వర్ష విలయం

వర్ష విలయం - Sakshi


గ్రేటర్‌లో 8 సెంటీమీటర్ల కుండపోత వర్షం

స్తంభించిన జనజీవనం.. అకాల వర్షంతో అపార నష్టం


 

 సాక్షి, హైదరాబాద్: కుండపోత వర్షానికి భాగ్యనగరం గడగడలాడింది. శుక్రవారం తెల్లవారు జామున  ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షపు నీటి ధాటికి నాలాలు ఉప్పొంగాయి.. చెరువులు కాలువలను తలపించాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు చోట్ల హోర్డింగులు, బోర్డులు కుప్పకూలాయి. తెల్లవారుజామున మూడు గంటల పాటు జడివాన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. అకాల వర్షం కారణంగా నగరంలో అపారమైన ఆస్తి నష్టం సంభవించింది.



 38 ఏళ్ల తర్వాత రికార్డు వర్షపాతం..

 గ్రేటర్ పరిధిలో 1978 మే 24న 7.9 సెంటీమీటర్ల రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు ఇదే రికార్డు. 38 ఏళ్ల విరామం తర్వాత 2016 మే 6న ఏకంగా 8 సెంటీమీటర్ల  మేర కుండపోత వర్షపాతం నమోదవడంతో పాత రికార్డు బద్దలైంది. ఉపరితల ద్రోణి ప్రభావం, క్యుములో నింబస్ మేఘాల ఉధృతి, గాలిలో తేమ శాతం అధికంగా ఉండడంతో భారీ వర్షం కురిసినట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం డెరైక్టర్ వైకే రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మూడు గంటల వ్యవధిలో 8 సెంటీమీటర్ల వర్షం కుండపోతగా కురవడం.. అదీ మే తొలివారంలో భారీ వర్షపాతం నమోదవడం రికార్డేనన్నారు. శని, ఆదివారాల్లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున సరూర్‌నగర్‌లో 7.4 సెంటీమీటర్లు, గోల్కొండలో 6 సెంటీమీటర్లు, హయత్‌నగర్, యాచారంలో 6 సెంటీమీటర్లు, శామీర్‌పేట్‌లో 4.2 సెంటీమీటర్లు, మేడ్చల్‌లో 4 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.



 అంధకారంలో గ్రేటర్

 ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరా వ్యవస్థ కుప్పకూలింది. చెట్లు విరిగి విద్యుత్ లైన్లపై పడటంతో వైర్లు తెగిపోయాయి. పలు చోట్ల కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలాయి. ఎక్కడికక్కడ ఫీడర్లు ట్రిప్పైపోవడంతో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి తెల్లవారే వరకు ‘గ్రేటర్’లో పూర్తిగా అంధకారం అలముకుంది. సాయంత్రం ఐదు గంటల వరకు 70 శాతం ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ను పునరుద్ధరించగా, మరో 30 శాతం ఫీడర్ల పరిధిలో రాత్రి పొద్దుపోయే వ రకు విద్యుత్ సరఫరా కాలేదు. కరెంట్ లేకపోవడంతో నగరవాసులు రోజంతా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 

 నీటమునిగిన 1,288 ఇళ్లు..

 హైదరాబాద్ జిల్లా పరిధిలోని 16 మండలాల్లో 1,288 ఇళ్లు నీట మునిగినట్లు రెవెన్యూ యంత్రాంగం లెక్కగట్టింది. ఒక ఇల్లు పూర్తిగా కూలిపోగా.. మూడిళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని తెలిపింది. రూ.కోట్లలో ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. శేరిలింగంపల్లి, మియాపూర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్, చంపాపేట్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, కూకట్‌పల్లి, ఉప్పల్, తార్నాక, ఖైరతాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న బస్తీలను వర్షపునీరు ముంచెత్తింది. దీంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు మొదలైనవి నీటమునిగాయి. వర్షం నీరు భారీగా నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇళ్లలోకి చేరిన నీటిని తొలగించేందుకు స్థానికులు నానా అవస్థలు పడ్డారు. జలమండలి, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎయిర్‌టెక్ యంత్రాల ద్వారా లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపునీటిని తొలగించారు.

 

 ఇబ్బందులు లేకుండా చూడండి: కేటీఆర్

 
నగరంలో అకాల వర్షం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. పాలేరు ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న ఆయన జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లతో మాట్లాడి నగరంలో పరిస్థితిపై సమీక్షించారు. జీహెచ్‌ఎంసీ, విద్యుత్, ట్రాఫిక్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలన్నారు. నగరంలో పరిస్థితులపై మంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతోనూ మాట్లాడారు.

 

 సహాయక చర్యల్లో కమిషనర్

  అధికారుల అప్రమత్తత, వివిధ శాఖల మధ్య సమన్వయం కారణంగా నగరంలో పరిస్థితులను త్వరితంగా చక్కదిద్దగలిగారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఖమ్మం నుంచే పరిస్థితిని సమీక్షించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి శుక్రవారం ఉదయం 6 గంటలకే క్షేత్రస్థాయిలో పనులను స్వయంగా పర్యవేక్షించారు. అంతే కాదు.. ఆయనే స్వయానా రంపం చేతబట్టి రోడ్డుకు అడ్డుగా పడిన చెట్లను తొలగించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఉదయం 10.30 గంటలకు ప్రధాన రహదారుల్లోని అడ్డంకులను తొలగించారు.

 

 పదేళ్లుగా గ్రేటర్‌లో మే నెలలో రికార్డు వర్షపాతం నమోదైన రోజులు..

 

 మిల్లీ మీటర్లలో



 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top