నగరంలో హెలికాప్టర్ జాయ్ రైడ్

నగరంలో హెలికాప్టర్ జాయ్ రైడ్


♦ నెక్లెస్ రోడ్‌లో కొత్తగా హెలీప్యాడ్ నిర్మిస్తున్న హెచ్‌ఎండీఏ 

♦ జాయ్‌రైడ్ ప్రారంభించేందుకు టూరిజం శాఖ సన్నాహాలు


 సాక్షి, హైదరాబాద్: నగరంలో హెలికాప్టర్ జాయ్ రైడ్‌కు హుస్సేన్‌సాగర తీరం వేదిక కానుంది. నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌కు సమీపంలో హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) కొత్తగా ఓ హెలీప్యాడ్‌ను రూపొందిస్తోంది. గతంలో ‘బీచ్ వాలీబాల్’ పోటీల కోసం కోర్టును నిర్మించిన స్థలంలో ఇప్పుడు హెలీప్యాడ్ సిద్ధమవుతోంది. సుమారు 30 మీటర్ల విస్తీర్ణంలో రూ.4 లక్షల వ్యయంతో ఈ హెలీప్యాడ్‌ను నిర్మిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు తెలిపారు.


నగరంలో ప్రయోగాత్మకంగా హెలికాప్టర్ జాయ్ రైడ్‌ను ప్రారంభించేందుకు టూరి జం శాఖ సన్నాహాలు చేస్తోందని, ఇందుకోసం హుస్సేన్‌సాగర్ తీరంలో 30 మీటర్ల విస్తీర్ణంలో హెలీప్యాడ్‌ను నిర్మించాలని హెచ్‌ఎండీఏను కోరిందని తెలిపారు. ఆ మేరకు నెక్లెస్‌రోడ్‌లో హెలీప్యాడ్‌ను రూపొందిస్తున్నామని, ఇది తాత్కాలికమే కనుక కాంక్రీట్‌తో కాకుండా మొరంతోనే బేస్‌మెంట్‌ను తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. నగరాన్ని సందర్శించే పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని నెలరోజుల పాటు హెలికాప్టర్ జాయ్ రైడ్‌ను నిర్వహించాలని పర్యాటక శాఖ భావిస్తోందన్నారు.


ఈ జాయ్ రైడ్‌ను వేసవిలో ప్రారంభించే అవకాశం ఉందని, హెలికాప్టర్ హైదరాబాద్ నగరం చుట్టూ ఓ రౌండ్ కొట్టి సాగర్ వద్ద ల్యాండ్ అవుతుందని వివరించారు. ఈ రైడ్ ఎంత సేపు ఉంటుంది? ఎంత చార్జీ వసూలు చేస్తారు? వంటివి పర్యాటక శాఖే నిర్ణయించి నిర్వహిస్తుందని తెలిపారు. హెలికాప్టర్ జాయ్ రైడ్‌కు ఏవియేషన్ క్లియరెన్స్, ఇతర అనుమతులన్నీ టూరిజం శాఖ తెచ్చుకుంటుందని తెలిపారు. హెలీప్యాడ్‌ను వారం రోజుల్లో పూర్తి చేసి టూరిజం శాఖకు అప్పగిస్తామన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top