‘చాలెంజ్’.. ఇది దోపిడే

‘చాలెంజ్’.. ఇది దోపిడే - Sakshi


‘స్విస్ చాలెంజ్’ ముసుగులో భారీ కుంభకోణం

రైతుల భూములతో రియల్ వ్యాపారం...

సింగపూర్ కంపెనీలతో కలసి రూ.వేల కోట్లు కొట్టేసే వ్యూహం

అంతా రహస్యం... పారదర్శకత మృగ్యం

ప్రభుత్వ వాటా తగ్గించడమే పెద్ద స్కామ్

సింగపూర్ కన్సార్టియంకు 58శాతం వాటా

రూ. 306 కోట్ల పెట్టుబడికి.. రూ.27,461.84 కోట్ల లాభం

సర్కారు వాటా 42 శాతానికి పరిమితం

రూ.5,721.9 కోట్లు ఖర్చు చేస్తే వచ్చేది రూ.19,886.16 కోట్లే..

అసెంబ్లీ, సచివాలయం లాంటివీ కట్టరు


 

రాజధాని ప్రకటనకు ముందే లక్ష కోట్లు కొట్టేశారు... అందుకు ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ను ప్రయోగించారు.

ఇపుడు మరో లక్ష కోట్లు కొట్టేయబోతున్నారు. ఇందుకు‘స్విస్ ఛాలెంజ్’ను ప్రయోగిస్తున్నారు.


 

సాక్షి, హైదరాబాద్: రాజధాని ఎక్కడ వస్తుందో ప్రకటించడానికి ముందు పేద రైతుల భూములు కొట్టేసి లక్ష కోట్ల మేర లబ్దిపొందిన సర్కారు పెద్దలు ఇపుడు ‘స్విస్ చాలెంజ్’ ముసుగులో మరో ఘరానా దోపిడీకి స్కెచ్ వేశారు. రైతుల నుంచి సమీకరించిన భూములను స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కన్సార్టియంకు కట్టబెట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసి మరో లక్ష కోట్లు కొట్టేసే పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రధాన రాజధాని కేంద్రం(సీడ్ కేపిటల్)లో అత్యంత విలువైన 1,691 ఎకరాల్లో చేపట్టిన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును కట్టబెట్టడానికి సింగపూర్ సంస్థల కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన అవగాహనలోని మతలబులన్నీ ఇప్పటికే బట్టబయలయ్యాయి.



స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత లేనే లేదని సుప్రీం కోర్టు ఎప్పుడో తెగేసిచెప్పింది.. ఎలాంటి పరిస్థితుల్లోనూ స్విస్ చాలెంజ్ విధానాన్ని ప్రోత్సహించవద్దని గతంలోనే కేల్కర్ కమిటీ ప్రతిపాదించింది. మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు.. ఆర్థిక నిపుణులు వారించినా ముఖ్యమంత్రి చంద్రబాబు స్విస్ చాలెంజ్ విధానంలోనే రాజధాని మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించారు. సింగపూర్ సంస్థలతో కలిసి దోచుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న ప్రయత్నాలన్నిటినీ ‘సాక్షి’ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంది. తాజాగా స్విస్ చాలెంజ్‌పై ప్రభుత్వ వ్యవహారశైలిని ఉమ్మడి హైకోర్టూ తప్పుబట్టింది. అయినా ఈ విధానంపై రాష్ర్ట ప్రభుత్వం ముందుకు పోవడం వెనుక లక్ష కోట్ల దోపిడీ ప్రణాళిక దాగి ఉంది. ఇలా...

 

పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే...

పైసా పెట్టుబడి లేకుండా రైతుల భూములతో రాష్ర్టప్రభుత్వం చేస్తున్న పక్కా రియల్‌ఎస్టేట్ వ్యాపారం ఇది. ప్రధాన రాజధాని కేంద్రంలో చేపట్టే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియంకు కట్టబెట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేలాది కోట్లు కొట్టేయడానికి స్కెచ్ వేశారు. పేరుకు ప్రధాన రాజధాని కేంద్రమైనా అక్కడ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరు. అసెంబ్లీ, సచివాలయం వంటి ముఖ్యమైన నిర్మాణాలేవీ అక్కడ ఉండవు. కేవలం భూమిని అభివృద్ధి చేస్తారంతే. 1,691 ఎకరాల భూమిని చదును చేసి మౌలికసదుపాయాలన్నీ కల్పించి ప్లాట్లు వేసి అమ్మేస్తారు. వాటిని సింగపూర్ కంపెనీలు పాతికేళ్లలో ఎప్పుడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించారు.



