భారత్-చైనా మైత్రి బలపడాలి

భారత్-చైనా మైత్రి బలపడాలి


సుల్తాన్‌బజార్: భారత్-చైనా దేశాల మధ్య మైత్రి ఇరు దేశాల అభివృద్ధికి దోహదం చేస్తుందని మేధావులు అభిప్రాయ పడ్డారు. భారత్-చైనా మిత్ర మండలి ఆధ్వర్యంలో ఆదివారం బొగ్గులకుంటలోని ఆంధ్రసారస్వత పరిషత్ ఆడిటోరియంలో ‘దేశాభివృద్ధిలో భారత్-చైనా మైత్రి ప్రాధాన్యత’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మండలి ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం. మోహన్‌రెడ్డి అధ్యక్షత వహించగా ప్రధాన వక్తలుగా ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తిలు పాల్గొని ప్రసంగించారు.



విద్యావేత్త చుక్కా రామయ్య ప్రసంగిస్తూ చైనా ప్రజలు భారతదేశానికి వ్యతిరేకంగా లేరన్నారు. ఇరుదేశాల మధ్య మైత్రి ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పొరుగు దేశాలతో శత్రుత్వం మంచిదికాదన్నారు. దేశంలో కులమతాలకు ఉండే ప్రాధాన్యతలు ప్రధాని నరేంద్రమోడీ తగ్గించాలని కోరారు. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి ప్రసంగిస్తూ ప్రస్తుత తరుణంలో ఆత్మనింద, పరస్తుతి ఎక్కువగా ఉందని అన్నారు. దేశంలో ఆర్ధిక అంశాలపై చర్చలు తక్కువగా జరుగుతున్నాయని, అదే రాజకీయంపై ఎక్కువగా చర్చిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ పౌరులు ఆర్ధిక అంశాలపై చర్చించే విధంగా పరిస్థితులు మారాలని అభిప్రాయ పడ్డారు.



అధిక జనాభా ఉన్న ైచైనాతో వ్యాపారం చేయడం ఇరు దేశాలకు ఉభయ తారకమన్నారు. కేవలం ఆయుధ సంపత్తిని పెంపొందించుకోవడంలోనే దేశ భద్రత ఉందనుకోవడం సరైన అభిప్రాయం కాదని తెలిపారు. చైనా మీదికి మనదేశాన్ని ఉరిగొల్పేందుకు అమెరికా యత్నిస్తుందన్నారు. అమెరికా గురించి తెలిసినంతగా చైనా ఆర్థిక పరిస్థితి గురించి 90 శాతం మీడియా జర్నలిస్టులకు తెలియదని పేర్కొన్నారు. చైనా నుంచి మన దేశానికి అంతగా రాకపోకలు లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణమన్నారు. రెండు దేశాల సంబంధాల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా మంచిదని ఈ విషయంలో భారత్-చైనా మిత్రమండలి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.



సామాజిక, ఆర్ధిక విశ్లేషకులు డా.పాపారావు మాట్లాడుతూ చైనా ప్రపంచానికే ఫ్యాక్టరీ లాంటిదన్నారు. మన దేశానికి ప్రణాళిక బద్ధమైన అభివృద్ధి అవసరవన్నారు. కేవలం మేకిన్ ఇండియాతో ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభించదని వ్యవసాయరంగాన్ని ప్రొత్సహించాలని సూచించారు. ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కె. చక్రధర్‌రావు ప్రసంగిస్తూ మన దేశంలో వ్యవసాయ రంగం నిలదొక్కుకునే పరిస్థితి రావాలన్నారు.



రెండున్నర లక్షల మంది రైతులు చనిపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రాలకు సైతం ఆ సమస్య కనబడక పోవడం దారుణమన్నారు. ఈ సదస్సులో భారత్-చైనా సంయుక్త వైద్యబృందం నాయకులు డాక్టర్ బి.ప్రతాపరెడ్డి, నవోదయ సాంస్కృతిక సంస్థ డాక్టర్ జతిన్‌కుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top