మధ్యాహ్న భోజనంలో పురుగులు..


విద్యార్థుల ఆందోళన



నాగోలు: హైదరాబాద్ నగరం కొత్తపేట ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు విద్యార్థులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. అనేక రోజుల నుంచి ముక్కిపోయిన బియ్యాన్ని వండడంతో విద్యార్థులు తినలేని పరిస్థితి ఏర్పడింది. కొత్తపేట ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో స్థానికంగా ఉండే మహిళా సమాఖ్య వారే ప్రతిరోజు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండుతున్నారు. పౌరసరఫరాల నుంచి వచ్చే బియ్యం ముక్కిపోవడంతో అందులో పురుగులు తొట్టెలు కట్టి ఉన్నాయి. వంట వండే వారు బియ్యాన్ని సరిగా శుభ్రపరచకుండా అలాగే వండటంతో విద్యార్థులు తినలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని అనేకమార్లు వారికి చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



స్థానికంగా ఉండే విద్యార్థులు ఇళ్లకు వెళ్లి భోజనం చేస్తున్నారు. మిగతా వారు గత్యంతరం లేక పురుగుల బియ్యంతో వండిన ఆహారాన్ని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరిగా లేకపోవడంతో విద్యార్థులు రోజు రోజుకు తినేవారి సంఖ్య తగ్గిపోతోంది. దీంతో బియ్యం నిల్వ ఉండి పురుగులు పడుతున్నాయి. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కానీ, సివిల్ సప్లై అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా విద్యాశాఖ, సివిల్ సప్లై అధికారులు కల్పించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని విద్యార్థులు కోరుతున్నారు.



మధ్యాహ్న భోజనం వండే మహిళా గ్రూపుల నిర్లక్ష్యం వల్లే నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని, నీళ్ల చారు, సరిగా లేని కూరగాయలు వండి పెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు సన్నబియ్యం అందజేస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పురుగుల బియ్యాన్ని సరఫరా చేయడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పురుగుల అన్నం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురైతేనే అధికారులు పట్టించుకుంటారా? అని విద్యార్థులు ప్రశ్నించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top