వైద్య విద్యలో పరిశోధనకు ‘మెరిట్‌’!

వైద్య విద్యలో పరిశోధనకు ‘మెరిట్‌’! - Sakshi


రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించనున్న సర్కారు

ఎంబీబీఎస్, పీజీ విద్యార్థుల కోసం రూపకల్పన

దేశంలోనే మొదటిసారిగా ప్రత్యేక కార్యాచరణ

నాలుగు విభాగాల్లో పరిశోధనలకు అవకాశం

ఇప్పటికే పలు అంశాలపై 170 దరఖాస్తులు




సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో చదివే ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులు, అధ్యాపకులు వివిధ అంశాలపై పరిశోధన చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో వైద్య విద్య, పరిశోధన (మెరిట్‌) అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. వ్యక్తులుగా, గ్రూపులుగా ఏర్పడి వివిధ అంశాలపై పరిశోధన చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇందుకోసం రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం (స్కాలర్‌షిప్‌) అందిస్తారు. దీనికోసం ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించగా.. 170 మంది ముందుకు వచ్చారు.



దరఖాస్తులతో పాటు తాము ఏ అంశంపై పరిశోధన చేయాలనుకుంటున్నారో కూడా పేర్కొన్నారు. అధికారులు దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేసి.. స్కాలర్‌షిప్‌ అందజేస్తారు. అభ్యర్థులు వారు పేర్కొన్న అంశాలపై పరిశోధన చేసి ప్రభుత్వానికి పరిశోధన పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) ప్రశంసించిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.



ఈ సారి అంశాలు రక్తహీనత, మలేరియా

‘మెరిట్‌’ స్కాలర్‌షిప్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు కేటాయించింది. ఇందులో వివిధ విభాగాల్లో పరిశోధనకు అవకాశం కల్పించారు. అడ్‌హాక్‌ రీసెర్చ్‌ విభాగంలో విద్యార్థులు నచ్చిన అంశంపై పరిశోధన చేయవచ్చు. దీనికి ఇప్పటివరకు 47 మంది దరఖాస్తు చేసుకున్నారు. టాలెంట్‌ రీసెర్చ్‌ విభాగంలో ఇద్దరు ముగ్గురు కలసి సీసీఎంబీ, ఐఐసీటీలతో ఉమ్మడిగా పరిశోధన కొనసాగించాల్సి ఉంటుంది. ఇందుకోసం 53 మంది దరఖాస్తు చేసుకున్నారు.



అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ విభాగంలో కొన్ని ప్రత్యేకమైన అంశాలపై పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు విటమిన్ల లోపంతో బాధపడే వారికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన అంశాలను ఎలా అమలు చేయాలో పరిశోధిస్తారు. ఈ విభాగం కింద 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక టాస్క్‌ఫోర్స్‌ రీసెర్చ్‌ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఇందులో ఈసారి రక్తహీనత, మలేరియాలతోపాటు దీర్ఘకాలిక వ్యాధులపై పరిశోధన చేయాల్సి ఉంటుంది. దీనికి 50 మంది దరఖాస్తు చేసుకున్నారు.



అవసరమైతే మరింత సాయం..

‘మెరిట్‌’కింద జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి కూడా విద్యార్థులు, అధ్యాపకులు పరిశోధన చేయవచ్చు. అవసరమైతే రూ.లక్షకు మించి కూడా ఆర్థిక సాయం అందజేస్తారు. వైద్య విద్యలో నాణ్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్యరంగం ఎదుర్కొంటున్న కీలకమైన అంశాలపై అధ్యయనం, పరిశోధన చేయాలనేది మంత్రి లక్ష్మారెడ్డి ఉద్దేశమని.. దానికి అనుగుణంగా ఆయన సీఎంతో చర్చించి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారని చెబుతున్నాయి. త్వరలోనే మంత్రి చేతుల మీదుగా ఈ పరిశోధన కార్యక్రమం మొదలవుతుందని వెల్లడించాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top