సొంతింటి కోసం ఆవులను టార్గెట్ చేశాడు!

సొంతింటి కోసం ఆవులను టార్గెట్ చేశాడు! - Sakshi


సాక్షి, హైదరాబాద్: అతని పేరు నవాబ్. స్వస్థలం హరియాణ. బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి బీఫ్ అమ్మడం ప్రారంభించాడు. అతనికి సొంతిల్లు లేదు. అందుకే ఎలాగైనా సరే ఓ ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నాడు. మరీ ఇల్లు కొనాలంటే మాటలా.. లక్షల డబ్బు కావాలి. అందుకు సులభమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. అమాయకులైన రైతుల ఇళ్లను దోచి తన ఇంటికి ఇటుకలు పేర్చేందుకు పథకం వేశాడు.  తన నాయకత్వంలో మరికొందరిని కలుపుకొని మూడు గ్యాంగ్‌లను ఏర్పాటు చేసుకొని రంగంలోకి దిగాడు.



మిగతా దొంగల్లా నగలు, డబ్బు దోచుకోవడం కాకుండా పశుగణంపై మాత్రమే దృష్టి పెట్టాడు.  అలా దొంగలించిన ఆవులు, ఎద్దులు, దూడలు, బర్రెలను కబేళాలకు, ఎగుమతుల కంపెనీలకు విక్రయించేవాడు. ఇలా వచ్చిన డబ్బుతో దాదాపు సొంతిల్లు కొనేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయమై మధ్యవర్తికి రూ. 5 లక్షలు కూడా ఇచ్చాడు. దొంగతనం చేసిన పశుగణాన్ని తరలించేందుకు వీలుగా ఓ వాహనాన్ని కొనుగోలు చేసేందుకు తన గ్యాంగ్ సభ్యులకు రూ.7.45 లక్షలు ఇచ్చాడు.



అయితే, చివరిక్షణంలో నవాబ్ పథకం తలకిందులైంది. ఇంకా డబ్బు సంపాదించే వేటలో మరిన్ని పశువులను దొంగిలిస్తూ అతను పోలీసులకు దొరికిపోయాడు. పోలీసుల విచారణలో నవాబ్ గ్యాంగ్ గతంలో చేసిన దొంగతనాల చిట్టా విప్పడంతో మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల పోలీసులు కూడా వీరిపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వీరికి కింది కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. వీరు దాఖలు చేసిన ఆరు పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీ రామిరెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు నేరాలకు పాల్పడటాన్ని అలవాటుగా చేసుకున్నారని, అందువల్ల వారికి ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తే తిరిగి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని కోర్టుకు నివేదించారు. నవాబ్, అతని గ్యాంగ్ సభ్యులపై వివిధ పోలీస్‌స్టేషన్‌లలో 17కు పైగా కేసులున్నాయని తెలిపారు.



గ్రామాల్లోకి వెళ్లి పేద రైతులను లక్ష్యంగా చేసుకుని పశువులకు రక్షణ లేని సమయంలో, మేతకు విడిచిపెట్టిన సమయంలో దొంగతనాలకు పాల్పడే వారని ఆయన వివరించారు. గ్రామాల్లో రైతులకు పశు గణమే జీవనాధరమని, దొంగతనాల ద్వారా నవాబ్, అతని ముఠా సభ్యులు రైతులకు జీవనాధారం లేకుండా చేశారని తెలిపారు. దొంగిలించిన పశువులను వేల రూపాయలకు కబేళాలకు విక్రయించడమే కాకుండా, ఆ మాంసాన్ని తిరిగి తన దుకాణంలోనే విక్రయించే వాడని ఆయన కోర్టుకు నివేదించారు. మొత్తం 187 ఆవులు, ఎద్దులు, దూడలు, గేదెలను దొంగిలించి అతడు అమ్మేశాడని తెలిపారు. ఏపీపీ రామిరెడ్డి వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి, నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top