బస్.. నిబంధనలు తుస్స్...

బస్.. నిబంధనలు తుస్స్...


సిటీబ్యూరో: సిటీ బస్సుల్లో మహిళా భద్రత ఒక వెక్కిరింతగా మారింది. మహిళా ప్రయాణికుల భద్రత కోసం రూ.4 కోట్లతో ఏర్పాటు చేసిన మెటాలిక్ డోర్‌లు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. ఈ లోహపు తలుపులను ఏర్పాటు చేయడం వరకే పరిమితమైన ఆర్టీసీ అధికారులు  పర్యవేక్షణ బాధ్యతను విస్మరించారు. సిబ్బంది మరో అడుగు ముందుకేశారు. ఏకంగా ఆ డోర్‌లను తాళ్లతో కట్టేశారు.  దీంతో పురుషులు యథేచ్ఛగా మహిళల సీట్ల మధ్యలోకి వచ్చేస్తున్నారు. మహిళల కోసమే కేటాయించిన ముందు భాగంలోని  ప్రవేశ ద్వారం నుంచి లోపలికి ప్రవేశిస్తున్నారు. మరోవైపు ఇప్పటికీ కొన్ని బస్సుల్లో మెటాలిక్ డోర్‌లు ఏర్పాటు చేయనేలేదు. ఎక్కడా ఎలాంటి నియంత్రణ లేకుండా పోయింది. ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల్లో ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని మహిళలకు  ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా గౌరవప్రదంగా ప్రయాణించేందుకు ఏర్పాటు చేసిన ద్వారం ముణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది.



నగరంలో మహిళల భద్రత కోసం పూనం మాలకొండయ్య నేతృత్వంలోని మహిళా భద్రతా కమిటీ ప్రభుత్వానికి పలు సిఫార్సులు  చేసిన సంగతి తెలిసిందే. షీటీమ్స్, షీక్యాబ్స్, సిటీ బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు వంటి అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లోని 2,600 ఆర్డినరీ బస్సులకు రూ.4 కోట్లతో ఈ మెటాలిక్ డోర్‌లను ఏర్పాటు చేశారు. దశలవారీగా మిగతా బస్సులకు సైతం ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు 90 శాతం బస్సుల్లో ఆ మెటాలిక్ డోర్‌లు బార్లా తెరుచుకుంటున్నాయి. మరోవైపు ఈ డోర్‌లను ఏకంగా తాళ్లతో కట్టేసి ఉంచడం గమనార్హం.



ఆర్టీసీ బాధ్యతారాహిత్యం...

‘మహిళలను గౌరవిద్దాం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం..’ ఆర్టీసీ బస్సుల్లో కనిపించే నినాదం ఇది. కానీ అమలులోనే ఆచరణకు నోచుకోవడం లేదు. బస్సుల నిర్వహణలో అధికారుల నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముందు ప్రవేశద్వారం నుంచి పురుషులు ఎక్కినా.. దిగినా.. మహిళల సీట్లలో కూర్చున్నా గతంలో జరిమానా విధించే పద్ధతి ఉండేది. అలాగే ఫుట్‌బోర్డు ప్రయాణం పట్ల కూడా నిఘా ఉంచేవారు. కానీ కొంతకాలంగా ఆర్టీసీ బస్సుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎలాంటి నిఘా, పర్యవేక్షణ లేకుండా పోయింది.



సీసీ కెమెరాలు కూడా అంతేసంగతులు..

ఆర్డినరీ బస్సులకు ఏర్పాటు చేసిన విధంగానే మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, మెట్రో డిలక్స్‌లతో పాటు మొత్తం 3,850 బస్సుల్లోనూ నిఘాను కట్టుదిట్టం చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఇందుకోసం జీపీఎస్‌తో అనుసంధానం చేసిన చేసిన బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కనీసం 48 గంటల పాటు రికార్డయ్యే సామర్థ్యం ఉన్న సీసీ కెమెరాలను బస్సు లోపలి వైపు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. కేవలం 80 సిటీ ఓల్వో బస్సులకే అది పరిమితమైంది.

 

దర్జాగా కూర్చుంటారు

ఆడవాళ్ల సీట్లలో కూర్చోవద్దనే కనీస మర్యాద కూడా పాటించడం లేదు. దర్జాగా వచ్చి కూర్చుంటున్నారు. కండక్టర్‌లు, డ్రైవర్లు వారిని ఏ మాత్రం నియంత్రించడం లేదు. ఇక వెనుక వైపు నుంచి ఎక్కిన వాళ్లు కూడా క్రమంగా ముందుకు చొచ్చుకొని వస్తున్నారు. మెటాలిక్ డోర్‌లు పూర్తిగా తెరిచే ఉంటాయి. ఇప్పుడు వాటి వల్ల ఎలాంటి భద్రతా లేకుండా పోయింది.

 -మాలతి, కూకట్‌పల్లి

 

ఫుట్‌బోర్డు కిక్కిరిసిపోతుంది

ఉదయం, సాయంత్రం బాగా రద్దీ ఉండే సమయాల్లో స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ముందు డోర్ నుంచి ఎక్కేసి అక్కడే ఉండిపోతున్నారు. దీంతో మహిళలు బస్సులోకి ఎక్కాలన్నా, దిగాలన్నా కష్టంగా ఉంటుంది.

 -శిరీష , చందానగర్

 

డోర్‌లు ఉండి ఏం లాభం

చూడ్డానికి అన్ని బస్సుల్లో ఈ డోర్‌లు కనిపిస్తున్నాయి. కానీ ఎప్పుడు చూసినా తెరిచే ఉంచుతారు. దీంతో పురుషులు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు యథేచ్ఛగా వస్తారు. నిలబడి ఉండే మహిళా ప్రయాణికులకు ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది.

 - చంద్రకళ, సికింద్రాబాద్

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top