రాష్ట్రంపై జీఎస్టీ భారం రూ.19,200 కోట్లు

రాష్ట్రంపై జీఎస్టీ భారం రూ.19,200 కోట్లు - Sakshi

- మల్లగుల్లాలు పడుతున్న సర్కారు  

30న కౌన్సిల్‌ భేటీలో కేంద్రానికి నివేదించాలని నిర్ణయం

 

సాక్షి, హైదరాబాద్‌: జీఎస్టీ భారంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలతోపాటు రాష్ట్రంలోని చేనేత, బీడీ కార్మికులు, గ్రానైట్‌ వ్యాపారులపై జీఎస్టీతో అధిక భారం పడనుంది. ఇప్పటికే ఈ అంశాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వాణిజ్య పన్నుల శాఖ తాజాగా వేసిన గణాంకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపైనే దాదాపు రూ.19,200 కోట్ల భారం పడనుంది. మిషన్‌ భగీరథపై రూ.2,000 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులపై రూ.8,000 కోట్లు, డబుల్‌ బెడ్రూం ఇళ్లపై రూ.1,600 కోట్లు, మిషన్‌ కాకతీయ చెరువుల పునరుద్ధరణపై రూ.2,600 కోట్లు, రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులపై రూ.5 వేల కోట్ల భారం పడనుంది. జీఎస్టీలో ఖరారు చేసిన పన్ను స్లాబ్‌ల ప్రకారం చేనేత, బీడీ కార్మికులపైనా భారం పడనుంది.



వీటన్నింటికీ ప్రస్తుతం వ్యాట్‌ ప్రకారం అమల్లో ఉన్న పన్నులకు మించకుండా జీఎస్టీ పన్నును కనిష్ట స్లాబ్‌కు కుదించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. కొన్నింటిపై పన్ను మినహాయించాలని విజ్ఞప్తి చేసింది. జీఎస్టీతో వాటిల్లే నష్టానికి కేంద్రం పరిహారం ఇచ్చినా ఈ రంగాలపై పడే భారం పూడ్చలేని విధంగానే ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. దీంతో ఈనెల 30న జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో తమ ప్రతిపాదనలు, విజ్ఞప్తులను సమర్పించాలని సర్కారు నిర్ణయించింది. ఈ వివరాలన్నింటినీ ఉటంకిస్తూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి లేఖ రాశారు.

 

నేడు ఢిల్లీ నుంచి సీఎం రాక

ఆరు రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్‌ గురువారం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ కార్యక్రమానికి హాజరైన సీఎం ఇదే పర్యటనలో తన కుడి కంటికి సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. బుధవారం ఈ సర్జరీ జరగాల్సి ఉన్నా.. వైద్య నిపుణులు చివరి నిమిషంలో వాయిదా వేసినట్లు తెలిసింది. దీంతో గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. 30న ఢిల్లీలో కేంద్రం నిర్వహించే జీఎస్టీ వేడుకలకు హాజరు కావాల్సి ఉంది. కానీ సీఎం ఈ వేడుకలకు గైర్హాజరయ్యే అవకాశాలున్నాయి.
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top