హీరో రవితేజ సోదరుడు భరత్‌ దుర్మరణం

హీరో రవితేజ సోదరుడు భరత్‌ దుర్మరణం - Sakshi

ఓఆర్‌ఆర్‌పై కొత్వాల్‌గూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

 

సాక్షి, హైదరాబాద్‌ : ఔటర్‌ రింగ్‌ రోడ్‌(ఓఆర్‌ఆర్‌)పై కొత్వాల్‌గూడ వద్ద శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు రవితేజ సోదరుడు, నటుడు భరత్‌రాజ్‌(50) దుర్మరణం చెందారు. మితిమీరిన వేగంతో ప్రయాణించిన ఆయన కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో చనిపోయిన భరత్‌.. రవితేజ సోదరుడని గుర్తించడానికి కొంత సమయం పట్టింది. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించగలిగారు. భరత్‌ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు అనుమానిస్తున్నప్పటికీ.. పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప నిర్థారించలేమని పోలీసులు చెప్తున్నారు. భరత్‌ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం నేరుగా జూబ్లీహిల్స్‌ రోడ్డులోని మహా ప్రస్థానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

 

నోవాటెల్‌ నుంచి వస్తుండగా ప్రమాదం

వివాహితుడైన భరత్‌రాజ్‌ భార్య అమెరికాలో నివసిస్తుండగా.. ఆయన ప్రస్తుతం మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భరత్‌ శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్‌ హోటల్‌కు వెళ్లినట్లు అక్కడి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రాత్రి 9.20 గంటల సమయంలో భరత్‌ హోటల్‌ నుంచి ఒంటరిగా తన స్కోడా ఒక్టావికా కారు(టీఎస్‌09ఈసీ0799)లో ఇంటికి బయలుదేరినట్లు భావిస్తున్నారు. హోటల్‌ నుంచి దాదాపు 20–25 నిమిషాల ప్రయాణం తర్వాత ఆయన డ్రైవ్‌ చేస్తున్న కారు ప్రమాదానికి లోనైంది. మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణమని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ ఆదివారం తెలిపారు.

 

ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టి..

ఓఆర్‌ఆర్‌పై శంషాబాద్‌ వైపు నుంచి గచ్చిబౌలివైపు లోడ్‌తో వెళ్తున్న లారీ గురువారం మరమ్మతులకు లోనైంది. దాని ఇంజన్‌ ఫెయిల్‌ కావడంతో వాహనాన్ని క్యారేజ్‌ వేలో ఉంచారు. ఓఆర్‌ఆర్‌ పెట్రోలింగ్‌ బాధ్యతలు నిర్వర్తించే సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సైతం లారీ(ఏపీ16టీవై3167) బ్రేక్‌డౌన్‌ అయిన విషయం గుర్తించారు. లారీకి వెనుక వైపు 30 మీటర్ల దూరంలో రిఫ్లెక్టివ్‌ క్రోన్స్‌ ఏర్పాటు చేసి, వాటిని అనుసంధానిస్తూ రిఫ్లెక్టివ్‌ టేప్‌ సైతం కట్టారు. ఆ ప్రాంతంలో లైటింగ్‌ కూడా స్పష్టంగా ఉంది. శనివారం రాత్రి 9.45–10 గంటల మధ్య మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన భరత్‌ వాహనం క్రోన్స్‌ను గుద్దుకుంటూ ముందుకెళ్లి లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీ కొంది.

 

రవితేజ సోదరుడిగా ఆదివారం గుర్తింపు..

ప్రమాదం విషయం తెలుసుకున్న ఆర్‌జీఐఏ పోలీసుస్టేషన్‌ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని.. అతికష్టమ్మీద కారును లారీ కింది నుంచి బయటకు లాగారు. ఆపై అందులో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. అతడి వద్ద లభ్యమైన ఆధార్‌ కార్డును బట్టి చనిపోయిన వ్యక్తి భరత్‌ రాజ్‌గా గుర్తించారు. కారులో లభ్యమైన ఫోన్‌లోని కొన్ని నంబర్లకు పోలీసులు డయల్‌ చేసినప్పటికీ స్పందన రాలేదు. ఓ నంబర్‌కు కాల్‌ చేసి ప్రమాద విషయం తెలుపగా.. ‘ఆస్పత్రికి తీసుకువెళ్లండి’అంటూ సమాధానం వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.



