అద్దెకు కార్యాలయాలు చూసుకోండి

అద్దెకు కార్యాలయాలు చూసుకోండి - Sakshi


ఇప్పటికే రెండు జిల్లాల కలెక్టర్లు ప్రైవేట్ భవనాలను గుర్తించారు

కలెక్టర్ల సహకారంతో అద్దె ఒప్పందాలు చేసుకోండి

ఎంత అద్దె అయినా సర్కారు ఇస్తుంది

27న నూతన రాజధాని నుంచే పనిచేయాలి: సీఎస్


హైదరాబాద్: జూన్ 27వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నుంచే శాఖాధిపతుల కార్యాలయాలు పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ లోగా శాఖాధిపతుల కార్యాలయాలన్నీ హైదరాబాద్ నుంచి రాజధాని ప్రాంతం గుంటూరు, విజయవాడలకు తరలి వెళ్లాల్సిందేనని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ బుధవారం సర్క్యులర్ జారీచేశారు. తొలి ప్రాధాన్యతగా శాఖలకు చెందిన ప్రభుత్వ భవనాలు రాజధాని ప్రాంతంలో ఉంటే అక్కడికి తరలివెళ్లాలని పేర్కొన్నారు. లేదంటే గుంటూరు, విజయవాడల్లో ఆ జిల్లాల కలెక్టర్లు ప్రైవేటు భవనాలను గుర్తించారని, వెంటనే ఆ భవనాలు పరిశీలించి అద్దెకు తీసుకోవడంతో పాటు జూన్ 27లోగా తరలివెళ్లిపోవాలని స్పష్టం చేశారు.



హైదరాబాద్‌లోని కార్యాలయాల్లోని ఫర్నీచర్, పరికరాలతో పాటు ఉద్యోగులందరూ 27లోగా తరలివెళ్లాల్సిందేనని, 27వ తేదీ తర్వాత రాజధాని ప్రాంతం నుంచే విధులు నిర్వహించాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇప్పటికే 16,96,231 చదరపు అడుగుల నిర్మాణ స్థలం గల 85 ప్రైవేటు భవనాలను గుర్తించారని, అలాగే 2,34,000 చదరపు అడుగుల పార్కింగ్ స్థలాన్ని గుర్తించారని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ 1,50,000 చదరపు అడుగుల నిర్మాణ స్థలం గల నాలుగు ప్రైవేట్ భవనాలను గుర్తించారని తెలిపారు. శాఖాధిపతుల కార్యాలయాల ఉన్నతాధికారులు గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్ల సహాయ సహకారాలతో ప్రైవేట్ భవనాలను పరిశీలించి అద్దె ఒప్పందాలను చేసుకోవాలని స్పష్టం చేశారు. అద్దె ఒప్పందాలను మూడు సంవత్సరాల వరకు చేసుకోవాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఒక వేళ ఏ శాఖాధిపతి కార్యాలయమైనా నిర్మాణంలో ఉంటే ఆ నిర్మాణం పూర్తి అయ్యే వరకు అద్దెకు కార్యాలయాన్ని చూసుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10ల్లో ఉన్న సంస్థలు మినహా మిగతా శాఖాధిపతుల కార్యాలయాలన్నీ తరలివెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. శాఖాధిపతుల కార్యాలయాలకు అవసరమైన ప్రైవేట్ భవనాలకు ఎంత వరకైనా అద్దె చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అధికారుల సమావేశంలో స్పష్టం చేశారు. చదరపు అడుగుకు 25 రూపాయల వరకు నెలకు అద్దె చెల్లించేందుకు కూడా వెనుకాడేది లేదని ఆయన తెలిపారు.

 


పిల్లి మొగ్గలు

శాఖాధిపతుల కార్యాలయాల తరలింపు, వాటికి వసతి విషయంలో ప్రభుత్వ పెద్దలు ముందు నుంచి ఒక మాటపై లేకుండా తడవకో మాట మారుస్తూ పిల్లిమొగ్గలు వేస్తూ వస్తున్నారు. తొలుత శాఖాధిపతుల కార్యాలయాల కోసం అద్దె భవనాలను చూసుకోవాలని సూచించారు. ఆ తరువాత అద్దె భవనాలు చూసుకోవద్దని, వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం భవనాల్లోనే మరో రెండు అంతస్థులు శాఖాధిపతుల కార్యాలయాల కోసం నిర్మిస్తామని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా మరో రెండు అంతస్థుల నిర్మాణాలకు టెండర్లను కూడా ఆహ్వానించారు. అయితే మళ్లీ మాటమార్చిన ప్రభుత్వం శాఖాధిపతుల కార్యాలయాల కోసం ప్రైవేట్ భవనాలను అద్దెకు తీసుకోవాలని సూచించింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top