ముసాయిదా జిల్లాలే ఫైనల్!

ముసాయిదా జిల్లాలే ఫైనల్! - Sakshi


- 27 జిల్లాలతో దసరా రోజునే తుది నోటిఫికేషన్

- అదే రోజున ఉద్యోగులకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు

- కొత్తగా 44 మండలాలు, 4 రెవెన్యూ డివిజన్లు

- కొన్ని మండలాలు మాత్రం అటు ఇటు మార్పు

- అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష


 

సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ రోజున.. నిర్ణీత ముహూర్తంలోనే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఆవిర్భావం జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. అదే రోజున ఉదయం కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని.. ఆ వెంటనే ఉద్యోగులకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో కొత్త జిల్లాలకు ముహూర్తం, తుది నోటిఫికేషన్, బతుకమ్మ ఉత్సవాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. కొత్త జిల్లాల ముసాయిదాపై వచ్చిన అభ్యంతరాలు, ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తుల వివరాలను తెలుసుకున్నారు. ప్రజల్లో స్పందనపై వివిధ సర్వేల ద్వారా వచ్చిన నివేదికలను పరిశీలించారు. అనంతరం పలు నిర్ణయాలు తీసుకున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం... ప్రతిపాదిత జిల్లాల సంఖ్యలో మార్పేమీ ఉండదని, 27 జిల్లాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.

 

 ఒకటి రెండు రోజుల్లోనే నిర్ణయం..

 కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి ఆగస్టు 22న రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దానికి రెండ్రోజుల ముందే అఖిలపక్ష నేతలతో సమావేశం ఏర్పాటు చేసి, అభిప్రాయాలు స్వీకరించింది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ చేపడతామని.. అవసరమైతే మరో రెండుసార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ఇంతకుముందే సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఆవిర్భావానికి ముందు మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలా, వద్దా అన్న దానిపై గురువారం సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకోనున్నారు.



ఇక ముసాయిదాపై ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు 44 కొత్త మండలాలు, మూడు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. శంషాబాద్ జిల్లాలోకి మరో మూడు మండలాలను కలపాలని నిర్ణయించి.. వాటిని తుది నోటిఫికేషన్‌లో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వారంలో కేబినెట్ సమావేశం నిర్వహించి తుది నోటిఫికేషన్‌ను ఆమోదించనున్నారు. దసరా రోజున సిద్దిపేట జిల్లా ఆవిర్భావ ఉత్సవానికి హాజరవుతానని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. మరికొందరు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు.. యాదాద్రి, కొత్తగూడెం జిల్లాల ఆవిర్భావ వేడుకలకూ సీఎం హాజరయ్యే అవకాశాలున్నాయి.

 

 జిల్లాల్లో మార్పేమీ లేనట్లే


 ముసాయిదాలో ప్రతిపాదించిన 27 జిల్లాలను అలాగే తుది నోటిఫికేషన్‌లో ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఒకటీ రెండు మండలాలు అటు ఇటు మార్చాలనే డిమాండ్లు ఉండడంతో.. వాటిని సైతం పరిశీలించి ఒకట్రెండు రోజుల్లోనే తుది స్వరూపం ఖరారు చేయాలని నిర్ణయించారు. భౌగోళిక సరిహద్దులు సహా జిల్లాల తుది స్వరూపం నిర్ణయించేందుకు మరోసారి జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఇరుగు పొరుగు జిల్లాలు, వివాదాలున్న ప్రాంతాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ముఖాముఖి చర్చిస్తారు. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పలు సమస్యలున్నట్లు గుర్తించారు.

 

 హన్మకొండ జిల్లా ఏర్పాటుకే మొగ్గు

 ముసాయిదాలో ప్రతిపాదించిన హన్మకొండ జిల్లా ఏర్పాటుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ప్రస్తుతమున్న వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించడం, వరంగల్ కేంద్రంలోనే హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేయడం పట్ల స్థానికంగా తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది. ఒక దశలో హన్మకొండ బదులు వరంగల్ రూరల్ (కాకతీయ) జిల్లా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం యోచించింది. కానీ రెండు జిల్లాలు ఒకే కేంద్రంలో ఉంటే బదిలీల బాధ తప్పుతుందని ఉద్యోగ వర్గాలు మద్దతు పలకడంతో... హన్మకొండ జిల్లానే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక ప్రతిపాదిత మల్కాజ్‌గిరి జిల్లాను మేడ్చల్ జిల్లాగా మార్చనున్నారు.

 

 చెరువులన్నీ నింపండి

 రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలు, ప్రాజెక్టుల్లో నీటి మట్టాలపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాలపై ఉన్న నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలు.. శ్రీశైలంపై ఉన్న కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలో ఉన్న అన్ని చెరువులను నింపాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులకు భారీ ఇన్‌ఫ్లో ఉన్నందున వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top