త్వరలో ‘గ్రేటర్’మార్కెట్లు

త్వరలో ‘గ్రేటర్’మార్కెట్లు


హైదరాబాద్‌లో 50 మోడల్ మార్కెట్ల నిర్మాణం!

* రూ. 25 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసిన జీహెచ్‌ఎంసీ


హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో సర్కారు నిర్వహణలో ఆధునిక మార్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ మార్కెట్ కాంప్లెక్స్‌లకు దీటుగా వీటిని తీసుకురానున్నారు. కూరగాయలతో పాటు వివిధ రకాల ఆహారపదార్థాలు,  మాంసం తదితరాలు ఇందులో లభిస్తాయి. స్థలాన్ని బట్టి రెండు అంతకుమించి అంతస్తుల్లో నిర్మించే ఈ మార్కెట్‌లలో పార్కింగ్ ఏరియా, ఏటీఎంలు కూడా అందుబాటులో ఉంటాయి.  



గ్రేటర్ వాసులకు ఉపయోగపడే విధంగా ఈ ఆధునాతన మార్కెట్లను నిర్మించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది.  ఇందులో భాగంగా నగరంలో రూ. 25 కోట్లతో 50 మోడల్ మార్కెట్లు నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు టెండర్లు కూడా పిలిచారు. టెండర్ల తుది గడువు ఆగస్టు 5 వ తేదీ తర్వాత పనులు చేపట్టనున్నారు. పది ప్యాకేజీలుగా వీటిని నిర్మిస్తారు. మరోవైపు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ పనుల కోసం రూ.2,631 కోట్ల అంచనాతో టెండర్లను పిలిచేందుకు జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం చేసింది.



ఆర్థికశాఖ వద్ద దీనికి సంబంధించిన పనులు పూర్తి కావాల్సి ఉందని  జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ ‘సాక్షి’కి  తెలిపారు. కాగా, గతంలో సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌ను సందర్శించిన సీఎం కేసీఆర్ దానిని కూడా ఆధునీకరిస్తామని హామీ ఇవ్వడం తెలిసిందే. దీనికి సంబంధించి ఇంకా ప్రణాళికలు పూర్తి కాలేదు. ఎర్రగడ్డ రైతుబజార్ వద్ద కూడా ఆధునిక మార్కెట్ నిర్మించే ప్రతిపాదనలున్నాయి.

 

మోడల్ మార్కెట్లు ఇక్కడే..

ప్యాకేజీ-1 : రామంతాపూర్, హబ్సిగూడ, మన్సూరాబాద్, భూపేశ్‌గుప్తా నగర్, క్రాంతి నగర్.

ప్యాకేజీ-2    : హుడా కాంప్లెక్స్ (సరూర్ నగర్), వనస్థలిపురం, సరూర్ నగర్, గడ్డిఅన్నారం, హయత్‌నగర్

ప్యాకేజీ-3    : నల్లగొండ చౌరస్తా, చార్మినార్, సైదాబాద్,సైఫాబాద్, శాంతినగర్

ప్యాకేజీ-4    : రక్షాపురం, మిథాని బస్టాప్, బార్కాస్, జుమేరాత్ బజార్, రాజేంద్రనగర్

ప్యాకేజీ-5    : విజయనగర్‌కాలనీ, లంగర్‌హౌస్ ట్యాంక్, ఎంజే మార్కెట్ రోడ్, పుత్లిబౌలి

ప్యాకేజీ-6    : విద్యానగర్, రాంనగర్, చిక్కడపల్లి, బాపూజీనగర్

ప్యాకేజీ-7    : గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్, ఖైరతాబాద్, పంజాగుట్ట,సనత్‌నగర్, సాయిరావునగర్ బస్తీ

ప్యాకేజీ-8    : కొండాపూర్, రాయదుర్గం, బయోడైవర్సిటీ పార్కు ఎదుట, ఖాజాగూడ, గచ్చిబౌలి, మదీనగూడ

ప్యాకేజీ-9    : ఆర్‌సీపురం, పటాన్‌చెరు, కూకట్‌పల్లి, ప్రశాంత్ నగర్, కూకట్‌పల్లి ఎమ్మార్వో కార్యాలయం

ప్యాకేజీ-10: చింతల్, సూరారం, కుత్బుల్లాపూర్, సుభాష్‌నగర్,ఈస్ట్ మారేడ్‌పల్లి, సీతాఫల్‌మండి

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top