‘హార్టీ’ షో అదుర్స్

‘హార్టీ’ షో అదుర్స్


అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ తొలి

ఉద్యాన ప్రదర్శన

నెక్లెస్‌రోడ్డులో వెల్లివిరిసిన పచ్చదనం

అడుగడుగునా

‘తెలంగాణ’ ప్రత్యేకతలు

తొలిరోజు జనం కిటకిట


 

సందర్శన వేళలు...

ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.

ఎప్పటి వరకు: ఈ నెల 30వ తేదీ వరకు.

ప్రవేశం:  ఉచితం

 


తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక  తొలి ఉద్యాన ప్రదర్శన- 2015 (హార్టికల్చర్ షో) సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా ఇందుకు వేదికైంది. ప్రాంగణ ప్రధాన ద్వారాన్ని కాకతీయ తోరణంగా అద్భుతంగా తీర్చిదిద్దారు. అలనాటి తీపిగుర్తులు గొలుసుకట్టు చెరువులు, కల్చర్, వ్యవసాయం వంటి ప్రధాన అంశాలను నేటి తరానికి గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం, హార్టికల్చర్, చెరువుల అభివృద్ధికి చేపడుతున్న పథకాలకు అనుగుణంగా ఉద్యాన ప్రదర్శనను అద్యంతం తీర్చిదిద్దారు. మిషన్ కాకతీయను అందిరికి తెలిసేలా చేసి సక్సెస్ అయ్యారు. తొలిరోజే ప్రదర్శన ప్రాంగణం జన జాతరను తలపించింది. హరిత తెలంగాణను చాటేలా ప్రదర్శనలో ఉంచిన బిందు, తుంపర సేద్యం పరికరాలు చూపరులను కట్టిపడేశాయి. వందలాది రకాల కూరగాయలు, పండ్లు, మొక్కలు, తీగ మొక్కలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. ప్రదర్శనలో 100 స్టాల్స్, చుట్టూ 60 నర్సరీల స్టాల్స్, డిపార్ట్‌మెంట్స్ స్టాల్స్‌తో కలిపి మొత్తం 160 స్టాల్‌లలో గ్రీన్ హౌస్, థీమ్ పెవిలియన్‌లు ఏర్పాటు చేశారు. రోజుకు సుమారు లక్షమంది సందర్శించే వీలుంది. ఉద్యాన రంగానికి సంబంధించిన కొత్త పోకడలపై సెమినార్లు, వర్క్‌షాప్‌లు ప్రారంభమయ్యాయి.  హైదరాబాద్‌ను అందమైన గార్డెన్ సిటీగా రూపొందించడానికి ఈ ప్రదర్శనతో పాటుగా ఒక గార్డెన్ ఫెస్టివల్ కూడా ఉద్యాన శాఖ నిర్వహించటం విశేషం.                                 

 -

 

 ఏం ఉన్నాయి...

 

 పసుపు రంగు కర్బుజా ప్రదర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్టాల్స్‌లో ఉంచినవి నిమిషాల్లో  పోటీపడి జనాలు కొనుగోలు చేశారు. సోలార్ సిస్టమ్స్, పసుపు కొమ్ములు ఉడికించే కడాయిలు, క్లాసిక్ నర్సరీ, రీసైక్లింగ్ వస్తువుల్లో మొక్కల పెంపకం, వివిధ దేశాలకు చెందిన బోస్సాయ్, శాశ్వత పందిరి నిర్మాణంతో కూరగాయల సాగు. బెంగుళూరు క్యాప్సికమ్స్, గ్రీన్‌వాల్ పద్ధతి, టేబుల్ ఫవర్స్, ఖమ్మం జిల్లా హార్టికల్చర్ ఏడీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఉంచిన స్టాల్స్‌లో ఆయిల్‌పామ్ గెల, పెద్ద రాచ గుమ్మడి కాయలు, 8 రకాల విత్తగొలిపే కోకోనట్స్(టెంకాయలు), ఎన్‌ఐడీ ఆధ్వర్యంలో వివిధ రకాల తేనె బాటిల్స్, వివిధ రకాల విత్తనాల పాకెట్స్ తదితరాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి.

 

ఖమ్మం, నల్లగొండ జిల్లాలకే ప్రత్యేకం...

 


 ఆయిల్‌ఫామ్ గెలలు. ఇవి ఖమ్మం, నల్గొండ జిల్లాలకే ప్రత్యేకం. ఖమ్మంలో 13 వేల హెక్టార్లలో సాగు చేశారు. ఇవి 40 సంవత్సరాల వరకు పంట దిగుబడిని ఇస్తాయి. ఇది మంచి లాభదాయక పంట అని ఖమ్మం జిల్లా ఉద్యాన శాఖ ఏడీ సూర్యనారాయణ తెలిపారు. అలాగే రాచ గుమ్మడి కాయలు మంచి అదాయాన్ని ఇస్తాయని చెప్పారు. ఇవి నగరంలోని ఉన్నవారు కూడా పెంచుకోవచ్చన్నారు.

 

ప్రతి ఏడాది మొక్కలు కొంటాం

 

ప్రతి ఏడాది హార్టికల్చర్ షోకు వస్తాం. మొక్కలు, పూల చెట్లు కొంటాను. ఎక్కడ దొరకని రకాలు ఇందులో ఉంచుతారు. మధ్యతరగతి ప్రజలకు కూడా ఈ ప్రదర్శన బాగా ఉపకరిస్తుంది. అయితే గతంలో కన్నా ఈసారి రేట్లు కొంచెం ఎక్కువ అని పిస్తోంది. ప్రభుత్వం ఇలాంటివి మరిన్ని నిర్వహించాలి.                         - శశికళ, టీచర్

 

అవగాహన కోసం వస్తా...

 

 ప్రభుత్వం నిర్వహించే ఉద్యాన ప్రదర్శనకు ప్రతి సంవత్సరం వస్తా. కొత్త కొత్త రకాల పరికరాలు, చాలా రకాల కూరగాయల విత్తనాలు గురించి తెలుస్తాయి. ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇక్కడ నిర్వహించే సెమినార్స్ ఉపయోగకరంగా ఉంటాయి. పది ఏకరాల భూమిలో ఇక్కడి నుంచి తీసుకెళ్లే బీర, టమోటా విత్తనాలు వేస్తూ ఉంటాను.

 - ఎరువ భూపతి రెడ్డి, రైతు,

 తొగుట మండలం, మెదక్ జిల్లా

 

 

పూలతో అమరవీరుల స్థూపం

 

తెలంగాణ అమరవీరుల స్థూపం నమూనాను అందమైన రంగురంగుల పూలతో అద్భుతంగా రూపొందించారు. దాని పక్కనే తెలుగుతల్లి విగ్రహం, జమ్మి చెట్టు, పాలపిట్ట, తంగేడు పూల చెట్లు ఉంచారు. ఇవి చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top