ఆ ఐదు కేసుల్ని బాబు సర్కార్ పట్టించుకోదేం?

ఆ ఐదు కేసుల్ని బాబు సర్కార్ పట్టించుకోదేం? - Sakshi


- డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి అవరోధంగా మారిన కేసులు

- పరిష్కరించేందుకు అవకాశాలున్నా పట్టించుకోని ప్రభుత్వం

- పోస్టుల భర్తీ ఎగవేసేందుకే తాత్సారం?



సాక్షి, హైదరాబాద్:
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలై ఏడాది గడచింది. పరీక్ష జరిగి ఆరునెలలయ్యింది. నెలలోపే ఫలితాలు వచ్చాయి.. అయినా ఇంతవరకు పోస్టుల భర్తీ జరగలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదలైన ఏకైక నోటిఫికేషన్ అది. ఆ తర్వాత ఒక్క నోటిఫికేషనూ లేదు.. ప్రక్రియ అంతా పూర్తయిన డీఎస్సీ ఎందుకు అలా నీరుగారిపోతోంది.? పోస్టుల భర్తీకి ఆటంకాలుగా ఉన్న కారణాలేమిటి? పరిష్కరించడానికి వీలున్నా ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోంది? ఇవీ అభ్యర్థుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు.



ఉద్యోగాల కుదింపుపైనే సర్కారు కన్ను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 10,313 పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించింది. డీఎస్సీ నిర్వహణలో చోటు చేసుకున్న లోపాల పైన దాదాపు 719 కేసులు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, హై కోర్టులో దాఖలయ్యాయి. జీవో 38పై హైకోర్టులో ఉన్న కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువడినందున అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లోని కేసులను మినహాయించి తక్కిన పోస్టులను భర్తీ చేసుకోవడానికి ఆస్కారముంది. ట్రిబ్యునల్‌లో కేసులున్నా స్టే ఉత్తర్వులు లేనందున నియామకాలకు ఎలాంటి ఆటంకమూ లేదు.



అయితే అన్ని కేసుల్లోనూ విచారణ ముగిసింది. ఇంకా 5 కేసులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిని సత్వరం పరిష్కరింపజేసేందుకు మార్గాలున్నా ప్రభుత్వం ఆ చర్యలు చేపట్టడం లేదు. ఉన్న ఉద్యోగాలు సాధ్యమైంత మేరకు కుదించాలని యోచిస్తున్న సర్కారు... శాశ్వత పోస్టుల భర్తీకి ముందుకెళ్లడం లేదు. రేషనలైజేషన్ పేరుతో 16వేల ఉద్యోగాలు తొలగించడానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఆ ఐదు కేసులేమిటంటే...



అనంతపురానికి చెందిన ఓ అభ్యర్థి జీవో 38ను సవాల్‌చేస్తూ కేసు దాఖలు చేశారు. టెట్‌ను, టెర్ట్‌ను కలిపి నిర్వహిస్తూ జీవో 38ని ప్రభుత్వం విడుదల చేయడం తెలిసిందే. ఇలా రెండింటినీ కలపడంపై హైకోర్టులోనూ కేసు దాఖలవగా కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా మూడు నెలల క్రితం తీర్పు ఇచ్చింది. ఆ కాపీని ట్రిబ్యునల్‌లో సమర్పించి కేసును పరిష్కరింపచేయడానికి వీలున్నా ప్రభుత్వంలో స్పందన లేదు.



విశాఖపట్నానికి చెందిన ఓ అభ్యర్థి ఫ్రెష్ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించలేదని డీఈవో ఆయన దరఖాస్తును తిరస్కరించడంపై ట్రిబ్యునల్‌లో కేసు దాఖలైంది.



అనంతపురానికి చెందిన అభ్యర్థిని ఆధార్, రేషన్‌కార్డు, రెసిడెన్స్ సర్టిఫికెట్ ద్వారా స్థానికతను క్లెయిమ్ చేయగా ఆ దరఖాస్తును డీఈవో తిరస్కరించారు. దీనిపైనా ట్రిబ్యునల్‌లో కేసు దాఖలైంది.



దరఖాస్తును తిరస్కరించడంపై అనంతపురానికి చెందిన ఓ అభ్యర్థి కేసు దాఖలు చేశారు.



పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మరొక అభ్యర్థి దరఖాస్తును తిరస్కరించడంపై కేసు దాఖలైంది. ఈ అయిదింటిలో ఒకటి డిసెంబర్ 8కి విచారణ వాయిదా పడగా రెండింటిలో ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.



ఇవికాక మరో రెండు కేసులూ పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం తమ న్యాయవాదుల ద్వారా వీటికి సత్వర పరిష్కారం చూపించే మార్గమున్నా తాత్సారం చేస్తూ వెళ్లడం వెనుక డీఎస్సీని సాధ్యమైనంతమేర ఆలస్యం చేయడానికేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top