అంతిమ పోరుకు సిద్ధం కండి

అంతిమ పోరుకు సిద్ధం కండి - Sakshi


కాపు, తెలగ, బలిజ, ఒంటర్లకు ముద్రగడ పిలుపు

 

 సాక్షి, హైదరాబాద్: ‘చంద్రబాబూ.. వంకర మాటలొద్దు. ఆగస్టులోగా నివేదిక ఇప్పిస్తామన్నారు. ఇంత వరకు అతీగతీ లేదు. అదేమంటే ఎదురుదాడి చేయిస్తున్నారు. అందుకే ఆగస్టులో అంతిమ పోరాటానికి పిలుపునిస్తున్నాం. కాపు, తెలగ, బలిజ, ఒంటర్లు ఆఖరి పోరుకు సమాయత్తం కావాలి. మన లక్ష్యం బీసీ హోదా. అది సాధించే వరకు మీరు నిద్రపోవద్దు.. చంద్రబాబును నిద్రపోనివ్వద్దు’ అని కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు.



కాపుల కన్నా వెనుక ఉద్యమం ప్రారంభించిన గుజ్జర్లు, జాట్లు రిజర్వేషన్లు సాధించుకున్నా తమ జాతి మొర మాత్రం ఈ పాలకుల చెవికెక్కడం లేదన్నారు. ఆగస్టు ఉద్యమ సన్నాహక చర్యల్లో భాగంగా హైదరాబాద్‌లోని వివిధ సామాజిక వర్గాలను కలిసేందుకు వచ్చిన ఆయన ఆదివారమిక్కడ జంట నగరాల కాపు యువతను ఉద్దేశించి ప్రసంగించారు. బాబు మంత్రివర్గంలోని చెక్కభజన బృందం ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రసక్తే లేదన్నారు. ‘ఈ రాష్ట్రంలో చాలా చోట్ల కమ్మ సంఘం భవనాలున్నాయి. వాటికి కాపు కమ్మ భవనాలని పేరు పెట్టగలరా?  తక్షణం చంద్రన్న పదం తీసేయండి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టులోపు బీసీ కమిషన్ నివేదిక రాకుంటే తుది పోరుకు సిద్ధం కావాలన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి 9వ షెడ్యూల్‌లో చేర్చే వరకు మడమ తిప్పొద్దన్నారు. ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసి జంటనగరాల్లోని కాపుల్ని బీసీల్లో చేర్చమని కోరతామన్నారు.



 బీసీ నేత కృష్ణయ్యతో భేటీ

  ముద్రగడ ఆదివారం టీటీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్యతో భేటీ అయ్యారు. కాపుల ఉద్యమానికి మద్దతు ఇమ్మని కోరారు.దీనిపై కృష్ణయ్య స్పందిస్తూ.. కాపులను బీసీ జాబితాలో చేర్చే విషయమై తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ముద్రగడ చెబుతున్నట్లు ప్రత్యేక గ్రూపుగా రిజర్వేషన్ కల్పించడానికి రాజ్యాంగాన్ని సవరిస్తే బీసీలు, కాపుల మధ్య దూరం పెరగదని చెప్పారు. అంతకు ముందు ముద్రగడ కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ మంత్రి శైలజానాథ్, బీజేపీ కిసాన్‌మోర్చా నేత తేలపల్లె రాఘవయ్య, మొవ్వా కృష్ణారావును కలిసి మద్దతు కోరారు.సినీనటుడు, జనసేన నేత పవన్ కళ్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కాగా, ముద్రగడ సోమవారం వైఎస్సార్ సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో భేటీ కానున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top