స్టార్టప్‌లకు సాయం

స్టార్టప్‌లకు సాయం - Sakshi


‘సాఫ్ట్ బ్యాంక్’కు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

- సంస్థ సీవోవో నికేశ్ అరోరాతో భేటీ

- ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరణ

 

 సాక్షి, హైదరాబాద్: ఇన్నోవేషన్ రంగంలో స్టార్టప్‌లకు సాయం అందించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కె. తారక రామారావు జపాన్ బహుళజాతి ఆర్థిక సంస్థ ‘సాఫ్ట్ బ్యాంక్’కు విజ్ఞప్తి చేశారు. రెండు వారాల అమెరికా పర్యటనలో భాగంగా కేటీఆర్ మంగళ వారం కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో సాఫ్ట్ బ్యాంక్ ప్రెసిడెంట్, సీవోవో (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) నికేశ్ అరోరాతో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కేటీఆర్ వివరించారు. తెలంగాణ ఐటీ పాలసీ ప్రత్యేకతలను వివరిస్తూ ఇన్నోవేషన్ రంగంలో పరిశోధనలకు ఊతమిచ్చేందుకు ఇన్నోవేషన్ పాలసీని ప్రకటించామన్నారు.



తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన టీ హబ్‌కు దేశవ్యాప్తంగా స్పందన లభిస్తోందని.. ఇన్నోవేషన్ రంగంలో స్టార్టప్‌లకు సాయం అందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ప్రత్యేకతలను వివరించడంతోపాటు రెండేళ్ల ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు నికేశ్ పలు సూచనలిచ్చారు. టెలికమ్యూనికేషన్లు మొదలుకుని మీడియా, ఫైనాన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టిన సాఫ్ట్ బ్యాంక్... బ్రాడ్ బ్యాండ్, ఇంటర్నెట్, ఈ కామర్స్, మార్కెటింగ్ రంగాల్లోనూ పెట్టుబడులను విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కేటీఆర్.. నికేశ్‌కు వివరించారు. ఇండియానాపోలిస్, మిన్నెపోలిస్ నగరాల్లో అమెరికా పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశాల్లో టీఎస్ ఐపాస్ తరహా విధానాలపై వారు ఆసక్తి చూపారని వివరించారు. నికేశ్‌తో జరిగిన సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. కేటీఆర్ మూడు రోజులపాటు సిలికాన్ వ్యాలీలో పర్యటించనున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top