కాంట్రాక్టు క్రమబద్ధీకరణ.. సశేషం

కాంట్రాక్టు క్రమబద్ధీకరణ.. సశేషం - Sakshi


ఇప్పటి వరకు కేవలం 64 మందికి నియామక ఉత్తర్వులు



- 700 ఫైళ్లకు ఆర్థిక శాఖ అనుమతి  

- అన్ని శాఖల్లో ఫైళ్లను ఆపేసిన అధికారులు

 

 సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ అర్ధాంతరంగానే ఆగిపోయింది. 3 నెలల కిందట అన్ని శాఖల్లో దాదాపు 14 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసింది.  ఇప్పటివరకు కేవలం 2 విభాగాల్లో 64 మందిని రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 36 మంది, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ పరిధిలో మిగతా ఉద్యోగులు ఈ ఉత్తర్వులు అందుకున్నారు. మిగతా శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఫైళ్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.



ఫిబ్రవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు జీవో నం.16 జారీ చేసింది. జీవోలో ఉన్న మార్గదర్శకాల మేరకు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరింది. ఏప్రిల్ చివరి నాటికే ఈ వివరాలన్నిం టినీ పంపించాలని సీఎస్ రాజీవ్‌శర్మ అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశిం చారు. 2 నెలల పాటు పురోగతిని సమీక్షించారు. కాగా, ఇప్పటివరకు 15 శాఖల నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. వీటిలో దాదాపు 700 ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు అనుమతి తెలుపుతూ ఫైళ్లను తిరిగి సంబంధిత శాఖలకు పంపించినట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. వీరిని క్రమబద్ధీకరిస్తూ నియామక  ఉత్తర్వులు జారీ చేసే బాధ్యత ఆయా శాఖల ఉన్నతాధికారులపైనే ఉంటుంది. కానీ కొత్త జిల్లాల హడావుడికి తోడు కోర్టులో కేసు ఉందనే సాకుతో కొన్ని శాఖలు ఈ ప్రక్రియను నిలిపేశాయి.

 

 ఆందోళన బాటలో కాంట్రాక్టు ఉద్యోగులు

 ఆర్థిక శాఖ వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం 47 విభాగాల పరిధిలో 13,671 మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. ‘మా సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. చెక్‌లిస్ట్‌లన్నీ సిద్ధం చేశారు. రోస్టర్ ప్రకారం ప్రతిపాదనలు తయారు చేశారు. మా ఫైళ్లు కమిషనరేట్‌కు చేరాయి.. అక్కడి నుంచి ఆర్థిక శాఖ అనుమతితో ఉత్తర్వులు జారీ చేయాలి. కానీ కోర్టులో కేసు ఉందని 3 నెలలుగా రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు ఇవ్వకుండా ఆపేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేయలేదు’ అని కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,800 మంది జూనియర్ లెక్చరర్లు, 126 డిగ్రీ కాలేజీల్లో 926 మంది లెక్చరర్లు కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్నారు.



అధికారుల జాప్యం వల్లే ఇప్పటివరకు వీరికి రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు జారీ కాలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ పరిధిలో ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారని, కానీ వీరిని క్రమబద్ధీకరించేందుకు రకరకాల సమస్యలున్నాయని అధికారులు గతంలోనే సీఎస్ రాజీవ్‌శర్మ దృష్టికి తీసుకెళ్లారు. కానీ వీటిని పరిష్కరించి అర్హులకు నియామక పత్రాలు ఇచ్చే దిశగా చేపట్టే ప్రయత్నాలు ఆగిపోవటంతో ఈ పరిస్థితి నెలకొంది. క్రమబద్ధీకరణ పురోగతిని వారం రోజులకోసారి సమీక్షించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తుతో అటకెక్కినట్లయింది. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులు మళ్లీ ఆందోళన బాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top