'దూకుడు'పై నిఘా నేత్రం

'దూకుడు'పై నిఘా నేత్రం - Sakshi


ట్రాఫిక్ రూల్స్ మీరితే బుక్ అవుతారు

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే ‘జంపింగ్ జపాంగ్’లూ జాగ్రత్త.. ఇకపై హైదరాబాద్ రహదారులపై రూల్స్ మీరితే  మీ జేబులు గుల్లకావడం ఖాయం.. ఎందుకంటే మహానగరంలోని ప్రతీ ట్రాఫిక్ అధికారి కొంగొత్త కెమెరాతో నిఘానేత్రంగా మారిపోయాడు.

 

సాక్షి, హైదరాబాద్:  ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే ‘రోడ్డుసైడ్ రోమియో’లు.. రెడ్ సిగ్నల్ ఖాతరు చేయకుండా దూసుకెళ్లే ‘జంపింగ్ జపాంగ్’లూ కాస్త జాగ్రత్త.. ఇకపై హైదరాబాద్ రహదారులపై రూల్స్ మీరితే మీ జేబులు గుల్లకావడం ఖాయం.. డ్యూటీలో ఉన్న అధికారిపై దురుసుగా ప్రవర్తిస్తే జైలుకెళ్లడం తథ్యం.. పై అధికారికి ఫోన్ చేసో... చలానా రాసే అధికారికి కాస్త ‘ముట్టజెప్పో’ బయటపడుదామనుకునే చాన్స్ కూడా ఇక లేదు.. ఎందుకంటే ఇప్పుడు మహానగరంలోని ప్రతీ ట్రాఫిక్ అధికారి నిఘానేత్రంగా మారిపోయాడు. ‘బాడీవేర్ కెమెరాలు’ అనే కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మన దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు సరికొత్తగా వచ్చాడు.

 

ట్రాఫిక్ అధికారుల విధుల్లో పారదర్శకత పెంపుతోపాటు నిబంధనల ఉల్లంఘనకు ఒకేసారి చెక్ పెట్టేందుకు ఈ సరికొత్త సాంకేతిక పరికరాలను నెదర్లాండ్స్ నుంచి తెప్పించారు. ఈ బాడీవేర్ కెమెరా ఖరీదు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. వీటి ద్వారా ట్రాఫిక్ పోలీసులు, వాహనదారుల మధ్య జరిగే సంభాషణలను రికార్డు చేయొచ్చు. ట్రాఫిక్ పోలీసుల విధులు సక్రమంగా చేస్తున్నారా లేదా అనే ది కూడా తెలుసుకోవచ్చు.

 

వారం కిందటే ప్రయోగాత్మకంగా సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులకు ఈ కెమెరాలను అందజేశారు. ప్రస్తుతం సైఫాబాద్ ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి ఈ కెమెరాను ఉపయోగిస్తున్నారు. ఈ విధానంలో సత్ఫలితాలు వస్తే త్వరలో నగరంలోని 25 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల అధికారులకు వీటిని అందిస్తామని ట్రాఫిక్ చీఫ్ జితేందర్ తెలిపారు. ఈ కెమెరాలలో రికార్డయిన ఫుటేజీలను బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఉన్న ‘కమాండ్ కంట్రోల్ సెంటర్’లో అధికారులు భద్రపరుస్తారు.

 

 అయితే, ఒకపక్క సెల్‌ఫోన్, మ్యాన్‌ప్యాక్‌తో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న తమకు బాడీవేర్ కెమెరాలు అమర్చితే రేడియేషన్‌కు గురికాక తప్పదని ట్రాఫిక్ అధికారులు వాపోతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని ఆందోళన చెందుతున్నారు.

 

 కెమెరా ఎలా పనిచేస్తుందంటే..

 ట్రాఫిక్ అధికారి దుస్తులకు బాడీవేర్ కెమెరా అమరుస్తారు.

 విధి నిర్వహణలో ఉన్నంత సమయం కెమెరా పనిచేస్తుంది.

 కెమెరాకు 64 జీబీ మెమరీ కార్డు ఉంటుంది.

 రికార్డయిన ఫుటేజీలు కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు నెల రోజుల పాటు భద్రపరుస్తారు.

 ప్రతి కెమెరాకు ఐపీ కోడ్ ఉంటుంది.

 విధినిర్వహణలో ఉండి ఈ కెమెరా పెట్టుకున్న అధికారిని జీపీఎస్ ద్వారా ఎక్కడ ఉన్నాడో గుర్తించవచ్చు.

 

 ఇవీ ఉపయోగాలు..

 వాహనదారుడు, ట్రాఫిక్ అధికారికి మధ్య జరిగిన సంభాషణను ఈ కెమెరాలో వీడి యోతో సహా రికార్డు అవుతుంది.

 విధుల్లో ఉన్న అధికారి వాహనదారులతో ఎలా ప్రవర్తించింది తెలుస్తుంది.

 వాహనదారులూ ట్రాఫిక్ అధికారులతో ఎలా ప్రవర్తించారో తెలుసుకోవచ్చు.

 డ్యూటీలో ఉన్న అధికారితో దురుసుగా మాట్లాడినట్లు తేలితే కేసులు పెట్టొచ్చు.

 అధికారులు ఎన్ని గంటలు ఏ ప్రాంతంలో విధుల్లో ఉన్నారో తెలుసుకోవచ్చు.

 డ్యూటీలో లంచం తీసుకునే అధికారులకు దీని ద్వారా చెక్ పెట్టొచ్చు.

 

 ఇద్దరికీ ఉపయోగమే..

 ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగానే ఈ కెమెరాలు వాడుతున్నాం. ట్రాఫిక్ తనిఖీలో ఉన్న అధికారికి,  వాహనదారుడికి ఈ విధా నం ఉపయోగపడుతుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే అవకాశం ఉండదు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పాల్గొనే ట్రాఫిక్ అధికారులపై వాహనదారులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో.. మంచి పోలీసుకు ఇది ఆయుధంగా ఉపయోగపడుతుంది. త్వరలో అన్ని ట్రాఫిక్ ఠాణాలకు ఈ కెమెరాలను అందించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.

 - మహేందర్‌రెడ్డి, నగర కమిషనర్

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top