ప్రైవేటీకరణను ప్రతిఘటిస్తాం

ప్రైవేటీకరణను ప్రతిఘటిస్తాం - Sakshi


ఆర్టీసీని కాపాడుకుందాం.. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నిర్ణయం



విభజన తర్వాత 45 సంస్థలను ప్రైవేటీకరించే ప్రమాదముంది..

ఏపీ శాఖ అధ్యక్షునిగా గౌతమ్‌రెడ్డి బాధ్యతల స్వీకారం




సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను తీవ్రంగా ప్రతిఘటించాలని, అత్యంత ముఖ్యమైన ఆర్టీసీని ప్రైవేటుపరం కాకుండా పరిరక్షించుకుందామని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్రంలోని కార్మిక శ్రేణులకు పిలుపునిచ్చింది. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ టీయూ రాష్ట్ర స్థాయి తొలి సమావేశం జరిగింది. ఇందులో టీడీపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పలు తీర్మానాలు చేశారు. ఇదే సమావేశంలో వైఎస్సార్ టీయూ ఆంధ్రప్రదేశ్ శాఖకు తొలి అధ్యక్షునిగా నియమితులైన పూనూరు గౌతమ్‌రెడ్డి(విజయవాడ) బాధ్యతలు స్వీకరించారు.



గౌతమ్‌రెడ్డితో, సమావేశానికి హాజరైన ఇతర ప్రతిని ధులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న బి.జనక్‌ప్రసాద్‌ను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి శాలువాకప్పి సన్మానించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల నుంచి వచ్చిన టీయూ జిల్లా శాఖల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పెద్ద పరిశ్రమల కార్మికనేతలు, ఆర్టీసీ, విశాఖ ఉక్కు కర్మాగారం, మున్సిపల్ కార్మికులు, వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగుల నేతలు, బీహెచ్‌పీవీ, హిందుస్థాన్ షిప్‌యార్డు కార్మిక సంఘాల నేతలు, అంగన్‌వాడీ నేతలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల్లోకి నెట్టి ఆ తరువాత వాటిని ప్రైవేటీకరణ పేరుతో తన వాళ్లకు కట్టబెట్టడం సీఎం చంద్రబాబు నైజమని, అలాంటి చర్యలను ప్రతిఘటించాలని తీర్మానించారు.



కార్మిక వ్యతిరేక విధానాలపై పోరు: విజయసాయిరెడ్డి

వైఎస్సార్‌టీయూను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతోపాటుగా ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరముందని పార్టీ పర్యవేక్షణ కమిటీ సభ్యుడు, ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఇకపై ప్రతి 60 రోజులకోసారి టీయూ పనితీరును సమీక్షిస్తామని చెప్పారు. 2019 ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా వైఎస్సార్‌టీయూను నిర్మించాలన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ 107 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే.. ఒక్క మన రాష్ట్రంలోనే 1995 నుంచి 2004 మధ్య చంద్రబాబు పాలనలో 57 సంస్థలను ప్రైవేటుపరం చేశారని విమర్శించారు.



ప్రైవేటీకరించిన ఈ సంస్థలు, వాటికి అనుబంధంగా ఉన్న భూముల అంచనా విలువ రూ.1,59,900 కోట్ల ని ఆయన వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కీలకమైనవేనని, కార్మికుల సంక్షేమం, ప్రయోజనాల రీత్యా ఈ రెండింటినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే 35 వేలమంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపారని, విభజన తరువాత ఏపీలో ఇంకా మిగిలున్న 45 ప్రభుత్వరంగ సంస్థలనూ ఎలా ప్రైవేటుపరం చేయాలనే ఆలోచనతో ఉన్నారంటూ.. అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.



పారిశ్రామికాభివృద్ధికి కృషి: జనక్‌ప్రసాద్

కార్మికుల ప్రయోజనాలను కాపాడుకుంటూనే పారిశ్రామికాభివృద్ధికి వైఎస్సార్‌టీయూ కృషి చేయాల్సి ఉంటుందని జనక్‌ప్రసాద్ అన్నారు. దివంగత వైఎస్ కార్మిక పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారని, ఆయన ఏ రోజూ కార్మికులకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకోలేదన్నారు. కానీ చంద్రబాబు తన హయాంలో ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మారని విమర్శించారు.



వంద శాఖలు లక్ష్యం: గౌతమ్‌రెడ్డి

పార్టీ ట్రేడ్ యూనియన్‌కు అనుబంధంగా వంద శాఖల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుంటున్నామని గౌతమ్‌రెడ్డి వివరించారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు 39 వాగ్దానాలు చేశారని, వాటి అమలుకోసం టీయూ తరఫున పోరాడతామన్నారు. ఎక్కడైతే కార్మిక సమస్యలుంటాయో అక్కడ వైఎస్సార్‌టీయూ జెండా ఉంటుందన్నారు. కాంట్రాక్టు కార్మికులందర్నీ పర్మినెంట్ చేయాలని, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మహిళా కార్మికులకు రక్షణ కల్పించాలని, బాలకార్మికుల వ్యవస్థను కర్మాగారాల్లో నిర్మూలించాలని, అసంఘటిత రంగంలోని కార్మికులకూ బీమా సౌకర్యం కల్పించాలని, సమానపనికి సమాన వేతనం చెల్లించాలని కోరుతూ సమావేశం తీర్మానాలు చేసింది. సమావేశ నిర్ణయాలను జనక్‌ప్రసాద్, విజయసాయిరెడ్డి, గౌతమ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. పార్టీ ప్రధానకార్యదర్శి పీఎన్వీ ప్రసాద్, కార్మిక నేతలు వి.రాజదుర్గాప్రసాద్, టి.శివశంకర్‌రెడ్డి, రాజారెడ్డి, మనోరంజని, వి.రవి సమావేశంలో పాల్గొన్నారు.

 

విషప్రచారాన్ని తిప్పికొట్టాలి: సజ్జల

వైఎస్సార్‌సీపీపై ప్రత్యర్థులు చేసే విషప్రచారాన్ని తిప్పికొట్టడంలో ట్రేడ్‌యూనియన్ ముఖ్యపాత్ర పోషించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. కార్మికోద్యమం బలపడితే పార్టీకి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పార్టీ ఆవిర్భవించాక ఇప్పటికి 174 చోట్ల యూనియన్లను ఏర్పాటు చేయగలిగామని, ఇదంతా జనక్‌ప్రసాద్ కృషేనని ప్రశంసించారు. అన్నిరంగాల్లో మాదిరిగానే కార్మికుల్లోనూ దివంగత వైఎస్ అభిమానులు పెద్దసంఖ్యలో ఉన్నారని, వారందర్నీ సంఘటితం చేయాలని సూచించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top