకుండానే అర్ధంతరంగా రద్దు చేశారంటూ కర్నూలు జిల్లా, ఎం.అగ్రహారంకు చెందిన పలువురు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.



ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది నియత వాదనలు విని పిస్తూ.. పిటిషనర్లు ఎంతో కాలంగా వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు పొందుతూ వస్తున్నారని, అయితే అధికారులు అకస్మాత్తుగా పెన్షన్లను రద్దు చేశారని, పునరుద్ధరణ కోసం దరఖాస్తులు పెట్టుకున్నా తిరస్కరించారని వివరించారు. అధికార పార్టీకి చెందిన వారు కాదన్న ఏకైక కారణంతోనే పిటిషనర్లకు పెన్షన్లను రద్దు చేశారని ఆమె కోర్టుకు నివేదించారు. ఈ సందర్భంగా ఆమె కోర్టును ఆశ్రయించిన వృద్ధుల ఫోటోలను న్యాయమూర్తి ముందుంచారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు.



‘వృద్ధాప్య పెన్షన్లు పొందేందుకు ఇంతకంటే అర్హులు ఎవరుంటారు? కళ్లు లేని వ్యక్తిని అడిగినా చెబుతారు వీరు వృద్ధులని! అటువంటి వృద్ధులు మీకు ముసలివాళ్లుగా, పెన్షన్లకు అర్హులుగా కనిపించడం లేదా? వీళ్లు వృద్ధులని చెప్పడానికి ప్రత్యేకంగా సర్టిఫికేట్లు కావాలా? ఫలానా వ్యక్తులకే పెన్షన్లు ఇవ్వాలని కోర్టు ఏమైనా చెప్పిందా? ఎంతమంది అర్హులు ఉంటే అందరికీ పెన్షన్లు ఇవ్వాలి. అంతే తప్ప ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోవడం ఏమిటి? ఇదెక్కడి వివక్ష? వృద్ధులను వెతికి మరీ పెన్షన్ ఇవ్వాల్సి ఉండగా... ఉన్న పెన్షన్లు రద్దు చేస్తారా? 75-80 ఏళ్ల వారికీ పెన్షన్లు రద్దు చేస్తుంటే ఇక మీరు ఎవరికి వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నట్లు? అర్హులైన వారిలో కూడా కొందరికే పెన్షన్ ఇస్తున్నారంటే మిగిలిన వారు ఆకలితో చావాలనా మీ ఉద్దేశం?’ అంటూ ప్రభుత్వంపై మండిపడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ రద్దు చేసిన విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారా? అని న్యాయమూర్తి పిటిషనర్ల తరఫు న్యాయవాది నియతను ప్రశ్నించారు. లేదని ఆమె చెప్పడంతో, వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ సమయంలో రాయలసీమ ప్రాంత జెడ్పీపీ, ఎంపీపీ, గ్రామ పంచాయతీల తరఫు న్యాయవాది గొల్ల శేషాద్రి స్పందిస్తూ... ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని, ఇందుకు గడువునివ్వాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top