సోలార్‌ షాక్‌!

సోలార్‌ షాక్‌! - Sakshi


పవర్‌ ప్రాజెక్టులంటూ రూ.కోట్లలో టోకరా

మోసపోయిన వారిలో ప్రముఖుల సంబంధీకులు

నగరవాసి నుంచి రూ.1.33 కోట్లు స్వాహా...

అరెస్టు చేసిన సిటీ సీసీఎస్‌ పోలీసులు




సాక్షి, హైదరాబాద్‌: చదివింది ప్రతిష్టాత్మక హార్వర్డ్‌ వర్సిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌. తిరిగి వచ్చి ప్రాజెక్టులు చేపట్టి... నష్టాలు చవిచూసి... చివరకు రెండు వెబ్‌సైట్స్‌ను ఏర్పాటు చేసి సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌ పేరుతో మోసాలకు తెరలేపాడు బోజ్‌ అగస్టియన్‌. దేశ వ్యాప్తంగా వందల మందిని ముంచిన ఈ తమిళనాడు మదురై వాసి బాధితుల జాబితాలో హైదరాబాదీతో పాటు ప్రముఖులూ ఉన్నారు. అనేక రాష్ట్రాల పోలీసులకు వాంటెడ్‌గా ఉన్న ఇతడిని హైదరాబాద్‌ సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారని అదనపు సీపీ స్వాతి లక్రా మంగళవారం తెలిపారు. డీసీపీ అవినాష్‌ మహంతి, ఏసీపీ కేసీఎస్‌ రఘువీర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.



వెబ్‌సైట్లు వేదికగా ఎరవేసి...

అగస్టియన్‌ ఆరు కంపెనీలను పెట్టి... నష్టపోయాడు. దీంతో కొంత మందిని డైరెక్టర్లుగా పెట్టుకుని సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాడు. ప్రతి చోటా అడ్వాన్స్‌ తీసుకుని కొంత మెటీరియల్‌ ఖరీదు చేయడం, ఆపై అసంపూర్తిగా వదిలేసి పారిపోవడం ఇతడి పని. కొన్నేళ్ల క్రితం పూర్తిగా మోసాలబాట పట్టిన అగస్టియన్‌ బోర్గ్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ను, ఆన్‌లైన్‌లో borgenergy.com, borgsolar.com) వెబ్‌సైట్లు ఏర్పాటు చేశాడు. యూరప్‌లోని అనేక దేశాల్లో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. అమెరికాలో ఉంటున్న ఇతడి స్నేహితుడైన స్టాన్లీ గిడియోన్‌ ద్వారా అక్కడి టెక్సాస్‌ కేంద్రంగా బోర్గ్‌ ఇంక్‌ పేరుతో ఇంధన సంస్థను ఏర్పాటు చేయించాడు. తన రెండు సంస్థలు దీనికి అనుబంధం అటూ వెబ్‌సైట్స్‌లో పొందుపరిచిన అగస్టియన్‌ దీని ఆధారంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడుతున్నట్టు నమ్మించి, అనేక మందిని బుట్టలో వేసుకున్నాడు.



పట్టుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

మదురైకి చెందిన రెండు బ్యాంకులకు రూ.20 కోట్ల రుణం ఎగ్గొట్టి, రూ.30 లక్షల చెక్‌బౌన్స్‌ కేసులు సైతం ఇతడిపై ఉన్నాయి. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, తమిళ నాడు, కేరళ, ఢిల్లీల్లో ఏడు కేసులున్నాయి. ఇతడి కదలికలపై సాంకేతిక నిఘా ఉంచిన హైదరాబాద్‌ పోలీసులు చెన్నైలోని ఓ çహోటల్‌ లో బస చేసిన అతడిని అరెస్టు చేశారు. వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ.2 కోట్లు ఫ్రీజ్‌ చేశారు.



నగరవాసి నుంచి రూ.1.33 కోట్లు స్వాహా...

రాష్ట్రంలోని ఓ ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడి సోదరుడు కె.నర్సిరెడ్డి నగరంలోని బంజారాహిల్స్‌ ప్రాంతంలో సుశీ వెంచర్స్‌ను నిర్వహిస్తున్నారు. హార్వర్డ్‌లో విద్యనభ్యసించిన ఈయనకు అక్కడే అగస్టియన్‌తో పరిచయమైంది. నర్సిరెడ్డిని సంప్రదించిన అగస్టియన్‌ సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేద్దామని రూ.90 లక్షలు, ఆపై మరో రూ.43 లక్షలు వసూలు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ రవికిరణ్‌ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసింది. అగస్టియన్‌ దేశవ్యాప్తంగా ఈ తరహా మోసాలకు పాల్పడి 80 నుంచి 90 మందిని మోసం చేశాడు. ప్రతి బాధితుడు నుంచి రూ.కోటి నుంచి రూ.2 కోట్లు వసూలు చేశాడు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top