మనోళ్ల కష్టం ‘నీట్‌’పాలైందా?

మనోళ్ల కష్టం ‘నీట్‌’పాలైందా? - Sakshi

నీట్‌ పరీక్షలో మన విద్యార్థులు నష్టపోయారా?

- ప్రాంతీయ భాషల్లో సులువుగా ప్రశ్నపత్రం.. ఇంగ్లిష్‌లో కఠినం

హిందీ, ఇతర ప్రాంతీయ భాషా విద్యార్థులకు కలిసొచ్చిన పరీక్ష

అందుకే వారికి మెరుగైన ర్యాంకులు

మనోళ్లు తెలుగులో రాసింది 5 శాతం మందే.. 95 శాతం మంది ఇంగ్లిష్‌లోనే..

దెబ్బతీసిన నెగెటివ్‌ మార్కులు

నీట్‌కు తగ్గట్టుగా మారని ఇంటర్‌ విద్య

 

సాక్షి, హైదరాబాద్‌: నీట్‌లో తెలుగు విద్యార్థులకు అన్యాయం జరిగిందా? ప్రాంతీయ భాషలో పేపర్‌ ఈజీగా వచ్చినా మనోళ్లకు అవగాహన లేక ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేదా? ఇంగ్లిష్‌లో పరీక్ష రాసి నష్టపోయారా? అన్ని జాతీయస్థాయి పరీక్షల్లో సత్తా చాటే మన విద్యార్థులు అందుకే నీట్‌లో టాప్‌–10లో నిలబడలేదా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు నిపుణులు! తెలంగాణ నుంచి దాదాపు 50 వేల మంది విద్యార్థులు నీట్‌ రాయగా.. వారిలో ఎందరు అర్హత సాధించారన్న లెక్కలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఈ పరీక్షలో మనోళ్లకు రావాల్సిన స్థాయిలో ర్యాంకులు రాలేదన్న చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ ఎంసెట్‌ రాసిన విద్యార్థులను నీట్‌కు తగ్గట్టుగా సిద్ధం చేయలేకపోవడం, ఇంగ్లిష్‌లో ప్రశ్నప్రతం కఠినంగా రావడం, రాష్ట్రం నుంచి పరీక్ష రాసినవారిలో 95 శాతం మంది ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్ష రాయడంతో విద్యార్థులకు నష్టం వాటిల్లినట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 

సన్నద్ధత ఏది?

వైద్య ప్రవేశాలకు నీట్‌ తప్పనిసరి చేయడంతో గతేడాది నుంచి ఎంసెట్‌ బదులు అదే పరీక్షను నిర్వహిస్తున్నారు. వాస్తవంగా దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశాలకు గతంలో ఆలిండియా ప్రీ మెడికల్‌ టెస్ట్‌ (ఏఐపీఎంటీ) ఉండేది. ఆ పరీక్షను మన విద్యార్థులు రాసేవారు కాదు. ఎంసెట్‌ రాసేవారు ఏఐపీఎంటీ రాయడానికి వీల్లేదు. దీంతో మన విద్యార్థులెవరూ ఏఐపీఎంటీ రాసేవారు కాదు. కానీ ఇతర రాష్ట్రాల విద్యార్థులు 15 ఏళ్లుగా ఆ పరీక్ష ద్వారా జాతీయ స్థాయిలోని ప్రముఖ మెడికల్‌ కాలేజీల్లో సీట్లు పొందుతున్నారు. ఏఐపీఎంటీ స్థానంలోనే ఇప్పుడు నీట్‌ వచ్చింది. కానీ ఈ పరీక్షకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదు.



అందుకు అనుగుణంగా ఇంటర్‌ విద్యను తీర్చిదిద్దలేదు. సీబీఎస్‌ఈ సిలబస్‌ను మార్చి తెలంగాణలో అదనంగా మరికొంత సిలబస్‌ చేర్చి విద్యార్థులపై భారం మోపారు. ఇక ఇతర రాష్ట్రాల్లో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ప్రాధాన్యం కాదు. రెండో ఏడాది పరీక్షనే ఇంటర్‌ బోర్డు నిర్వహిస్తుంది. కానీ మన రాష్ట్రంలో రెండేళ్ల పరీక్షలూ కీలకమే. దీంతో విద్యార్థులు నీట్‌పై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాల్లో ఇంటర్‌ కోర్సు కాలం ఎక్కువ. మే నెల మాత్రమే వారికి సెలవులుంటాయి. మన రాష్ట్రంలో మాత్రం రెండున్నర నెలల సెలవులున్నాయి.

 

నెగెటివ్‌ మార్కులతో నష్టం..

