దిక్కార కేసులో కలెక్టర్ శ్రీదేవికి జరిమానా


8 వారాల్లో జమ చేయాలని హైకోర్టు ఆదేశం



 సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కార కేసులో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టి.కె.శ్రీదేవికి హైకోర్టు రూ. 1,116 జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థకు ఎనిమిది వారాల్లో జమ చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో ఏడు రోజుల సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు సోమవారం తీర్పు వెలువరించారు. మహబూబ్‌నగర్‌లోని సరస్వతి ఫెర్టిలైజర్స్‌లో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ తనిఖీలు నిర్వహించి, స్టాకులో తేడా ఉండటంతో రూ. 50 లక్షల విలువ చేసే ఎరువులను సీజ్ చేశారు.



తరువాత పూర్తిస్థాయి విచారణ జరిపి రూ. 10 లక్షల విలువ చేసే స్టాకును సీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సవాలు చేస్తూ సరస్వతి ఫెర్టిలైజర్స్ యాజమాన్యం స్టానిక కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. విచారణ జరిపిన స్థానిక కోర్టు జప్తు ఉత్తర్వులను సవరించి 20 శాతం స్టాకు జప్తునకు సమానమైన రూ. 44,302లను డిపాజిట్ చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు పిటిషనర్ ఆ మొత్తాన్ని డిపాజిట్ చేశారు. అయినప్పటికీ స్టాకును విడుదల చేయకపోవడంపై సరస్వతి యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు కింది కోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని 30 రోజుల్లో స్టాకును విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ స్టాకును విడుదల చేయకపోవడంపై సరస్వతి యాజమాన్యం జిల్లా కలెక్టర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ రామలింగేశ్వరరావు జిల్లా కలెక్టర్ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు తేల్చారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top