తీరంలో అన్నింటా ముప్పే

తీరంలో అన్నింటా ముప్పే


* ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, తుఫాన్ల తాకిడి అధికమే

* నెల్లూరు, ఒంగోలు, మచిలీపట్నం, కాకినాడ, రాజమండ్రి, విశాఖ , శ్రీకాకుళం, విజయనగరాల్లో తుఫాను గాలుల ప్రభావం ఎక్కువ

* కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలపై తరచుగా వరదల ప్రభావం

* సముద్ర మట్టం పెరుగుదలవల్ల కృష్ణా, గోదావరి డెల్టాల్లో ఉప్పునీరు చొరబాటు

* గణాంకాలు, గ్రాఫులు, మ్యాపులతో విశ్లేషించిన శివరామకృష్ణన్ కమిటీ

* అన్ని అంశాలను పరిగణించి రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని సూచన




సాక్షి, హైదరాబాద్: తూర్పు తీర ప్రాంతంలో తరచూ సంభవించే తుఫాన్లు, భూకంపాలు తదితర విపత్తులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై నిర్ణయం తీసుకోవాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. ఇందుకోసం కమిటీ ప్రతి అంశాన్ని గణాంకాలు, అధ్యయనాలు, గ్రాఫ్‌లు, మ్యాపులతో సహా నివేదించింది. కమిటీ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలిలా ఉన్నాయి.

 

ఏతూర్పు తీర ప్రాంతంలో ప్రమాదాలు, విపత్తులు ఎక్కువగా సంభవించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, తుఫాన్ల ధాటి అధికం. గడిచిన దశాబ్దంలో రాష్ట్రంలో తుఫాన్లు సంఖ్య అధికంగానే నమోదయ్యాయి. ప్రతి రెండేళ్ళకోసారి రాష్ట్రం తుఫాను ధాటికి గురవుతూనే ఉంది. నెల్లూరు, ఒంగోలు, మచిలీపట్నం, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం పట్టణాల్లో తుఫాను గాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సముద్రం మట్టం పెరుగుదలతో ఉప్పునీరు ఆంధ్ర తీరంలోని గోదావరి, కృష్ణా డెల్టాల్లోకి చొచ్చుకొచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.

 

ఏ ఏపీలో డెల్టా, తీర ప్రాంతాల్లో వరదలు తరచు సంభవిస్తున్నాయి. కోస్తా ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు కృష్ణా, గోదావరి నదుల తీరాన కేంద్రీకృతమై ఉన్నాయి. 2009 అక్టోబరు-నవంబరులో వచ్చిన వరదలు కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 20 లక్షల మంది ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వరదల బారిన పడే నగరాల్లో విజయవాడ, గుంటూరు, నెల్లూరులు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ క్యాపిటల్ జోన్ చుట్టూ ఉన్న అంశాన్ని గమనించాలి.

 

ఏ మిగిలిన తీర ప్రాంత నగరాలతో పోలిస్తే విశాఖపట్టణానికి రక్షణ ఉంది. ఇక్కడ టోపోగ్రఫీ, కోస్టల్ లైన్ ఇందుకు కారణం. ఈ పట్టణ, నగరాలతో పోలిస్తే క్యాపిటల్ జోన్‌లో భవిష్యత్తులో పలు తుఫాన్లకు, సూపర్ సైక్లోన్స్‌కు ప్రాణ నష్టం, భవనాల డ్యామేజీ, వ్యాపార ఆటంకాలు అనేకమున్నాయి.

 

ఏ రాష్ర్టంలో సగటున వార్షిక వర్షపాతం 1000 మిల్లీమీటర్లుగా నమోదవుతోంది. రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కరువు ఛాయలు అధికం. ఇక్కడ 30 మండలాల్లో 40 శాతం కంటే అధికంగా తరచూ కరువు ఉంటుంది. 20-40 శాతం కరువు బారిన పడే 115 మండలాల్లో అధికంగా ప్రకాశం, తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాలున్నాయి.

 

వీజీటీఎంకు భూకంప ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ భూకంపాలకు సంబంధించి జోన్-2, 3 లలో ఉంది. ఇది తక్కువ ప్రభావమే చూపుతుంది. కానీ విజయవాడ పరిసరాల్లోని 150 కిలోమీటర్ల రేంజ్‌లో భూకంప ప్రమాదాలకు ఆస్కారం ఉందని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) జరిపిన సీస్మిక్ మైక్రో-జోనేషన్ అధ్యయనంలో వెల్లడైంది. ఇదంతా విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి (వీజీటీఎం) రీజన్‌లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో భూకంప ప్రమాదాలు పొంచి ఉన్నందున దాన్ని గమనంలోకి తీసుకుని నిర్ణయాలు జరగాలి.

 

1917లో విజయనగరంలో 5.5 ఎం, 1967లో ఒంగోలు ప్రాంతంలో 5.4 ఎం.గా రెండు పెద్ద భూకంపాలు నమోదయ్యాయి. కాకినాడ, నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రిలలో తక్కువ రిస్క్‌గా ఉన్నాయి. తక్కువ నాణ్యతతో బహుళ అంతస్తుల నిర్మాణం చేపడితే మాత్రం ప్రమాదం అధికంగా ఉంటుంది. అహ్మదాబాద్‌లో 2001లో భుజ్ భూకంపమే దీనికి ఉదాహరణ.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top