ప్రతీకారంతో ‘ఫేస్‌బుక్క’య్యారు!

ప్రతీకారంతో ‘ఫేస్‌బుక్క’య్యారు! - Sakshi


  మాజీ ఉద్యోగినికి ఫేస్‌బుక్ ద్వారా వేధింపులు

  బీపీఓ కంపెనీ నిర్వాహకుడికి అరదండాలు

  ఫొటోలకు ఫోజులిచ్చిన 14 మందీ నిందితులే

  నలుగురిని మంగళవారం అరెస్టు చేసిన వైనం


 

 సాక్షి, సిటీబ్యూరో: తన దగ్గర ఉద్యోగం చేసి మానేసిన యువతి తనపైనే ఆన్‌లైన్‌లో సెటైర్స్ వేస్తోందని పగబట్టిన ఓ వ్యక్తి..  ప్రతీకారంగా  ఫేస్‌బుక్ ద్వారానే ఆమెపై విరుచుకుపడ్డాడు... ఆ యువతికి సంబంధించి అసభ్యకరమైన వ్యాఖ్యల్ని ఫొటోలు తీసి పోస్ట్ చేశాడు... సీన్ కట్ చేస్తే సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కి జైలుకెళ్లాడు. ఇతడి ఆదేశాల మేరకు ‘ఫొటో’లకు ఫోజులిచ్చిన 14 మంది ఉద్యోగులూ నిందితుల జాబితాలోకి చేరారు. వీరిలో నలుగురు మంగళవారం అరెస్టు కాగా... మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సికింద్రాబాద్ ప్రాంతంలో సయ్యద్ అబ్దుల్ ఖదీర్ బీపీఓ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఇందులో రెండు నెలల పాటు పని చేసిన యువతిని కొన్నాళ్ల క్రితం అనివార్య కారణాలతో ఉద్యోగం నుంచి తొలగించాడు. అయితే, ఆ యువతికి చెల్లించాల్సిన జీతభత్యాలను చెల్లించకపోవడంతో అసలు కథ మొదలైంది.

 

 సరదాల పోస్టింగ్స్‌పై సెటైర్...

 


 బీపీఓ సంస్థ ఎండీ ఖదీర్‌తో పాటు బాధితురాలైన యువతికీ ఫేస్‌బుక్ పేజ్‌లున్నాయి. వాటి లో వీరిద్దరితో పాటు సంస్థలో పని చేసే ఇతర ఉద్యోగులూ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. ఖరీద్ కార్లతో తిరుగుతూ స్నేహితులతో సరదాగా గడిపిన ఫొటోలను తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేశాడు. వీటిని చూసిన మాజీ ఉద్యోగిని  తీవ్రంగా స్పం దించింది. తనకు ఇవ్వాల్సిన జీతం డబ్బుతో జల్సాలు చేస్తున్నాడని కామెంట్ పెట్టింది. పలు సందర్భాల్లో ఇలానే ఆ యువతి కామెంట్స్ పోస్టు చేయడంతో ఖదీర్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఆమెపై ఆన్‌లైన్‌లోనే ప్రతీకారం తీర్చుకోవాలని ఫేస్‌బుక్ ద్వారానే కౌంటర్ ఎటాక్ కు దిగాడు. ఇందులో తన కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్నీ పాత్రధారుల్ని చేశాడు.

 

 ఫొటోలకు ‘ఫోజులిచ్చి’ నిందితులుగా...

 

 సదరు యువతి పేరు వినియోగించిన పరుష పదజాలం, అసభ్యకర వ్యాఖ్యలతో ప్రింట్‌ఔట్లు తీయించాడు. వీటిని తన ఉద్యోగుల ద్వారా డిస్‌ప్లే చేయిస్తూ ఫొటోలు తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన బాధితురాలు ఆగస్టు 8న సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ పి.రాజు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలను సేకరించి ప్రధాన నిందితుడిగా ఉన్న బీపీఓ కంపెనీ ఎండీతో ఖదీర్‌తో పాటు అతడికి సహకరించిన అమిత్ లాల్వానీని గతనెల్లో అరెస్టు చేశారు. అసభ్యకర వ్యాఖ్యలతో కూడిన ప్రింట్ ఔట్లతో ఫొటోలకు ఫోజులిచ్చిన సంస్థ ఉద్యోగులు 14 మందినీ పోలీసులు ఈ కేసులో నిందితులుగా చేర్చారు. వీరిలో ఎకేంద్ర బిస్తా, కేవియన్ రోస్, మహ్మద్ అర్బాజ్, సాల్మన్ ఫెన్సికోలను మంగళవారం అరెస్టు చేశారు. మిగిలిన వారి పైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top