తెలంగాణకు ఆయనే బ్రాండ్

తెలంగాణకు ఆయనే బ్రాండ్ - Sakshi


పాణం పోయినా సరే..కోటి ఎకరాలకు సాగునీటిని పారిస్తా...నా తెలంగాణ కోటి ఎకరాల రతనాల వీణ అని నిరూపిస్తా

సాగునీటికి రూ.25 వేల కోట్లు కేటాయించాం. ఇదేం తమాషాకో, చక్కిలిగింతలు పెట్టెందుకో కాదు. ప్రాజెక్టులన్నీ కట్టి తీరుతం.రైతుల కన్నీళ్లు తుడిచి చూపిస్తం




- ముఖ్యమంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న కేసీఆర్  విభిన్న సంక్షేమ పథకాలతో ముందుకు..

- జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు  విలక్షణ నిర్ణయాలు.. అప్రతిహత విజయాలు

- రాజకీయ చతురతతో విపక్షాలకు కళ్లెం  వరుసగా ఉప ఎన్నికల్లో ఘన విజయాలు


 

 పత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ మూడో ఏడాదిలో అడుగుపెడుతోంది. ప్రజాకర్షక పథకాలు, వినూత్న కార్యక్రమాలతో రెండేళ్లలోనే జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొత్త రాష్ట్రమైనప్పటికీ ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించే నూతన పారిశ్రామిక విధానం.. వినూత్నంగా రూపొందించిన ఐటీ విధానం... కోటి ఎకరాలకు సాగునీటిని అందించే సమగ్ర జల విధానం.. కొత్త పంథాలో బడ్జెట్ తయారీ.. మిషన్ భగీరథ.. మిషన్ కాకతీయ వంటి పథకాలు ‘తెలంగాణ బ్రాండ్’కు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెడుతున్నాయి. వీటన్నింటికీ కారణం ఒకే ఒక్కడు.. కేసీఆర్


 

 

విలక్షణ రాజకీయ చతురత

 ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహ సంబంధాలను నెరపడంలో కేసీఆర్ ఎంతో రాజ నీతిజ్ఞతను ప్రదర్శించారు. ‘ఓటుకు కోట్లు’ కేసుతో చంద్రబాబు దూకుడుకు ముకుతాడు వేసిన కేసీఆర్... ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారీ ఎత్తున నిర్వహించిన చండీయాగానికి మాత్రం స్వయంగా విజయవాడకు వెళ్లి చంద్రబాబును ఆహ్వానించారు. రాజకీయ ఎత్తులు పైఎత్తులతో విపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేశారు. వరుసగా వచ్చిన ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయాలు సాధించడంలో అన్నీ తానై వ్యవహరించారు. కేసీఆర్ ‘ఆకర్ష్’ వ్యూహంతో టీఆర్‌ఎస్‌లోకి  వరుసకట్టిన విపక్ష సభ్యులు, విలీనమైన పార్టీలతో అసెంబ్లీలో విపక్షాలకు ఇప్పటికే గొంతు మూగబోయింది. కేంద్రంతో సంబంధాలు నెరపరడంలోనూ కేసీఆర్ వ్యూహా చతురతను ప్రదర్శిస్తున్నారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ నిధులివ్వాలని కోరడంతో పాటు కరువు సాయం,మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలకు ఆర్థిక సాయం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు అందించాలంటూ అవసరం వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్ ఢిల్లీ తలుపు తట్టారు. ఫలితంగా ఎఫ్‌ఆర్‌బీఎం పెంపునకు కూడా కేంద్రం అనుమతించడం గమనార్హం.

 

 సాక్షి, హైదరాబాద్: ఉద్యమ నాయకుడిగా ప్రజల నాడి పట్టుకున్న కె.చంద్రశేఖర్‌రావు కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలనలోనూ కొత్త పంథాకు శ్రీకారం చుట్టారు. అన్నీ తానై దిశా నిర్దేశం చేస్తున్నారు. ‘బంగారు తెలంగాణ’ కలను సాకారం చేసేందుకు నిత్యం తపన పడుతున్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారిస్తూనే.. తక్షణ ప్రయోజనం కల్పించే అంశాలపైనా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ప్రధానంగా సంక్షేమం, వ్యక్తిగత లబ్ధి కార్యక్రమాలతో జనాన్ని ఆకట్టుకున్నారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వారి ఆశలు, ఆకాంక్షలేమిటో తెలిసిన నాయకుడిగా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. తక్షణ ప్రజాకర్షక కార్యక్రమాలతో పాటు దూరదృష్టితో ప్రజోపయోగ కార్యక్రమాలనూ అమల్లోకి తెచ్చారు.



సంచలన నిర్ణయాలు తీసుకోవడం.. విమర్శలు, వివాదాలకు వెరవకుండా ముందుకుపోవడం ద్వారా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు ‘మిషన్ భగీరథ’ పేరుతో బృహత్తర యజ్ఞం తలపెట్టారు. ఐదేళ్ల వ్యవధిలోనే దీనిని అమలు చేసి చూపిస్తామని.. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని చెప్పగలిగిన ధీశాలి ఆయన. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ప్రక్రియకూ శ్రీకారం చుట్టారు.



