‘రూట్‌’ క్లియర్‌!

‘రూట్‌’ క్లియర్‌! - Sakshi


బాలానగర్‌–కూకట్‌పల్లి మధ్య ఫ్లై ఓవర్‌

నర్సాపూర్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌

రూ.104.53 కోట్ల వ్యయంతో హెచ్‌ఎండీఏ పనులు

సోమవారం శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్‌  

రెండేళ్లలో వంతెన అందుబాటులోకి..




బాలానగర్‌–నర్సాపూర్‌ ఎక్స్‌ రోడ్డులో ప్రయాణించేవారికి తీపి కబురు.. త్వరలో ఈ మార్గంలో ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. బాలానగర్‌లోని శోభన థియేటర్‌ నుంచి ఐడీపీఎల్‌ వరకు రూ.104.53 కోట్ల అంచనా వ్యయంతో 1.09 కిలోమీటర్ల పొడవున ఆరు లేన్ల ఫ్లై ఓవర్‌ నిర్మించనున్నారు. ఇప్పటికే హెచ్‌ఎండీఏ భూసేకరణ చేపట్టింది. సోమవారం వంతెన పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు.



సిటీబ్యూరో: బాలానగర్‌ నర్సాపూర్‌ ఎక్స్‌ రోడ్డులో ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. కూకట్‌పల్లి వై–జంక్షన్, ఫతేనగర్, బోయిన్‌పల్లి నుంచి వచ్చే ట్రాఫిక్‌కు తోడు.. జీడిమెట్ల నుంచి విపరీతమైన వాహనాలు వస్తుండటంతో బాలానగర్‌ నర్సాపూర్‌ ఎక్స్‌రోడ్డు జంక్షన్‌పై ట్రాఫిక్‌ ఒత్తిడి పెరుగుతోంది. దీన్ని తగ్గించేందుకు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆ ప్రాంతంలో తలపెట్టిన ఫ్‌లైఓవర్‌ పనులు పట్టాలెక్కనున్నాయి. సోమవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఫ్‌లైఓవర్‌ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో బాలానగర్‌లోని శోభన థియేటర్‌ నుంచి ఐడీపీఎల్‌ వరకు 1.09 కిలోమీటర్ల పొడవున ఆరు లేన్ల ఫ్‌లైఓవర్‌ నిర్మాణ పనుల కోసం జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి భూసేకరణ చేపట్టారు. ఈ ఫ్‌లైఓవర్‌ కోసం ఎనిమిది ఎకరాల 20 గుంటలు (33,175 చదరపు మీటర్ల) స్థలంలో 59 ఆస్తులకు నష్టం వాటిల్లనుంది. ఫ్‌లైఓవర్‌ నిర్మాణానికి రూ.104.53 కోట్లవుతుండగా, భూసేకరణ అవసమైన రూ.265 కోట్లను హెచ్‌ఎండీఏ చెల్లిస్తోంది. ఈ ఫ్‌లైఓవర్‌ నిర్మాణ టెండర్‌ను బీఎస్‌సీపీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ దక్కించుకుంది. 24 నెలల్లో ఫ్‌లైఓవర్‌ నిర్మాణ పనులను పూర్తి చేయాలని భావిస్తోంది.  



రెండేళ్ల నుంచి పెరిగిన ట్రాఫిక్‌ ఒత్తిడి..

కూకట్‌పల్లి వై–జంక్షన్‌ నేషనల్‌ హైవే–9 నుంచి బోయిన్‌పల్లి వరకు వాహనాల రాకపోకలు ఎక్కువ కావడం వల్ల బాలానగర్‌ నర్సాపూర్‌ రోడ్డుపై విపరీతమైన ట్రాఫిక్‌ ఒత్తిడి పడుతోంది. రోజురోజుకు ఈ సమస్య మరింత పెరుగుతోంది. ముంబయి వయా హైదరాబాద్‌ మీదుగా విజయవాడ మధ్య తిరిగే వాహనాలు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో సమస్య మరింత అధికంగా ఉంటోంది. చిన్నపాటి వర్షం కురిసినా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. దీనికితోడు జీడిమెట్ల, చింతల్‌ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో ఎంతో మంది ఉద్యోగులు, కార్మికులు ఈ చౌరస్తా మీదుగా వెళ్లాల్సి వస్తుండటంతో ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారాయి.



నేషనల్‌ హైవే–9 మీద పడుతున్న ట్రాఫిక్‌ ఒత్తిడిని తగ్గించడంతో పాటు భవిష్యత్‌లో మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తుండటంతో కూకట్‌పల్లి వై–జంక్షన్‌ వద్ద దిగిన ప్రజలు బాలానగర్‌ వైపుగా వస్తే నర్సాపూర్‌ రోడ్డు చౌరస్తాపై మరింత ఒత్తిడి పడుతుంది. ఇందులో భాగంగానే హెచ్‌ఎండీఏకు చెందిన ‘కాంప్రహెన్సివ్‌ ట్రాన్స్‌పోర్టు స్టడీ’ విభాగం అధ్యయనం చేసి ఈ మార్గంలో ఆరు లేన్ల ఫ్‌లైఓవర్‌ నిర్మించాలని చాలారోజుల క్రితమే ప్రతిపాదించింది. ఎట్టకేలకు ప్రభుత్వం అనుమతించడంతో పనులకు మోక్షం లభించినట్లయింది.  

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top