న్యాయవ్యవస్థ ఉద్యోగులకు 60 ఏళ్లు వర్తింపెలా..?

న్యాయవ్యవస్థ ఉద్యోగులకు  60 ఏళ్లు వర్తింపెలా..?


బాధ్యతలను రూల్ కమిటీకి అప్పగించిన హైకోర్టు సీజే

కొందరు ఉద్యోగులతో చర్చలు జరిపిన కమిటీ


 

సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు అజమాయిషీలో పని చేసే న్యాయవ్యవస్థ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచే విషయంపై అధ్యయనం చేసే బాధ్యతలను ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన రూల్ కమిటీకి ప్రధాన న్యాయమూర్తి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఉన్న ఈ రూల్ కమిటీ, హైకోర్టు అజమాయిషీలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తుంది.

 

ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. అంతేకాక ప్రభుత్వ ఉద్యోగుల విభజన ఓ కొలిక్కి రాగా, న్యాయవ్యవస్థ ఉద్యోగుల విభజన మాత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. హైకోర్టుతో పాటు రంగారెడ్డి, నాంపల్లి, సికింద్రాబాద్ కోర్టుల్లో సీమాంధ్రకు చెందిన ఉద్యోగుల సంఖ్య గణనీయంగా ఉంది. అయితే ఉమ్మడి హైకోర్టుతో పాటు, న్యాయవ్యవస్థ ఉద్యోగుల విభజన జరగలేదు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న పదవీ వివరణ వయసు పెంపును ఏ విధంగా అమలు చేయాలన్న దానిపై ఓ నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈ మొత్తం వ్యవహారాన్ని రూల్ కమిటీకి ప్రధాన న్యాయమూర్తి నివేదించారు.

 

ఇందులో భాగంగా కమిటీ కొందరు ఉద్యోగులతో గురువారం మాట్లాడింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగులు కొందరు 60 ఏళ్ల పెంపును వ్యతిరేకించినట్లు సమాచారం. ఉమ్మడి హైకోర్టులో ఉద్యోగుల విభజన జరగనందున, సీమాంధ్రకు చెందిన ఉద్యోగులకు 60 ఏళ్ల పెంపును వర్తింప చేస్తే, దాని ప్రభావం తమ పదోన్నతులపై పడుతుందని, దీంతో తమకు తీరని నష్టం వాటిల్లుతుందని వారు కమిటీ ముందు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో రూల్ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుదనే దానిపై న్యాయవ్యవస్థ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

జిల్లా కోర్టులకు వర్తమానం...

ఉద్యోగ విరమణ వయసు పెంపుపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపింది. దీంతో ఆయా జిల్లాల్లోని న్యాయవ్యవస్థ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఆయా జిల్లాల జడ్జీలకు కలిగినట్లయింది. ఈ పెంపు ఆదేశాలు శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపురం, కడప తదితర జిల్లాల్లో అమలు చేయని విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవ్యవస్థ ఉద్యోగుల సంఘం చైర్మన్ ఎం.రమణయ్య నేతృత్వంలోని ప్రతినిధులు ఇటీవల ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ అన్ని జిల్లాల కోర్టులకు పంపారు. దీనిపై సంఘం చైర్మన్ రమణయ్య, కన్వీనర్ వై.సుబ్బారెడ్డి, కోశాధికారి గోపీనాథ్‌రెడ్డి, వైస్ చైర్మన్ డి.ఆనందరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top