 ఒక్కటొకటిగా హామీల అమలు

 ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాటిచ్చిన కేసీఆర్.. టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకాల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపుతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమల్లోకి తీసుకువచ్చారు. అంతకన్నా ముఖ్యంగా అధికారంలోకి రాగానే రూ.1,000/1,500 చొప్పున ఆసరా పింఛన్ల పంపిణీ, పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం అందించేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను, హాస్టళ్లు, మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం వంటివి సంక్షేమానికి అద్దం పట్టాయి. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు చెందిన పండుగలు, సంబురాలను అధికారికంగా నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెర లేపింది.



రంజాన్, క్రిస్‌మస్, బతుకమ్మ వేడుకలను గతంలో ఎన్నడూ లేనంత ఘనంగా నిర్వహించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నిరుపేదలకు రెండు లక్షల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి ప్రకటన ఇప్పుడిప్పుడే అమల్లోకి వస్తోంది. ఇక గతేడాది హైదరాబాద్‌లో ఐడీహెచ్ కాలనీలో, సీఎం వ్యవసాయ క్షేత్రమున్న ఎర్రవల్లిలో నిర్మించిన ‘డబుల్ బెడ్రూం’ ఇళ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఎన్నికల హామీల్లో అందరి దృష్టిని ఆకట్టుకున్న ‘కేజీ టు పీజీ’ విద్య పథకానికి ఈ విద్యా సంవత్సరం నుంచే సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇదే ఏడాది నుంచి 180 రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పే ప్రక్రియ ఆరంభంలో ఉంది.



 ఎవరికీ అందనంత ఎత్తుకు చేరాలి..!

 ప్రస్తుత సచివాలయం నచ్చలేదంటూ నెలల తరబడి ఆ వైపు చూడకున్నా, ఏకబిగిన వారం రోజులు ఫామ్‌హౌస్‌లో ఉన్నా అది సీఎం కేసీఆర్‌కే చెల్లింది. వాస్తు బాగా లేదంటూ సచివాలయాన్ని  ఎర్రగడ్డకు తరలించేందుకు ప్రయత్నించిన కేసీఆర్... అనంతరం ఇప్పుడున్నచోటే అత్యద్భుతంగా కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ట్యాంక్‌బండ్ తీరంలో అతిపెద్ద అమరవీరుల స్థూపం, దేశంలోనే అతి ఎత్తయిన జాతీయ జెండా, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ స్టేడియంలో అధునాతనంగా కళాభారతి  నిర్మాణం వంటివన్నీ తెలంగాణను దేశంలోనే అందనంత ఎత్తున నిలబెట్టాలన్నది కేసీఆర్ ఆశయాలకు, ఆకాంక్షలకు అద్దం పట్టేవే. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న కేసీఆర్ స్వీయ ఆలోచనల్లోంచి రూపుదిద్దుకున్నవే. రాష్ట్రంలో మరో 14 లేదా 15 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం.. స్వయంగా వాటి నైసర్గిక స్వరూపాలను ఖరారు చేసే పనిలో ఉన్నారు.

 

 చీకట్లను ఛేదించి సాగువైపు..

 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే అంధకారమవుతుందనే అపోహల్ని పటాపంచలు చేసేందుకు సీఎం కేసీఆర్ తొలి ఏడాది వీలైనంత సమయాన్ని విద్యుత్ రంగానికి కేటాయించారు. కొత్త విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోళ్లు, ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి స్వయంగా కొనుగోలు ఒప్పందం చేసుకోవడం.. ఇలా అన్నిటా ముందు నిలిచారు. ఏడాది తిరగకముందే రాష్ట్రమంతా నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తామనే వాగ్దానాన్ని అమలు చేయగలిగారు. రెండో ఏడాదిలో తెలంగాణ సమగ్ర జల విధానం, ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పైనే కేసీఆర్ ఎక్కువ సమయం వెచ్చించారు.



రేయింబవళ్లు గూగుల్ మ్యాప్‌లను ముందేసుకొని ఆయనే స్వయంగా ఇంజనీర్ల కంటే ఎక్కువగా అధ్యయనం చేశారు. గోదావరి, కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకునే సమగ్ర ప్రణాళిక రూపొందించారు. ఐదేళ్లలో కోటి ఎకరాలకు సాగునీటిని అందించి ప్రతి రైతు బాగుపడేలా ‘హరిత తెలంగాణ’ను సాధించి తీరుతామని ప్రతినబూనారు. గతంలో తెలంగాణలో ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ పునాది రాళ్ల స్థాయిలోనే ఉన్నాయని, ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించాలి, ఎంత నీటిని నిల్వ చేయాలి, ఎటు వైపు కాల్వలు తవ్వాలి, అంతర్రాష్ట వివాదాలేమైనా తలెత్తుతాయా అనే సోయి లేకుండా, తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు సాగకుండా ఆంధ్రా పాలకులు అడ్డుకున్న వైనాన్ని అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ఎలుగెత్తి చాటిన తీరు అందరినీ అబ్బురపరిచింది. అంతర్రాష్ట ప్రాజెక్టులపై వివాదం లేకుండా మహారాష్ట్రతో జల ఒప్పందం.. కాళేశ్వరం ప్రాజెక్టుకు పునాదిరాయి వేయడం.. చెరువుల పునరుద్ధరణకు అమలు చేస్తున్న మిషన్ కాకతీయ కార్యక్రమం కేసీఆర్‌కు అపర భగీరథుడిగా పేరు తెచ్చిపెట్టాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top