వాటాల లొల్లి తూటాల దాకా..

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉదయ్‌కుమార్. (ఇన్‌సెట్లో)ఆత్మహత్య చేసుకున్న శశికుమార్ - Sakshi


డాక్టర్‌పైకి మరో డాక్టర్ కాల్పులు... ఆర్థిక లావాదేవీలే గొడవకు కారణం

చర్చించుకుందామని హోటల్‌కు వచ్చి..

ఆ తర్వాత కారులో బయల్దేరి..

ఆగి ఉన్న కారులో ఉన్నట్టుండి కాల్పులు జరిపిన వైద్యుడు

గాయపడ్డ డాక్టర్ పరిస్థితి విషమం..

కాల్పులు జరిపిన డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య


 

హైదరాబాద్: ఆ ముగ్గురూ డాక్టర్లు.. స్నేహితులు కూడా.. అంతా కలసి రూ.15 కోట్లతో ఓ ఆసుపత్రి పెట్టారు.. ఒకరు హాస్పిటల్ సీఈవో, ఇంకొకరు ఎండీ, మరొకరు డెరైక్టర్..! కొన్నాళ్లపాటు బాగానే ఉన్న వీరి మధ్య ఇటీవలే గొడవలొచ్చాయి. మాటలు కాస్త వాటాల వద్దకు చేరాయి. చర్చించుకునేందుకు అంతా ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడ మాటామాటా పెరగడం.. అందరూ చూస్తుండడంతో అక్కడ్నుంచి కారులో బయల్దేరారు.

 

 కారులో వాగ్యుద్ధం తీవ్రమైంది. ఇంతలో ఓ డాక్టర్ తన రివాల్వర్ తీసి డ్రైవర్ సీటులో ఉన్న మరో డాక్టర్‌పైకి కాల్పులు జరిపాడు! ఓ బుల్లెట్ ఆయన తలలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో  ఈ ఘటన చోటుచేసుకుంది.  హైదరాబాద్‌లోని కొండాపూర్‌కు చెందిన డాక్టర్ ఉదయ్‌కుమార్, చైతన్యపురి వాసి డాక్టర్ శశికుమార్, మాదాపూర్‌కు చెందిన డాక్టర్ సాయికుమార్‌లు ముగ్గురు స్నేహితులు. వీరు ఇటీవల దాదాపు రూ.15 కోట్ల వ్యయంతో మాదాపూర్‌లో లారెల్ హాస్పిటల్స్ ప్రారంభించారు.



ఈ ఆస్పత్రికి ఎండీగా ఉదయ్‌కుమార్, డెరైక్టర్‌గా శశికుమార్, సీఈవోగా సాయికుమార్ ఉన్నారు. శశికుమార్ సర్జన్‌గా విధులు నిర్వర్తిస్తున్నా.. ఉదయ్‌కుమార్, సాయికుమార్ ఆస్పత్రికి ఈ మధ్య ఇతర సర్జన్లను పిలిపించి ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇది శశికుమార్‌కు రుచించలేదు. ఆసుపత్రిలో తన పాత్రను తగ్గిస్తున్నారని భావించి శశికుమార్.. పెట్టుబడిలో తన వాటా రూ.75 లక్షలు తిరిగి ఇచ్చేయాలని కోరాడు. దీనిపై మాట్లాడుకునేందుకు సోమవారం వారం  హిమాయత్‌నగర్‌లోని బ్లూ ఫాక్స్ హోటల్‌కు వచ్చారు.

 

 అక్కడ గొడవ పెద్దది కావడంతో బయటకు వచ్చారు. ఉదయ్‌కి చెందిన ఏపీ10ఏటీ6764 వోక్స్ వ్యాగన్ కారులో హిమాయత్‌నగర్ వీధి నెంబర్ 6లోకి వెళ్లారు. డ్రైవర్ సీట్లో ఉదయ్‌కుమార్, పక్క సీట్లో సాయికుమార్, వెనుక సీట్లో శశికుమార్ కూర్చుకున్నారు. కొంతదూరం మాట్లాడుకుం టూ వచ్చి ఓ అపార్ట్‌మెంట్ వద్దకు రాగానే కారు ఆపారు. అప్పటికే వారి మధ్య ఆర్థిక లావాదేవీలపై తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. ఇంతలో శశికుమార్ తనతో తెచ్చుకున్న లెసైన్స్డ్ రివాల్వర్‌తో ఉదయ్‌పై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఉదయ్ అక్కడే రక్తపు మడుగులో పడిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో సాయికుమార్ కారు దిగి పరుగులు తీశాడు. ఆ వెంటనే శశికుమార్ కూడా పారిపోయాడు. గాయపడిన ఉదయ్‌కుమార్‌ను స్థానికులు ఆటోలో హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. సాయికుమార్ పోలీసుల అదుపులోనే ఉన్నారు.

 

శశికుమార్ ఆత్మహత్య


ఉదయ్ పై కాల్పులు జరిపిన శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. నక్కపల్లి ఫాంహౌస్లో రివాల్వర్ తో కాల్చుకుని డా. శశికుమార్ సూసైడ్ చేసుకున్నాడు. శశికుమార్ స్వస్థలం వరంగల్‌లోని నక్కలగుట్ట. చైతన్యపురిలో సాయి నిఖిత ఆసుపత్రిని కూడా నిర్వహిస్తున్నాడు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top