ఆదివారం ఉదయం రవితేజ మరో సోదరుడు రఘు పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో చనిపోయింది రవితేజ మరో సోదరుడు భరత్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కారు ఆయన తల్లి భూపతిరాజు రాజ్యలక్ష్మి పేరుతో రిజిస్టరై ఉంది. గత ఏడాది ఆగస్టు, ఈ ఏడాది ఏప్రిల్‌ నెలల్లో రాంగ్‌ పార్కింగ్‌ చేసినందుకు దీనిపై రెండు ఈ–చలాన్లు(రూ.370) జారీ అయి పెండింగ్‌లో ఉన్నాయి. భరత్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించిన అనంతరం సంబంధీకులకు అప్పగించారు. అక్కడ నుంచి నేరుగా విష్ఫర్‌వ్యాలీలోని మహా ప్రస్థానానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. 

 

ఆది నుంచీ వివాదాస్పదుడే..

ఆది నుంచీ వివాదాస్పదుడైన భరత్‌ మంచి క్రికెట్‌ ప్లేయర్‌. సినీ తారల మ్యాచ్‌లు జరిగినప్పుడల్లా వాటిలో పాల్గొనేవాడు. భరత్‌పై గతంలో మాదకద్రవ్యాలు, పోలీసులతో దురుసు ప్రవర్తన కేసులు సైతం నమోదయ్యాయి. సోదరుడు రవితేజ నటించిన కొన్ని సినిమాలతో పాటు పలు చిత్రాల్లో సహాయ నటుడిగా.. ప్రతినాయకునిగా భరత్‌ నటించాడు. దూకుడు, ఆగడు, అతడే ఒక సైన్యం, పెదబాబు, 143, నేనింతే తదితర చిత్రాల్లో పాత్రలు పోషించాడు.

 

అతివేగమే ప్రాణం తీసిందా..?

కారు ముందు టైరు.. లారీ వెనుక టైరుకు ఢీ కొనే వరకు కారు చొచ్చుకుపోయి నుజ్జునుజ్జయ్యింది. ఆ సమయంలో కారు గంటకు 145 కి.మీ. వేగంతో దూసుకెళ్లినట్లు లాక్‌ అయిన స్పీడో మీటర్‌ స్పష్టం చేస్తోంది. ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచు కున్నప్పటికీ కారు లారీ కిందికి దూసుకు పోవడంతో అవి భరత్‌ ప్రాణాలు కాపాడలేకపోయాయి. కారులో సగం ఖాళీ అయిన ఓడ్కా బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాద సమయంలో భరత్‌ మద్యం మత్తులో ఉన్నాడా? లేదా? అనేది పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే చెప్పగలమని పోలీసులు అంటున్నారు. మితిమీరిన వేగంతో కారులో వస్తున్న భరత్‌ ఆగి ఉన్న లారీని గుర్తించి ఉండడని పోలీసులు చెప్తున్నారు. ఆ ప్రాంతంలో కారుకు బ్రేక్‌ వేసినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

అంత్యక్రియలకు హాజరుకాని రవితేజ

భరత్‌ అంత్యక్రియలను రవితేజ మరో సోదరుడు రఘు, బాబాయ్‌ మూర్తి రాజు పూర్తి చేశారు. రవితేజతో పాటు కుటుంబ సభ్యులెవరూ అంత్యక్రియలకు హాజరుకాలేదు. అయితే ప్రమాదంలో నుజ్జునుజ్జయిన తమ్ముడి మృత దేహాన్ని తాను చూసి తట్టుకోలేనని, అందుకే అంత్యక్రియలకు వెళ్లలేనని, తమ కుటుంబ సభ్యుల పరిస్థితి అర్థం చేసుకోవాలని రవితేజ తన సన్నిహిత వర్గాల వద్ద వాపోయినట్టుగా సోషల్‌ మీడియాలో ప్రచారం సాగు తోంది. కాగా, భరత్‌ అంత్యక్రియలకు జీవితా రాజ శేఖర్, అలీ, ఉత్తేజ్, రఘుబాబు హాజరయ్యారు.
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top