హడలె త్తిస్తోన్న ఆకు కూరలు

హడలె త్తిస్తోన్న ఆకు కూరలు - Sakshi


ఏ రకమైనా 3 కట్టలు రూ.10లు  

వినియోగదారులు విలవిల


 

హైదరాబాద్ మహా నగరంలో మండుతున్న ఎండలకు తోడు ఆకు కూరల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. మార్కెట్లో ఏరకం కూరను కొందామన్నా నాలుగు రెమ్మల ధర రూ.10లకు పైమాటే పలుకుతోంది.  ప్రత్యేకించి నాన్‌వెజ్ (మాంసాహారం) తినేవారు  కొత్తిమీర, పుదీనా వంటివాటిని వినియోగించడం తప్పనిసరి.  వెజిటేరియన్స్ కూడా అన్నిరకాల కూరగాయలతో పాటు కొత్తిమీర, పుదీనాలను విధిగా కొనుగోలు చేస్తారు. చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు ఇలా ఏ రకం వంటకానికైనా మషాలా వినియోగం తప్పనిసరి. దీనికి అదనంగా కొత్తిమీర, పుదీనాలను జత చేస్తే ఆ వంటకం ఘుమ ఘుమలాడాల్సిందే. అయితే... అన్ని రకాల కూరల్లో సువాసనకు ముడిసరుకుగా వినియోగించే కొత్తిమీర, పుదీనా ధరలు వినగానే వినియోగదారుడి జేబులను కాళీ చేస్తున్నాయి. 



శనివారం మార్కెట్లో చిటికెన వేలంత మందమున్న 3 చిన్న సైజ్ కొత్తిమీర కట్టలు రూ.10లు ధర పలికాయి. ఒక కట్ట కొంటే మాత్రం రూ.5లు వసూలు చేశారు. ‘కనీసం రూ.10లకు కొంటేనే కొత్తిమీుర ఇస్తాం... లేదంటే వెళ్లండి’ అంటూ వ్యాపారులు ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. మార్కెట్‌కు కొత్తిమీర తక్కువగా వస్తుండటమే ఇందుకు కారణంగా కన్పిస్తోంది. గుడిమల్కాపూర్, బోయిన్‌పల్లి, మాదన్నపేట్ మార్కెట్లకు ఉదయాన్నే రైతులు తీసుకొచ్చే సరుకును వ్యాపారులు హాట్‌కేకుల్లా ఎగరేసుకు పోతున్నారు. హోల్‌సేల్ మార్కెట్లో 4 కట్టలు రూ.10ల ప్రకారం విక్రయిస్తున్నారు. అయితే... వ్యాపారులు వాటిని తిరిగి చిన్నకట్టలుగా కట్టి 3 కట్టలు రూ.10-12ల ప్రకారం అమ్ముతున్నారు. తోపుడు బండ్లపై అమ్మేవారు ఇళ్ల వద్దకే తెస్తున్నామంటూ చిన్నకట్టకు రూ.6ల ప్రకారం వసూలు చేస్తున్నారు. పుదీనా ధర కూడా కొత్తిమీర ధరనే ఫాలో అవుతోంది. పాలకూర, తోటకూర, గోంగూర, బచ్చలకూర, గంగవాయిల్ కూర, చుక్కకూర, మెంతికూర ధరలు కూడా ఇదే వరుసలో ఉండటంతో సగటు వినియోగదారుడిని హడలెత్తిస్తోంది. వీటిలో ఏది కావాలన్నా 3-4 చిన్నకట్టలు రూ.10ల ప్రకారం ఇస్తున్నారు. వేసవిలో విరివిగా పండే ములక్కాడలు కూడా రూ.10లకు 4 చొప్పున విక్రయిస్తున్నారు.



వీటిలో సైజ్‌ను బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ధర పలుకుతున్నాయి. వేసవిలో బోర్లు, బావులు ఎండిపోవడంతో ఆకుకూరల సాగు గణనీయంగా పడిపోయిందని రైతులు చెబుతున్నారు. ఈ కారణంగానే నగర డిమాండ్‌కు తగ్గట్టు ఆకుకూరలు సరఫరా  కావట్లేదని, ఆ కొరతే ధరల పెరుగుదలకు దారితీసిందటున్నారు. ఆకుకూరలు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొనే పరిస్థితి లేదు. స్థానిక ఉత్పత్తులపైనే ఆధారపడాల్సి రావడంతో అదీ ఇదీ అని కాకుండా అన్ని రకాల ఆకుకూరల ధరలు ఇప్పుడు హడలెత్తిస్తున్నాయి. జూన్‌లో వర్షాలుపడి కొత్తసాగు దిగుబడి వచ్చే వరకు ఆకు కూరల ధరలు ఇలాగే ఉంటాయనివ్యాపారులు చెబుతున్నారు.  

 

 ఆకు కూరల ధరలు

 

కొత్తిమీర (3కట్టలు)    రూ.10-12

పుదీనా (3-4కట్టలు)    రూ.10

గోంగూర(4 కట్టలు)    రూ.10

తోటకూర    ’’    రూ.10

పాలకూర    ’’    రూ.10

బచ్చలకూర  ’’    రూ.10

చుక్కకూర   ’’     రూ.10

మెంతికూర  ’’    రూ.10

గంగబాయిల్‌కూర ’’    రూ.10

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top