ఇదో 'మహా'నరకం

ఇదో  'మహా'నరకం - Sakshi


నగరంలో నిన్న వాన కురిసింది... ఈ రోజూ వానొచ్చింది..రేపూ వస్తుంది. వాన సీన్‌ సేమ్‌ టు సేమ్‌. అలాగే వాన కష్టాలూ సేమ్‌. ప్రతీ వర్షాకాలంలో నగర జీవి అల్లాడాల్సిందే వానొస్తే భయమేస్తోంది. ఆఫీసుకు ఎలా వెళ్లాలనే టెన్షన్‌ నీళ్లు నిండిన రహదారులు.. మింగేసే మ్యాన్‌హోళ్లు..  ట్రాఫిక్‌ పద్మవ్యూహాలు.. వాహనాల పొల్యూషన్‌.. బోనస్‌గా రోగాలు.. అత్తాపూర్‌ వెంకటేశ్‌ మాట ఇదే.. హయత్‌నగర్‌ రాధిక మాట ఇదే.. కూకట్‌పల్లి శ్రీనివాస్‌ మాట ఇదే... ఇంకెన్నాళ్లు?? ఎన్నేళ్లు???



పల్లెల్లో వానొస్తే ఆనందం. పట్నంలో మాత్రం నరకమే. మరీ భాగ్యనగరంలో వాన కష్టాలు నానావిధాలు. నీటితో నిండిన గుంతల రహదారులు, ఉప్పొంగే నాలాలు, పొంగిపొర్లే మ్యాన్‌హోళ్లు నగరవాసి ప్రయాణాన్ని దుర్భరం చేస్తున్నాయి. ట్రాఫిక్‌ సమస్యలు వాహనదారులను పట్టిపీడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షం కురిసిన రోజున...అధ్వానపు రోడ్లు.. వాననీటి గుంతలు...ట్రాఫిక్‌ అవస్థలు..  ప్రయాణం పాట్లు తెలుసుకునేందుకు ‘సాక్షి’ సోమవారం నగరంలోని ఏడు ప్రధాన రూట్లలో\ ‘ప్రత్యక్ష పరిశీలన’ జరిపింది.    

–సాక్షి, సిటీనెట్‌వర్క్‌



బోడుప్పల్‌ చౌరస్తా టు బంజారాహిల్స్‌ జీవీకే

రూట్‌ మ్యాప్‌: బోడుప్పల్‌ చౌరస్తా, ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు, హబ్సిగూడ చౌరస్తా, తార్నాక చౌరస్తా, మెట్టుగూడ, అలుగడ్డల బావి, సికింద్రాబాద్‌ చౌరస్తా , సికింద్రాబాద్‌ ఫ్లై ఓవర్, బేగంపేట, పంజగుట్ట చౌరస్తా, నిమ్స్‌ ఆస్పత్రి, జీవీకే.

పీక్‌ అవర్స్‌లో కేవలం ఉప్పల్‌ చౌరస్తా, సికింద్రాబాద్‌ ఫ్లై ఓవర్, బేగంపేట ఫ్లైఓవర్,

జీవీకే వద్ద మాత్రమే ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు కనిపించారు.



ఈదారిలో ప్రయాణం నిత్య నరకం

ఈ మార్గంలో ప్రయాణం నిత్యనరకం. ట్రాఫిక్‌ను గుర్తు చేసుకుంటే భయం పడుతుంది. వాన వచ్చిన రోజైతే ఆ బాధ వర్ణణాతీతం. బోడుప్పల్‌ నుంచి బంజారాహిల్స్‌ జీవీకే వరకు దాదాపు 22 కి.మీ. దూరం ప్రయాణించడానికి గంట 49 నిమిషాలు పట్టింది. ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు వద్ద రోడ్డు వెడల్పుగా ఉన్నా జీహెచ్‌ఎంసీ అధికారులు రోడ్డును తవ్వి వదిలేయడంతో మూలమలుపు మీద వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

   

⇒ ఏక్‌మినార్‌ మసీదు వద్ద మంచినీటి పైపులైన్‌ కోసం రోడ్డు తవ్వి వదిలేయడంతో రోడ్డుపై నీరు నిలిచి ట్రాఫిక్‌ జాం ఏర్పాడుతోంది.

⇒హబ్సిగూడ చౌరస్తా వద్ద హోటళ్ల మ్యాన్‌హోల్స్‌ పొంగి పొర్లడంతో రోడ్డంతా మురుగు చేరి ట్రాఫిక్‌ స్తంభించిపోతుంది.

⇒రైల్‌ నిలయం వద్ద రోడ్డు ఎత్తుగా వేయడం వల్ల అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి.

