ఉద్యోగులకు సొమ్ముల్లేని చికిత్స


* హెల్త్‌కార్డుల పథకంలో ఉద్యోగులకు స్వేచ్ఛ.. ముసాయిదా మార్గదర్శకాలు సిద్ధం

* దంపతులిద్దరూ ఉద్యోగులైతే ఇద్దరి తల్లిదండ్రులకూ వర్తింపు

* కుటుంబ పెన్షనర్ మీద ఆధారపడిన వారికీ పథకం వర్తించదు

* పథకం అమలు బాధ్యత ఆరోగ్యశ్రీ ట్రస్టుకు


 

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు నగ దు ప్రమేయం లేని చికిత్స అందించే హెల్త్‌కార్డు ల పథకం కింద ఉద్యోగి భార్య/భర్త, పిల్లలతో పాటు తల్లిదండ్రులు లేదా అత్తమామలకు ఉచి తంగా వైద్యం అందనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఇటీవల జరిగిన ఉద్యోగ సంఘాలు, అధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు అధికారులు ముసాయిదా మార్గదర్శకాలను రూపొందిం చారు. వీటిని వారంలోగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రికి సమర్పించే అవకాశముంది. ఆయన ఆమోదించిన తర్వాత ముసాయిదా మార్గదర్శకాలను ఉద్యోగ సంఘాల నేతలకు కూడా ఇవ్వనున్నారు. వారు సంతృప్తి చెందితే ముఖ్యమంత్రి ఆమోదానికి పంపుతారని అధికారవర్గాల సమాచారం.



మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు..

* హెల్త్ కార్డుల పథకం పరిధిలోకి రావాలంటే ఉద్యోగులు తప్పనిసరిగా తన కుటుంబం, తల్లిదండ్రులు లేదా అత్తమామల పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును సమర్పించాలి. గ్రేడుల ఆధారంగా చందా కట్టాలి.

* తల్లిదండ్రులు లేదా అత్తమామలను ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ఉద్యోగులకు ఉంటుంది.

* దంపతులు ఇద్దరూ ఉద్యోగులైతే.. ఇద్దరూ చందా చెల్లించాల్సిందే. ఇద్దరి తల్లిదండ్రులకు పథకం వర్తిస్తుంది.

* ఎంపిక చేసిన జబ్బులకు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తారు.

* ఒక్కో కుటుంబ సభ్యుడికి ఏటా గరిష్టంగా రూ. 3 లక్షల పరిమితి విధించారు. పరిమితి దాటి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే.. స్టీరింగ్ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

* ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 10 రోజుల వరకు అయ్యే వ్యయాన్ని కూడా ప్యాకేజీలో భాగంగా పరిగణిస్తారు.

* కుటుంబం అంటే ఎవరనే విషయాన్ని నిర్వచించారు. ఉద్యోగి తల్లిదండ్రులు లేదా అత్తమామలు (భార్య/భర్త తల్లిదండ్రులు), 25 సంవత్సరాల వయసు దాటని పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది. 25 సంవత్సరాల వయస్సు దాటిన వికలాంగులైన కుమారులు, తల్లిదండ్రుల మీద ఆధారపడిన కుమార్తెలకు కూడా పథకం వర్తిస్తుంది.

* పెన్షనర్లకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.  కుటుంబ పెన్షనర్ మీద ఆధాపడిన కుటుంబ సభ్యులకు ఈ పథకం వర్తించదు.

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఇతర ఆరోగ్య పథకాల సౌకర్యాలను అనుభవిస్తున్న ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు.

* అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వంలో పనిచేస్తున్న క్యాజువల్, డైలీ పెయిడ్ వర్కర్లను ఈ పథకంలో చేర్చలేదు.

* ఆరోగ్య శ్రీ ట్రస్టు ఈ పథకానికి తొలి రెండేళ్లు అమలు ఏజెన్సీగా, సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తుంది.



* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీ పథకం అమలును పర్యవేక్షిస్తుంది.ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులు, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ-సర్వీసెస్) కార్యదర్శి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, వైద్య విద్య డెరైక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, ట్రెజరీ శాఖ డెరైక్టర్, సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని సభ్య సంఘాల ప్రతినిధులతో పాటు జీఏడీ ఎంపిక చేసిన సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top