‘ఏఎంఎస్’ తాళం బద్దలు

‘ఏఎంఎస్’ తాళం బద్దలు - Sakshi


ఆరోగ్య కేంద్రాన్ని తెరిచిన అధికారులు

బోర్డుపై ఆంధ్రా పేరు తొలగింపు

 

సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర మహిళా సభ (ఏఎంఎస్) ఆరోగ్య శిక్షణా కేంద్రాల మూసివేత వ్యవహారం సమసిపోయింది. ఒక కేంద్రం తలుపులు తెరుచుకున్నాయి. నిధుల కొరత సాకుతో రాష్ట్రంలోని మూడు ఆరోగ్య శిక్షణా కేంద్రాలకు ఏఎంఎస్ యాజమాన్యం తాళాలు వేసిన  దానిపై సాక్షి  కథనాలు ప్రచురించిన విషయం  తెలిసిందే. ముందస్తు సమాచారం లేకుండా సంగారెడ్డిలోని కేంద్రానికి అర్ధరాత్రి తాళం వేసిన సంఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించి ఆ కేంద్రాన్ని తెరిచేందుకు ఆదేశాలు జారీచేశారు.


ఏఎంఎస్ యాజమాన్య తీరుపై ఉద్యోగులు, విద్యార్థులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, త్వరలో నిధులను కేటాయించేం దుకు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. దీంతో మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఆరోగ్యశాఖ అధికారి శనివారం సంగారెడ్డి కేంద్రాన్ని తెరిచారు. స్వయంగా జిల్లా ఆరోగ్యశాఖ అధికారి అమర్‌సింగ్ నాయ క్ సుత్తి చేతపట్టి తాళం పగలగొట్టి కేంద్రంలోకి వెళ్లారు.


తెలంగాణలో ఉన్న ఎన్‌జీవోలపై ఆంధ్రమహిళా సభ యాజమాన్యం పెత్తనం కుదరదని అమర్‌సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్యపరమైన లాభాల కోసమే కేంద్రాలను మూసివేసే ప్రయత్నం చేశారన్నారు. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఈ కేంద్రాలపై ఆంధ్ర మహిళా సభ యాజమాన్యానికి ఎలాంటి అధికారం లేదన్నారు.


మహిళా విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్న కేంద్రాలపై అన్యాయంగా ప్రవర్తిస్తున్న ఏఎంఎస్‌పై చర్యలు తీసుకోవాలని ఆ సెంటర్ ప్రిన్సిపాల్ జ్యోతి డిమాండ్ చేశారు. కేంద్రాన్ని తెరిచిన వెంటనే అమర్‌సింగ్ సమక్షంలోనే ప్రిన్సిపాల్ విద్యార్థులకు ఫోన్ చేసి రేపటి నుంచి శిక్షణా తరగతులు కొనసాగుతాయని చెప్పారు. పేద విద్యార్థులతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటామని అమర్‌సింగ్ హెచ్చరించారు. బోర్డు మీద ఆంధ్రా పేరును తొలగించి తెలంగాణ అని రాశారు. త్వరలో మహబూబ్‌నగర్, విద్యానగర్‌లోని కేంద్రాలు కూడా తెరుచుకుంటాయని చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top