కొలువుల జాతర

కొలువుల జాతర


 మొత్తం 1,032 గ్రూప్-2  పోస్టులు

 అనుబంధ నోటిఫికేషన్ జారీ.. నవంబర్ 12, 13 తేదీల్లో పరీక్ష!


► పాత నోటిఫికేషన్‌లోని 439 పోస్టులకు అదనంగా 593 పోస్టులు

► నేటి నుంచి 23వ తేదీ వరకు దరఖాస్తులు

► ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ చేసుకోనక్కర్లేదు


 

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గురువారం గ్రూప్-2 అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసింది. 2015 డిసెంబర్ 30నాటి నోటిఫికేషన్‌లో పేర్కొన్న 439 పోస్టులతోపాటు ప్రస్తుత నోటిఫికేషన్ కింద మరో 593 పోస్టులను చేర్చారు. మొత్తంగా 1,032 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 2వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ పోస్టులకు రాత పరీక్షను నవంబర్ 12, 13 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉందని వివరించారు. హాల్‌టికెట్లను పరీక్షకు వారం రోజుల ముందు నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 2015 డిసెంబర్ 30న జారీ చేసిన మొదటి నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని సుబ్రహ్మణ్యన్ వివరించారు. వారి పాత దరఖాస్తులను ఈ అనుబంధ నోటిఫికే షన్‌కు కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.



ఓటీఆర్ తర్వాతే దరఖాస్తు..

వన్‌టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకోని వారు ఓటీఆర్ చేసుకున్నాకే గ్రూప్-2 కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఓటీఆర్ చేసుకున్న అభ్యర్థులు నేరుగా గ్రూప్-2 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు మినహా మిగతా వాటికి జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి సాధారణంగా 34 ఏళ్లుగా ఉంది. అయితే ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని పదేళ్లు పెంచింది. అంటే 44 ఏళ్ల లోపు వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా కేటగిరీ అభ్యర్థులకు దీనికి అదనంగా రిజర్వేషన్లు వర్తిస్తాయి. అయితే 58 ఏళ్లకు మించిన వారు అనర్హులు. ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కచ్చితంగా చెల్లించాలి. పరీక్ష ఫీజు కింద రూ. 140 చెల్లించాలి. నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ కు మాత్రం పరీక్ష ఫీజు మినహాయింపు ఉంది. వారు డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి. అన్ని జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.



మరికొన్ని నిబంధనలు..

2015 డిసెంబర్ 30 నాటికి నిర్ణీత విద్యార్హతలు ఉన్నవారు, 2015 జూలై 1వ తేదీ నాటికి నిర్ణీత వయోపరిమితి కలిగిన అభ్యర్థులు గత నోటిఫికేషన్‌తోపాటు తాజాగా జారీ చేసిన సప్లిమెంటరీ నోటిఫికేషన్‌కు కూడా అర్హులే. 2015 డిసెంబర్ 30 నాటికి నిర్ణీత విద్యార్హతలు లేని అభ్యర్థులు పాత నోటిఫికేషన్‌కు అనర్హులు. 18 ఏళ్లలోపు వారితోపాటు గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్ (పోస్టు నెంబరు 3) పోస్టుకు 2015 జూలై 1 నాటికి 20 ఏళ్లు నిండని వారు పాత నోటిఫికేషన్‌కు అన ర్హులు. పాత నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరైనా 2016 జూలై 1నాటికి గరిష్ట వయోపరిమితిని మించితే(అన్ని రకాల వయోపరిమితి సడలింపులు, మినహాయింపులు కలుపుకొని) సప్లిమెంటరీ నోటిఫికేషన్‌కు అనర్హులు. జనరల్ అభ్యర్థులైతే 44 ఏళ్లు దాటిన వారు అనుబంధ నోటిఫికేషన్‌కు అనర్హులు. పాత నోటిఫికేషన్‌కు మాత్రం వారు అర్హులే. 2016 జూలై 1నాటి 44 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని దాటిన వారు(జనరల్), ఎక్సైజ్ సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టు విషయంలో 28 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని దాటిన జనరల్ అభ్యర్థులు సప్లిమెంటరీ నోటిఫికేషన్‌కు అనర్హులు. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువసార్లు దరఖాస్తులను సబ్మిట్ చేయవద్దు. అలాగే టీఎస్‌పీఎస్సీ ఐడీ కూడా ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు. అలాంటి వారి దరఖాస్తులను తిరస్కరిస్తారు. పోస్టులు, పరీక్షా విధానం, సిలబస్, ఖాళీల వివరాలు, విద్యార్హతలు తదితర పూర్తి వివరాలు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.


ఇదీ పరీక్ష విధానం..

మొత్తంగా 675 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో పార్ట్-ఏ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉండగా.. పార్ట్-బీలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూను 75 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్-ఏలో నాలుగు పేపర్లు ఉంటాయి.

 

 పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు. 150 మార్కులు.

 

 పేపర్-2: హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. 2.30 గంటలు. 150 ప్రశ్నలు. 150 మార్కులు.

 (1.తెలంగాణ, ఇండియా సాంఘిక సాంస్కృతిక చరిత్ర; 2.భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం; 3.సమాజ నిర్మాణం, అంశాలు, ప్రజా విధానాలు. ఈ మూడింటిలో ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి)

 

 పేపర్-3: ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు. 150 మార్కులు.

 (1.భారత ఆర్థిక వ్యవస్థ: అంశాలు, సవాళ్లు; 2.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివద్ధి; 3.అభివద్ధి, మార్పు అంశాలు. ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి)

 

 పేపర్-4: తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు. 150 మార్కులు.

 

 (1.తెలంగాణ తొలి దశ -ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-1970); 2.ఉద్యమ దశ (1971-1990); 3.తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం (1991-2014). ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి).

 

 ఆరో జోన్‌లోనే అధికం


 గ్రూప్-2 కింద భర్తీ చేయనున్న పోస్టుల్లో అత్యధికం ఆరో జోన్‌లోనే ఉన్నాయి. మొత్తం 1,032 పోస్టుల్లో 595  ఈ జోన్‌లో ఉన్నాయి. ఐదో జోన్‌లో 289 పోస్టులు ఉండగా..మల్టీజోన్ కేటగిరీలో 19 పోస్టులు ఉన్నాయి. రాష్ట్రస్థాయి పో స్టులు 128 ఉండగా, సిటీ కేడర్ కింద ఒక పోస్టు ఉంది. రాష్ట్ర స్థాయి పోస్టుల్లో జీఏ డీ, ఫైనాన్స్, న్యాయశాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను చేర్చగా, మల్టీ జోన్ పోస్టుల్లో గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పోస్టులను చేర్చారు. అసిస్టెంట్ లేబ ర్ ఆఫీసర్ పోస్టులు 3 ఉండగా అందులో 2 పోస్టులు ఐదో జోన్‌లో ఉండగా.. ఒక పోస్టు సిటీ కేడర్‌లో ఉంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top