మార్గదర్శకాలు లేని ఉపకారవేతనాలు

మార్గదర్శకాలు లేని ఉపకారవేతనాలు


కేంద్ర, రాష్ట్ర వైఖరులతో గిరిజన విద్యార్థులకు అవస్థలు

సాక్షి, హైదరాబాద్: గిరిజన విద్యార్థులకు అందిస్తున్న ఉపకారవేతనాల మంజూరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టతలేని వైఖరితో వ్యవహరించడంతో వేలాదిమంది అవస్థలు పడుతున్నారు. దీనిపై సమన్వయం కొరవడి దరఖాస్తు గడువు చేరువవుతుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రంనుంచి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడమే ఇందుకు కారణమని రాష్ట్ర అధికారులు అంటున్నారు. వాస్తవంగా దరాఖాస్తుదారుల్లో 40శాతం మందికే కేంద్రం ఉపకారవేతనాలను తనవంతుగా చెల్లిస్తుంది. అయితే అందుకు సంబంధించి గైడ్‌లైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంతో కాకుండా కేంద్రమే వీటిని నేరుగా అందించాలన్న భావనతోనే జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.



దీంతో రాష్ట్రప్రభుత్వాల భూమిక ఎలా ఉండాలన్నది తెలియడం లేదని ఇక్కడి అధికారులు చెప్తున్నారు.  ప్రస్తుతం పోస్ట్‌మెట్రిక్‌స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల (జూలై) 31 ఆఖరు తేదీ కాగా రాష్ట్రం నుంచి  నేషనల్ పోర్టల్‌లో ఒక్కశాతంమంది కూడా దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఇక  ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం దర ఖాస్తుకు ఆగస్టు 31 చివరి తేదీగా కేంద్రం ప్రకటించింది.   2015-16లో ఈ విద్యార్థులకు నేరుగా స్కాలర్‌షిప్‌లను  వారి బ్యాంక్‌ఖాతాల్లో   జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.అయితే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ పథకాన్ని ఏ విధంగా అనుసంధానిస్తారనే దానిపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.



దీంతో రాష్ట్రాలకు ఎటూ పాలుపోని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ‘నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్’ ద్వారా www.scholarships.gov.in వెబ్‌సైట్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం నిర్దేశించగా, రాష్ట్రంలో 2008 నుంచి, ఇప్పుడు తెలంగాణ, ఏపీలలో ఈ-పాస్ విధానాన్ని అమలుచేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే  కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20,21 తేదీల్లో ఢిల్లీలో వర్క్‌షాపును నిర్వహించగా తెలంగాణ, ఏపీ నుంచి ఎస్టీశాఖ ఉన్నతాధికారులు హాజరై తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను గురించి వివరించారు. అయితే ఇప్పటికీ కేంద్రంనుంచి ఉపకార వేతనాలపై స్పష్టమైన వైఖరితో ఆదేశాలు లేక గిరిజన విద్యార్థులు కలవరపడుతున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top