24 గంటలు ఉచిత వైఫై


- కాచిగూడ, విజయవాడ రైల్వే స్టేషన్‌లలో హైస్పీడ్ సేవలు షురూ

- వీడియో లింకేజీ ద్వారా ప్రారంభించిన రైల్వే మంత్రి




హైదరాబాద్‌సీటీ : కాచిగూడ, విజయవాడ రైల్వే స్టేషన్‌లలో 24 గంటల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని వినియోగించుకొనే హైస్పీడ్ వైఫై సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. న్యూఢిల్లీ రైల్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైల్వేమంత్రి సురేష్ ప్రభు, కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి వీడియో లింకేజీ ద్వారా వైఫై సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాచిగూడ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, దక్షిణమధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఎకె గుప్తా తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ ఇండియా’లో భాగంగా డిజిటల్ రైల్-డిజిటల్ ఇండియా’ కార్యక్రమానికి రైల్వే అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని ఏజీఎం అన్నారు. దక్షిణమధ్య రైల్వేలోని అన్ని ఎ1, ఎ,బి కేటగిరి రైల్వేస్టేషన్‌లకు వైఫై సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో నాంపల్లి, వరంగల్, తిరుపతి, గుంటూరు, నాందేడ్ స్టేషన్‌లలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో వైఫై సేవలను ఆధునీకరిస్తామన్నారు. దక్షిణమధ్య రైల్వేలో మొత్తం 74 స్టేషన్‌లలో వైఫై సర్వీసులను దశలవారీగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.



హోమంత్రి నాయిని మాట్లాడుతూ, దక్షిణమధ్య రైల్వే పనితీరు అభినందించారు. ప్రయాణికులకు సదుపాయాల కల్పనలో, సేవలలో దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు. అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ ఉన్న కాచిగూడ స్టేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సూచించారు. హైస్పీడ్ సామర్ధ్యం ఉన్న వైఫై సేవలు ప్రారంభించడం వల్ల ప్రయాణికులు ముఖ్యమైన ఫైళ్లను కూడా డౌన్‌లోడ్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని, సాంకేతిక రంగంలో దక్షిణమధ్య రైల్వే అందజేస్తున్న సేవలు ఎంతో బాగున్నాయని నగర మేయర్ ప్రశంసించారు. సేవల వినియోగం ఇలా.... రైల్వేశాఖకు అనుబంధంగా పని చేస్తున్న రైల్‌టెల్ రైల్వేస్టేషన్‌లలో వైఫై సేవలను విస్తరిస్తోంది. గూగుల్ సాంకేతిక భాగస్వామిగా సేవలను అందజేస్తుంది. ప్రతి రోజు 40 వేల మంది ప్రయాణికులు రాకపోక లు సాగించే కాచిగూడ స్టేషన్‌లో 27 యాక్సెస్ పాయింట్‌లు, 12 యాక్సెస్ స్విచ్‌లు ఏర్పాటు చేశారు. స్టేషన్‌లో ఎక్కడి నుంచైనా వైఫై సేవలను పొందేవిధంగా హైస్పీడ్ నెట్‌వర్క్‌తో అనుసంధానించారు. దీనివల్ల ప్రయాణికులు అత్యంత వేగంగా ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. హెచ్‌డీ వీడియో ఫైల్స్‌ను కూడా క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది వాడొద్దు పక్కన పెట్టాలి.



స్మార్ట్ ఫోన్, లేదా లాప్‌టాప్‌లో వైఫై రావాలంటే కింది విధంగా చేయాలి. -కాచిగూడ స్టేషన్‌లోకి ప్రవేశించగానే రైల్‌టెల్ వారి రైల్ వైర్ వై-ఫై నెట్‌వర్క్ డిస్‌ప్లే అవుతుంది. -వెంటనే దానికి కనెక్ట్ కావాలి. -బ్రౌజర్ ఓపెన్ చేయగానే మొబైల్ నెంబర్ అడుగుతుంది. -మీ మొబైల్ నెంబర్ ఇవ్వగానే మీకు నాలుగు అంకెల వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఒటిపి) వస్తుంది. -ఆ పాస్‌వర్డ్ ఎంటర్ చేయగానే వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top