కోర్ కేపిటల్ ప్రాంతం అభివృద్ధి చేస్తే ఆ చుట్టుపక్కల ప్రభుత్వ పెద్దల బినామీల భూములకు మంచి ధర వస్తుంది. వందల ఎకరాలను కైంకర్యం చేసిన సర్కారు పెద్దలు భారీగా లబ్ధిపొందనున్నారు... అదీ ప్లాన్. దీనిని అమలు చేయడానికి భారీ ప్రణాళికే సిద్ధం చేశారు. సింగపూర్ సర్కార్‌తో తనకు ఉన్న సంబంధాల వల్ల.. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ఉచితంగా తయారు చేసి ఇవ్వడానికి ఆ దేశం అంగీకరించిందని సీఎం  చెప్పుకొచ్చారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ను రూపొందించడానికి సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐఈ(ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజస్)తో ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ)కి డిసెంబర్ 8, 2014న ఒప్పందం కుదిరింది.



ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను ప్రైవేటు సంస్థలు సుర్బానా ఇంటర్నేషనల్, జురాంగ్ ఇంటర్నేషనల్ సంస్థలకు సింగపూర్ సర్కార్ కట్టబెట్టింది. రాజధానికి భూసమీకరణ పేరుతో రైతుల నోళ్లు కొట్టి భూములు లాక్కున్న తరహాలోనే.. స్వప్రయోజనాల కోసం రాజధాని నిర్మాణ పనులను సింగపూర్ సంస్థలకు కట్టబెట్టడానికి వ్యూహాత్మకంగా సీఎం చంద్రబాబు ‘స్విస్ చాలెంజ్’  విధానాన్ని తెరపైకి తెచ్చారు. మార్చి 30, 2015న రాజధాని ప్రాంత(కేపిటల్ రీజియన్) మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ సంస్థలు అందించిన సమయంలోనే మాస్టర్ డెవలపర్‌ను స్విస్ చాలెంజ్ విధానంలో ఎంపిక చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ వెంటనే సింగపూర్ మంత్రి ఈశ్వరన్ స్పందిస్తూ.. మాస్టర్ డెవలపర్ కోసం సింగపూర్ సంస్థలు పోటీ పడతాయని చెప్పారు. ముందసు ఒప్పందం మేరకు సింగపూర్ ప్రైవేటు సంస్థలు అసెండాస్, సిన్‌బ్రిడ్జి, సెమ్బ్‌కార్ప్ సంస్థలు విలీనమై కన్సార్టియంగా ఏర్పడ్డాయి.

 

లక్షకోట్లు దాటిపోయే దోపిడీ ప్రణాళిక ఇదీ...

స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అమలుకు సింగపూర్ సంస్థల కన్సార్టియం, ప్రభుత్వానికి చెందిన కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్(సీసీడీఎంసీఎల్) కలిసి అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్(ఏడీపీ)ని ఏర్పాటు చేస్తాయి. ఇందులో సీసీడీఎంసీఎల్ వాటా 50 శాతం, తమ వాటా 50 శాతం ఉండేలా అక్టోబరు 30, 2015న సింగపూర్ సంస్థల కన్సార్టియం తొలుత ప్రతిపాదించింది.

కానీ సింగపూర్ కంపెనీల్లో  బినామీ సంస్థలుండటంతో సింగపూర్ కంపెనీల వాటాను 58 శాతానికి పెంచాలని,  ఏడీపీలో సీసీడీఎంసీఎల్ వాటా 42 శాతానికి తగ్గంచాలని స్వయంగా సీఎం సింగపూర్‌లో ఈ ఏడాది జనవరి 24, 25 తేదీల్లో చర్చల్లో సూచించారు. ఎవరైనా ప్రభుత్వ వాటా పెంచమంటారు గానీ  తగ్గించమనడం గమనార్హం.

ఇంతకూ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి ఏడీపీలో సింగపూర్ సంస్థలు పెట్టే పెట్టుబడి ఎంతో తెలుసా? కేవలం రూ.306.4 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం సీసీడీఎంసీఎల్ తరఫున రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఇదీ గాక మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తుంది. పైగా సింగపూర్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే రెవెన్యూ వాటా మాత్రం చెప్పకుండా సీల్డ్ కవర్‌లో గోప్యంగా ఉంచాలని సింగపూర్ సంస్థలు కోరగా అందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు.

