ప్రపంచ సమస్య మానవ అక్రమ రవాణా

ప్రపంచ సమస్య  మానవ అక్రమ రవాణా - Sakshi


నివారణకు పోరాడుదాం.. సమస్యను కళ్లకు కట్టిన ‘నా బంగారు తల్లి’

ప్రత్యేక సభలో అమల అక్కినేని  నేడు వరల్డ్ అగెనెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ డే


 

సిటీబ్యూరో: ప్రపంచంలోని ప్రతి దేశాన్ని మానవ అక్రమ రవాణా సమస్య వేధిస్తోందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ క్రూరమైన చర్యను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినంగా జరుపుతారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి అవగాహన కల్పించేందుకు అమెరికన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో యూఎస్ కాన్సులేట్ జనరల్ మైఖెల్ ముల్లిన్స్, అమల  అక్కినేని, సునీత కృష్ణన్, ఫిలిం డెరైక్టర్ రాజేష్ పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణాపై రాజేష్ తెరకెక్కించిన ‘నా బంగారుతల్లి’ చిత్రాన్ని ప్రదర్శించారు.



అనంతరం మైఖెల్ ముల్లిన్స్ మాట్లాడుతూ.. అన్ని దేశాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ సమస్య ఉందని, ప్రతి దేశం ఈ విషయంపై దృష్టి సారించాలన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అమల  మాట్లాడుతూ.. దేశంలో 30 లక్షల మంది స్త్రీలు అక్రమ రవాణాకు గురైతే అందులో 40 శాతం మంది పిల్లలు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నా బంగారు తల్లి చిత్రాన్ని మొదటి సారి చూసినప్పుడు తన మనసు కదిలిపోయిందన్నారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా 15 వేల మంది స్త్రీలను అక్రమ రవాణా నుంచి రక్షించగలిగామని, ఇలాంటి బాధితుల కోసం ప్రభ్వుత్వాలు స్పందించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ.. హ్యూమన్ ట్రాఫికింగ్ సమస్య మనకు సంబంధించింది కాదనే ధోరణి మానుకుని, సమస్య నిర్మూలనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. తదుపరి జరిగిన చర్చా కార్యక్రమంలో పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌కి ఫలానా వర్గం అమ్మాయిలు మాత్రమే గురవుతారని చెప్పడం కష్టమని, చదువుకున్నవారు, చదువుకోని వారు, ఉద్యోగులు, చిన్నపిల్లలు.. ఇలా అన్ని వర్గాలకు  చెందిన వారు బాధితులుగా మారే అవకాశం ఉందన్నారు. అమెరికాలో ట్రాఫికింగ్ విక్టిమ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2000లో వచ్చిందని, దాని స్ఫూర్తితో ఇండియాలో ఆ చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని వక్తలు పేర్కొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top