⇒ సికింద్రాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌ పాఠశాల వద్ద రోడ్డు బాటిల్‌ నెక్‌ కావడంతో వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి.

⇒ సికింద్రాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌ పాఠశాల నుంచి మొదలు పంజగుట్ట ఫ్లై ఓవర్‌ చేరుకునే వరకు ట్రాఫిక్‌ నత్తనడకగానే సాగుతోంది.



మియాపూర్‌ టు నిమ్స్‌ ఆస్పత్రి

మియాపూర్‌ నుంచి ఉదయం 8 గంటలకు ప్రయాణం మొదలైంది. ఈ మార్గంలో ట్రాఫికర్‌తో సొమ్మసిల్లే దుస్థితి. వాహనాలు గొలుసుకట్టుగా వెళుతున్నాయి. సగటు వాహనవేగం 10 నుంచి 15 కిలోమీటర్లు మించలేదు. సిగ్నల్స్, యూటరŠన్స్‌ వద్ద కొద్దిసేపు ఆగాల్సి వచ్చింది. ఈ రూట్లో దాదాపు 10 చోట్ల సిగ్నల్స్, యూటర్న్‌లు ఉన్నాయి. కొద్దిపాటి వర్షం రాగానే ట్రాఫిక్‌ జామైంది. అమీర్‌పేట్‌ శ్మశానవాటిక వద్ద రోడ్డు ఇరుకుగా ఉంది. ఎర్రగడ్డ, సనత్‌నగర్‌ మెయిన్‌ రోడ్డుపై గోతులున్నాయి. కూకట్‌పల్లి, వైజంక్షన్, ఎర్రగడ్డ, మైత్రీవనం, పంజగుట్ట చౌరస్తాలో భారీగా ట్రాఫిక్‌ ఆగిపోయింది. వర్షం వచ్చి, రోడ్లపై వరద నీరు ఉంటే మియాపూర్‌ నుంచి నిమ్స్‌కు చేరేందుకు 1.30 గంటల సమయం పట్టింది.



బోయిన్‌పల్లి టు హైటెక్స్‌

బోయిన్‌పల్లిలో ఉదయం 8.45 గంటలకు బయలుదేరితే హైటెక్స్‌కు చేరేసరికి 9.50 సమయం పట్టింది. ప్యారడైజ్, రసూల్‌పురా చౌరస్తాల్లో విపరీతంగా ట్రాఫిక్‌జామ్‌ ఉంది. బేగంపేట విమానాశ్రయం ఫ్లై ఓవర్‌ నుంచి బేగంపేట పబ్లిక్‌ స్కూల్‌ వరకు వాహనాలు బారులు తీరాయి. సోమాజిగూడ చౌరస్తా నుంచి పంజగుట్ట చౌరస్తా వరకు రహదారి విశాలంగా ఉన్న కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగలేదు.



నాగార్జున సర్కిల్‌ మొదలు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు వాహనాలు బారులు తీరాయి. లెక్కకు మించిన కార్లతో రహదారులు నిండిపోయాయి. రెండవ గేర్‌కు మించి వాహనాలు ముందుకు సాగలేదు. ఈ రహదారిలో తవ్వకాలు, వరదనీటి నిల్వలు వాహనాల రాకపోకలకు ఆటంకంగా నిలిచాయి. ప్రయాణం పెద్దమ్మతల్లి దేవాలయం క్రాస్‌రోడ్డు దాటింది మొదలు కావేరిహిల్స్‌ మీదుగా హైటెక్స్‌ వరకు భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయింది. మెట్రో పిల్లర్ల నిర్మాణాలు, గోతుల రహదారులతో ఈ రూట్లో ట్రాఫికర్‌తో విలవిల్లాడాల్సిన పరిస్థితి.



కొంపల్లి టు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌

కొంపల్లి నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు ఉదయం 9 గంటలకు ద్విచక్ర వాహనంపై ప్రయాణం మొదలైంది. కొంపల్లి నుంచి సుచిత్రా మీదుగా బోయిన్‌పల్లి వరకు సులభంగా చేరుకున్నా.. అక్కడి నుంచి ట్రాఫికర్‌ స్వాగతం పలికింది. చినటోకటా, తాడ్బండ్, ప్యారడైజ్, ప్యాట్నీ వరకు ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. సుచిత్రా జంక్షన్‌ వద్ద ఉన్న ఆర్‌యూబీ బ్రిడ్జి వద్ద ట్రాఫికర్‌తో కష్టాలు పడాల్సి వచ్చింది. 18 కిలోమీటర్లు ఉన్న ఈ రూట్‌లో  సిగ్నలింగ్‌ వ్యవస్థలు సుచిత్రా, బోయిన్‌పల్లి చెక్‌పోస్ట్, బోయిన్‌పల్లి క్రాస్‌ రోడ్డు, తాడ్‌బన్, ప్యారడైజ్, ప్యాట్నీ వద్ద ఉన్నాయి. అత్యధిక సమయం సుచిత్రా వద్ద, ప్యారడైజ్, ప్యాట్నీ వద్ద తీసుకుంది.   



