సరళం...సులభం

సరళం...సులభం - Sakshi


- భవన నిర్మాణ అనుమతులకు కొత్త విధానం

- బీపీఎస్ అమలుకు సర్కారు సిద్ధం

- అక్ర మాలకు చెక్ పెట్టే వ్యూహం

- మళ్లీ మొదలైతే కూల్చివేతకు నిర్ణయం

సాక్షి, సిటీబ్యూరో:
గ్రేటర్ పరిధిలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్) దిశగా అడుగులు వేసేందుకు ప్రభుత్వం మరోసారి సిద్ధమవుతోంది. అదే సమయంలో భవిష్యత్తులో తిరిగి ఇలాంటివి పునరావృతం కాకుండా కట్టడి చేయాలనేది సర్కారు వ్యూహం. ఈ క్రమంలో భవన నిర్మాణ అనుమతులను అత్యంత సరళీకరించనున్నారు. ఆ తరువాత ఎవరైనా అక్రమ నిర్మాణాలకు పాల్పడితే నిర్దాక్షిణ్యంగా కూల్చి వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు.. అక్రమ నిర్మాణం పూర్తయ్యేంతదాకా ఉపేక్షించే సంబంధిత అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.



అవసరమైతే ఏకంగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చే యాలనే కఠిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనలో అధికారులు తలమునకలవుతున్నారు. అన్నిచోట్లా ఒకే మాదిరిగా కాకుండా ఆయా ప్రాంతాల డిమాండ్‌ను బట్టి ఫీజులు నిర్ధారించాలనే యోచనలో అధికారులు ఉన్నారు.

 

జీహెచ్‌ఎంసీలో ట్రేడ్ లెసైన్సులు, ప్రకటనల పన్నులకు సంబంధించిన విధానాలు గతంలో గందరగోళంగా ఉండి సామాన్యులకు అర్థమయ్యేవి కావు. వాటిని స్వల్ప మార్పులతో కమిషనర్ సోమేశ్ కుమార్ సరళీకరించారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఫీజులు నిర్ధారించేందుకు ఆయా ప్రాంతాల్లోని రహదారుల వెడల్పు, అంతర్గత కాలనీలు అనే అంశాల వారీగా ఫీజు వసూలు విధానాన్ని నిర్ణయించారు. దాదాపుగా ఇదే పద్ధతిని భవన నిర్మాణ ఫీజులకు వర్తింపజేసే అవకాశం ఉంది. దాంతో పాటు సెట్‌బ్యాక్‌ల విషయంలోనూ వీలైనంత మేరకు ప్రజలకు ఎక్కువ ప్రయోజనం ఉండేలా చేయాలని ప్రభుత్వ యోచన.



ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. బీపీఎస్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించడం ద్వారా తప్పుడు తేదీలతో రబ్బరు స్టాంపులు వేసే అవకాశం ఉండదని భావిస్తున్నారు. బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లతో జీహెచ్‌ఎంసీ ఖజానాకు దాదాపు రూ. 2 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కమిషనర్ సోమేశ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. శనివారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. భవన నిర్మాణ అనుమతులను సరళీకరించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని పేదలకు ఉపకరించేలా సెట్‌బ్యాక్‌లు, ఇతర అంశాల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.

 

అక్రమాలకు చెక్

భవన నిర్మాణాల్లోనే కాకుండా జీహెచ్‌ఎంసీలో వివిధ విభాగాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు సాంకే తిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నట్లు కమిషనర్ చెప్పారు. ఒక సర్కిల్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టిన బయోమెట్రిక్ హాజరుతో   వేతన బిల్లులకు సంబంధించి రూ.లక్షల్లో దుబారా ఆగిపోయిందన్నారు. డీజిల్ వినియోగంలో అక్రమాలనూ అరికట్టగలిగామన్నారు. రోజుకు సగటున నాలుగువేల లీటర్ల డీజిల్ మిగులు కనిపిస్తోందని చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top