నాగిరెడ్డిపేటపై కౌంటర్ దాఖలు చేయండి


హైదరాబాద్ : కొత్తగా ఏర్పాటు చేసిన కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట మండలాన్ని కలపడంపై హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 

 

కామారెడ్డి జిల్లా ఏర్పాటునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న జారీ చేసిన జీవో 230ని సవాలు చేస్తూ నాగిరెడ్డిపేట మండలానికి చెందిన జగ్గి జయరాజు, మరో 9 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ ప్రవీణ్‌కుమార్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, నిజామాబాద్‌లో ఉన్నప్పుడు కూడా జిల్లా ప్రధాన కేంద్రానికి నాగిరెడ్డిపల్లె 110 కిలోమీటర్ల దూరంలో ఉండేదని తెలిపారు. నాగిరెడ్డిపల్లెకు మెదక్ కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట మండలాన్ని కలిపారన్నారు. విద్యార్థులు జిల్లా కేంద్రానికి వెళ్లడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. మెదక్‌లో కలపాలంటూ స్థానిక ప్రజలు ఆందోళనలు చేసినా, వినతపత్రాలు సమర్పించినా, గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. 

 

కామారెడ్డిలో నాగిరెడ్డిపేట మండలాన్ని కలపడాన్ని నిరసిస్తూ రాజు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పగా, ఆ కారణంతోనే ఆత్మహత్య చేసుకున్నారనేందుకు ఆధారాలు ఏమిటని ప్రశ్నించారు. జిల్లా కేంద్రానికి వెళ్లడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే, వారు మెదక్ జిల్లాకు వెళ్లి చదువుకుంటామంటే ఎవరు మాత్రం ఎందుకు అభ్యంతరం చెబుతారని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని నిలదీశారు. తరువాత ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, నాగిరెడ్డిపేట మండలం విషయంలో ఎటువంటి మార్పులు చేయలేదన్నారు. గతంలో ఇది కామారెడ్డి రెవిన్యూ డివిజనల్‌లో ఉండేదని, ఇప్పుడు ఆ డివిజన్‌నే జిల్లాగా మార్చామని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. 

 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top