‘ఆపరేషన్ హరీశ్’ సూపర్‌హిట్!

‘ఆపరేషన్ హరీశ్’ సూపర్‌హిట్! - Sakshi


నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి

టీఆర్‌ఎస్‌కు 70 వేల మెజారిటీ ఖాయమంటున్న సర్వేలు

రెండో స్థానంలో కాంగ్రెస్, టీడీపీకి డిపాజిట్టూ కష్టమే

రికార్డు స్థాయి పోలింగ్.. ఓటేసిన 50 వేల మంది వలస ఓటర్లు

అభివృద్ధి మంత్రంతో ఓటర్లను ఆకట్టుకున్న హరీశ్


 

సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గానికి శనివారం జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ భారీ ఆధిక్యం సాధించబోతోంది. భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉన్నదని, పోలైన మొత్తం ఓట్లలో కనీసం 70 శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌కే దక్కుతాయని ఎగ్జిట్ పోల్ నిర్వహించిన సర్వే సంస్థలు పేర్కొ న్నాయి. పోలింగ్ కూడా రికార్డు స్థాయిలో ఏకంగా 81.79 శాతం నమోదైంది! ఒక ఉప ఎన్నికలో ఇంత భారీ స్థాయిలో పోలింగ్ జరగడం అరుదని అధికారులంటున్నారు.



కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ తరఫున కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి బరిలో దిగారు. మామూలుగా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో జరిగే ఉప ఎన్నికలో వారి కుటుంబీకులకే టికెట్టివ్వడం, అత్యధిక సందర్భాల్లో వారే విజయం సాధించడం రివాజు. ఖేడ్‌లో అందుకు భిన్నమైన ఫలితం రాబట్టేందుకు హరీశ్ గట్టి ప్రయత్నమే చేశారు.

 

20 రోజుల పాటు అక్కడే మకాం వేయడమే గాక, ఇప్పటిదాకా మంత్రులెవరూ చూడని గ్రామాలకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. తన నియోజకవర్గమైన సిద్దిపేట మాదిరిగా నారాయణ్‌ఖేడ్‌ను తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. అభివృద్ధంటే ఏమిటో చేసి చూపిస్తానని వారికి నమ్మకం కలిగించారు. ప్రచార రథసారథిగా నియోజవర్గమంతా కలియదిరిగారు. భారీ మెజారిటీ సాధిస్తామని నామినేషన్ దాఖలు సమయంలోనే చెప్పిన హరీశ్, దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హరీశ్ విస్తృత ప్రచారం, ప్రజలతో మమేకమైన తీరుతో పాటు వారి సమస్యలను ఆయన వ్యక్తిగతంగా పట్టించుకుంటూ ముందుకు సాగడంతో కాంగ్రెస్ అభ్యర్థికి సానుభూతి పవనాలు కరువయ్యాయి.

 

టీఆర్‌ఎస్‌కు 70 వేల మెజారిటీ

ఖేడ్‌లో టీఆర్‌ఎస్‌కు సుమారు 70 వేల ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశముందని ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించిన మూడు సంస్థలూ ప్రకటించాయి. సానుభూతిని నమ్ముకున్న కాంగ్రెస్‌కు 20 శాతం ఓట్లు రావడం కూడా కష్టమేనని తేల్చిచెప్పాయి. కాంగ్రెస్‌కు ఒక మండలంలో కొంత మద్దతు లభించిందని, ఇది ఆ పార్టీకి డిపాజిట్ రావడానికి దోహదపడుతుందని సర్వే సంస్థ ‘ఆరా’ తెలిపింది. ఇక టీడీపీకి డిపాజిట్ దక్కే అవకాశమే కనిపించడం లేదు. ఆ పార్టీ అభ్యర్థికి 8 శాతం ఓట్లు కూడా దక్కే అవకాశం లేదని సర్వే సంస్థలు ప్రకటించాయి. టీడీపీ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌తో పాటు పార్టీ సీనియర్లు ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్ తరఫున పోలింగ్‌కు 3 రోజుల ముందు సీఎం చంద్రశేఖరరావు బహిరంగ సభలో మాట్లాడారు. హరీశ్ తన సిద్దిపేట నియోజకవర్గం మాదిరిగా ఖేడ్‌ను అభివృద్ది చేస్తారంటూ స్వయంగా భరోసా ఇచ్చారు.

 

 అధికశాతం పోలింగ్‌పై శ్రద్ధపెట్టిన హరీశ్

 భారీ మెజారిటీ రావాలంటే 80 శాతం కంటే ఎక్కువ పోలింగ్ జరిగితేనే సాధ్యమని మంత్రి హరీశ్ భావించారు. దానికి తగ్గట్టుగానే నియోజకవర్గం నుంచి ఉపాధి కోసం వలస వెళ్లిన వారిని గ్రామాలవారీగా గుర్తించే కార్యక్రమం చేపట్టారు. స్థానిక పార్టీ కార్యకర్తల సహకారంతో పోలింగ్ రోజున వారంతా తమ ఊళ్లకు వచ్చి ఓటేసేలా చేయగలిగారు. ఇలా దాదాపు 50 వేల మంది వలస వెళ్లిన వారు శనివారం నాటి పోలింగ్‌లో పాల్గొన్నారు. నియోజకవర్గాన్ని సిద్దిపేటలా చేస్తానన్న హరీశ్ హామీ వల్లే వీరంతా వచ్చి మరీ టీఆర్‌ఎస్‌కు ఓటేశారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top