ఎంసెట్‌లో నెగెటివ్‌ మార్కులు లేవు. కానీ నీట్‌లో ఉంటాయి. ఇందులో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు. అయితే ఒక్క ప్రశ్నకు తప్పుడు సమాధానం రాస్తే.. ఐదు మార్కులు పోతాయి. దీంతో సరైన ఆన్సర్‌ రాసినా తప్పుడు ఆన్సర్‌తో ఎక్కువగా నష్టపోయారని చెబుతున్నారు. ఇక ప్రాంతీయ భాషల్లో నీట్‌ పేపర్‌ ఈజీగా వచ్చింది. దీంతో గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు సహా అనేక ఇతర రాష్ట్రాలు లాభపడ్డాయి. హిందీలో కూడా నీట్‌ సులువుగానే వచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో 95 శాతం మంది విద్యార్థులు నీట్‌ను ఇంగ్లిషులోనే రాశారు. తెలుగు భాషలో పేపర్‌ కాస్త సులువుగానే వచ్చినా కేవలం 5 శాతం మందే రాయడం, వారికి సరైన గైడెన్స్‌ లేకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది.

 

నేషనల్‌ పూల్‌తో ప్రయోజనమే కానీ..

ప్రస్తుతం నీట్‌ ద్వారా ర్యాంకులు పొందిన తెలుగు విద్యార్థులు ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటులోని కన్వీనర్‌ కోటాలో మాత్రమే సీట్లు పొందడానికి వీలుంది. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో వైద్య సీట్లు సాధించాలంటే నేషనల్‌ మెడికల్‌ సీట్ల పూల్‌లో చేరాల్సి ఉంటుంది. అందులో చేరాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. అలా చేరితే నిబంధనల ప్రకారం.. ఆయా రాష్ట్రాల్లోని ఎంబీబీఎస్‌ సీట్లలో 15 శాతం, పీజీ మెడికల్‌ సీట్లలో 50 శాతం సీట్లను జాతీయ మెడికల్‌ సీట్ల పూల్‌ తీసుకుంటుంది. అలా వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన సీట్లకు నీట్‌ ద్వారా కేటాయిస్తుంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్, తెలుగు రాష్ట్రాలు మాత్రమే నేషనల్‌ పూల్‌లో లేవు.



తెలంగాణ నేషనల్‌ పూల్‌లో చేరాలంటే 371డి ఆర్టికల్‌కు సవరణ చేయాలి. అందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపాలి. నేషనల్‌ పూల్‌లో చేరితే రాష్ట్ర విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇంటర్‌ విద్యలో సంస్కరణలు తేకుండా చేరితే అన్యాయం జరుగుతుందనే వాదనలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో  ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 1,050, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 2,700 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. నేషనల్‌ పూల్‌లో చేరితే ప్రభుత్వ కాలేజీల్లో నిర్దేశిత సీట్లతోపాటు ప్రైవేటులోని కన్వీనర్‌ కోటా సీట్లల్లో 15 శాతం సీట్లు కూడా జాతీయ పూల్‌లోకి వెళ్తాయి.

 

ఔను నష్టపోయాం

నీట్‌లో నెగెటివ్‌ మార్కుల వల్ల మన విద్యార్థులు నష్టపోయారు. ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రం కఠినంగా ఉండటం, ప్రాంతీయ భాషల ప్రశ్నపత్రం సులువుగా ఉండటం కూడా మన విద్యార్థులకు నష్టంగా పరిణమించింది. తెలంగాణలో 1450 ర్యాంకు వరకు జనరల్‌ కేటగిరీలో ర్యాంకు వస్తే ప్రభుత్వ కాలేజీల్లో సీటు రావొచ్చు. 480 మార్కులు వస్తే ప్రభుత్వ కాలేజీల్లో, 440 మార్కులొస్తే ప్రైవేటులోని కన్వీనర్‌ కోటాలో సీటు రావొచ్చు. 400 మార్కులొస్తే బీ కేటగిరీలో సీటు దక్కొచ్చు. 

– శంకర్‌రావు, డీన్, శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీ, కూకట్‌పల్లి, హైదరాబాద్‌

 

రాష్ట్ర స్థాయి ర్యాంకులే కీలకం

నీట్‌ ద్వారా అర్హత పొందిన విద్యార్థుల ర్యాంకులను కేంద్రం త్వరలో ప్రకటించనుంది. నేషనల్‌ పూల్‌లో మనం లేనందున మన సీట్లల్లో మన విద్యార్థులే చేరతారు. అందువల్ల నీట్‌లో మన విద్యార్థులు తక్కువ సామర్థ్యం చూపినా మనకు వచ్చే నష్టం పెద్దగా ఉండదు. అయితే ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని బీ, ఎన్నారై కేటగిరీ సీట్లల్లో మాత్రం నీట్‌లో అర్హత పొందిన విద్యార్థులు ఎవరైనా వచ్చి చేరవచ్చు.

– డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ ఆరోగ్య వర్సిటీ
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top