నిజాంపేట టు  హైటెక్‌ సిటీ

ఈ మార్గంలో ఉదయం 9 గంటలకు ద్విచక్రవాహనంపై ప్రయాణం మొదలైంది. ముంబయి జాతీయ రహదారిపై నిజాంపేట చౌరస్తా వరకు మూడు కిలోమీటర్ల దూరం చేరేందుకు 25 నిమిషాలు పట్టింది. నిజాంపేట చౌరస్తా నుంచి జేఎన్‌టీయూ జంక్షన్‌ వరకు ట్రాఫిక్‌ జాంతో వాహనాలు నత్తనడకన సాగాయి. జేఎన్టీయూ జంక్షన్‌ నుంచి హైటెక్‌ సిటీ రోడ్డులోని మలేసియా టౌన్‌షిప్‌ సర్కిల్‌ వరకు ఇదే దుస్థితి.హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ ఫ్లైవర్‌పై ట్రాఫిక్‌జాంతో అవస్థలు పడాల్సి వచ్చింది. ఒకవైపు ఆఫీసు టైం అయిపోతుందనే కంగారు.. మరోవైపు వర్షం పడుతుందనే ఆందోళన.. వెరసి ప్రతి ఒక్కరిలో ఆందోళన కనిపించింది. హైటెక్‌ సిటీ ఫ్లైవర్‌ మీదుగా టీసీఎస్‌ వరకు ఇదే పరిస్థితి. గచ్చిబౌలి ఫ్లైవర్‌ వద్దకు రాగానే వేగం మరింత తగ్గిపోయింది. మొత్తం 16 కిలోమీటర్ల దూరం చేరుకోవడానికి 1.47 గంటల సమయం పట్టింది.



ప్రగతినగర్‌ టు జేఎన్‌టీయూహెచ్‌

ప్రగతినగర్‌ నుంచి ఉదయం 9.30కు ప్రయాణం మొదలైంది. జేఎన్‌టీయూహెచ్‌కు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 30 నిమిషాలకు పైగా సమయం పట్టింది.  ఆదిత్యానగర్, అడ్డగుట్ట సొసైటీ ప్రాంతాల్లోని చౌరస్తా వద్ద రెండు వైపులా ట్రాఫిక్‌ స్తంభించింది.నిజాంపేట చౌరస్తా నుంచి కూకట్‌పల్లి బస్‌స్టాప్‌ వరకు ట్రాఫిక్‌ రద్దీ తీవ్రంగా ఉంది. జేఎన్‌టీయూ చౌరస్తా వద్ద ట్రాఫిక్‌ సిగ్నల్‌ దాటి కూకట్‌పల్లి బస్‌స్టాప్‌కు చేరడానికి దాదాపు 30 నిమిషాల సమయం పట్టింది భాగ్యనగర్‌కాలనీ బస్టాప్‌ వద్ద పాదచారుల కోసం ప్రత్యేకంగా సిగ్నల్స్‌ పెట్టినప్పటికీ అవి పనిచేయడంలేదు. ఈమార్గంలోని యూటరŠన్స్‌ వద్ద వాహనాలు ఒక వైపు నుంచి మరో వైపునకు మళ్లే సమయంలో గందరగోళం నెలకొంటోంది.  



చాంద్రాయణగుట్ట టు నాంపల్లి

చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ వద్ద ఉదయం 8.45కు ప్రయాణం మొదలెడితే నుంచి నాంపల్లి రైల్వేస్టేషన్‌ వరకు 9.8 కి.మీ. దూరం చేరుకునేందుకు అరగంటకు పైగా సమయం పట్టింది. ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి ఇరుకుగా మారడడంతో వాహనాల వేగం మందగించింది. ఫలక్‌నుమా రైతుబజార్‌ వద్ద వినియోగదారుల వాహనాలు రోడ్డుపై పార్కు చేస్తుండడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. నాంపల్లిలో మెట్రో స్టేషన్‌ పనులతో దారి మళ్లించిన రూట్‌లో రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో వాహనాల వేగం మరింత తగ్గిపోయింది. రోడ్డు బాగుంటే 10 నిమిషాల్లో వెళ్లేవారు.. మొత్తం 9.8 కి.మీ.కు 33 నిమిషాలు పట్టింది. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top