కార్పొరేట్ తొత్తులుగా సర్కార్లు

కార్పొరేట్ తొత్తులుగా సర్కార్లు - Sakshi


ధ్వజమెత్తిన వామపక్షాలు

- ‘బషీర్‌బాగ్’ విద్యుత్ అమరులకు నివాళులు

 

 సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాల అణచివేతకు పూనుకుంటున్నాయని పలువురు వామపక్ష నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని స్తూపం వద్ద విద్యుత్ అమరవీరులకు 10 వామపక్ష పార్టీల నేతలు నివాళులర్పించారు. విద్యుత్ ఉద్యమంలో విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ అసువులుబాసి 15 సంవత్సరాలు పూర్తై సందర్భంగా వామపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా స్తూపం వద్దకు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. విద్యుత్ అమరవీరుల పోరాటస్ఫూర్తిని కొనసాగిస్తామంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో ‘ప్రజా ఉద్యమాలు- ప్రభుత్వాల అణచివేత’ అంశంపై నిర్వహించిన సదస్సులో సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడారు.



ప్రపంచ బ్యాంకు ప్రయోజనాల కోసం 2000 ఆగస్టులో చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిందని, అందుకు నిరసనగా వామపక్ష పార్టీలు చేసిన ఉద్యమంపై బాబు దమనకాండ కు పాల్పడ్డారని గుర్తు చేశారు. ఉద్యమకారులను గుర్రాలతో తొక్కించి, తుపాకులతో కాల్చి హత్యలకు కూడా పూనుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు కూడా దేశాన్ని, రాష్ట్రాన్ని కార్పొరేట్ శక్తులు తమ చేతుల్లోకి తీసుకునే విధంగా ఉన్నాయని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులు, వరల్డ్ బ్యాంక్ దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయని, నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ముందు మోకరిల్లిందని విమర్శించారు.



దేశంలో అమలవుతున్న ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ మాట్లాడుతూ మోదీ తిరంగా యాత్ర పేరుతో దేశాన్ని తిరోగమనం పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామిక ఉద్యమాలను అణచివేయాలని చూస్తే, చివరికి ఆ ఉద్యమాలే ప్రభుత్వాలకు ఉరితాళ్లు అవుతాయని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే విద్యుత్‌చార్జీలు పెంచి ప్రజలపై రూ.1600 కోట్లు భారం మోపిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలోనే చార్జీలను అధికంగా పెంచి చంద్రబాబుకు తానేమీ తీసిపోనట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.  



 రాష్ట్రంలో తీవ్రమైన నిర్బంధం: సీపీఎం

 విద్యుత్‌చార్జీల పెంపునకు నిరసనగా చేస్తున్న ఉద్యమంలో నాడు చంద్రబాబు ప్రభుత్వం ముగ్గురిని పొట్టనబెట్టుకున్నదని, అప్పటి ఉద్యమంలో కలసి వచ్చిన కేసీఆర్ నేడు అవే కార్పొరేట్‌శక్తులకు వంత పాడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. తెలంగాణలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్బంధం అమలవుతోందని, దీనికి మల్లన్నసాగర్ ఉదాహరణ అని, 144 సెక్షన్‌ను విధించి గ్రామాల చుట్టూ ముళ్లకంచెలను వేసి ప్రజలకు ఇబ్బం దులు కలగ చేశారని అన్నారు. అమరులకు నివాళులర్పించినవారిలో సీపీఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ నాయకులు రమ, గోవర్ధన్ , విజయ్‌కుమార్, ఎంసీపీఐ నేత తాండ్ర కుమార్, ఎస్‌యూసీఐ (మురారి), జానకిరాములు (ఆర్‌ఎస్పీ), సంధ్య(పీవోడబ్ల్యూ), సీపీఐ (ఎంఎల్) నాయకుడు భూతం వీరన్న తదితరులున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top