ఏడీపీలో రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం.. రూ.5,721.9 కోట్లు పెట్టుబడి పెట్టే సీసీడీఎంఎల్ వాటా 42 శాతమే. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. సింగపూర్ కంపెనీలకు ఎంత మేలు చేయబోతున్నారో.

రైతుల నుంచి రకరకాల మార్గాలలో సమీకరించిన భూమిలో 1,691 ఎకరాలు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు ఇస్తున్నారు. విజయవాడ బందరు రోడ్డులో గజం భూమి విలువ రూ.రెండు లక్షలకుపైగానే పలుకుతోంది. రాజధానిలో అత్యంత కీలకమైన సీడ్ కేపిటల్‌లో గజం విలువ హీనపక్షం రూ.లక్ష పలుకుతుందని స్వయంగా  చంద్రబాబే చెబుతున్నారు.

ఈ లెక్కన ఎకరా భూమిలో రహదారులు, పార్కులకు కొంత పోయి.. మిగిలే 2,800 గజాల స్థలం విలువ రూ.28 కోట్లు పలుకుతుంది. అంటే.. 1,691 ఎకరాల విలువ రూ.47,348 కోట్లు. ఇందులో సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం. అంటే.. ఆ సంస్థలకు రూ.27,461.84 కోట్లు దక్కుతాయి. రాష్ట్ర ప్రభుత్వానిది 42 శాతమే కాబట్టి దక్కే సొమ్ము రూ.19,886.16 కోట్లే.

అంతే కాదు.. ఈ భూమిని పాతికేళ్లలో ఎప్పుడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. అంటే.. పదేళ్ల తర్వాత గజం నాలుగు లక్షలు ఉంటే సింగపూర్ కంపెనీలకు వచ్చే లాభం రూ.లక్ష కోట్లను దాటిపోతుంది. ఇదంతా చూస్తోంటే.. మన భూమి ఇచ్చి మనం ఎక్కువ ఖర్చు పెట్టి సింగపూర్ కంపెనీలకు అత్యధికంగా లాభాలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సింగపూర్ కంపెనీల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఆ తర్వాత ఆ కంపెనీల నుంచి కమీషన్లు పొందేందుకు ప్లాన్ వేసినట్లు అర్ధమౌతోంది.

 

అంతా గోప్యం..  సుప్రీం మార్గదర్శకాలు బేఖాతర్

రాజధాని మాస్టర్ డెవలపర్ ఎంపికలో స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసే క్రమంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ప్రభుత్వం తుంగలో తొక్కింది. మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్‌లో గృహాల నిర్మాణానికి డెవలపర్(కాంట్రాక్టర్) ఎంపిక కేసును విచారించిన సుప్రీం కోర్టు మే 11, 2009న తీర్పు ఇచ్చింది. ఆ క్రమంలో స్విస్ చాలెంజ్ విధానం అమలుకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని నిక్చచ్చిగా అమలు చేయాలంటూ అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేష్ జారీ చేసిన ఉత్తర్వులను సీఎం చంద్రబాబు బుట్టదాఖలు చేయడం గమనార్హం.

 

మార్గదర్శకం 1: స్విస్ చాలెంజ్ విధానం కింద ఏ తరహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టాలన్నది ప్రభుత్వం తొలుత గుర్తించి, వాటిపై బహిరంగ ప్రకటన చేయాలి.

 ఉల్లంఘన: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టే ప్రాజెక్టుల వివరాలను బహిర్గతం చేయలేదు.

 

మార్గదర్శకం 2: ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మాస్టర్ డెవలపర్ ఎంపికకు ప్రభుత్వం ప్రతిపాదనలు ఆహ్వానించవచ్చు. లేదా ఎవరైనా స్వచ్ఛందంగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించవచ్చు. మాస్టర్ డెవలపర్ ఎంపికలో సంస్థలతోగానీ.. కాంట్రాక్టర్లతోగానీ ఎలాంటి ముందస్తు సంప్రదింపులు చేయకూడదు.

ఉల్లంఘన: సింగపూర్ సంస్థల కన్సార్టియంతో ముందస్తు సంప్రదింపుల కోసం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈలోగా జూలై 7న సీఎం చంద్రబాబు నేరుగా సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో చర్చలు జరిపారు. దీన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ నేతృత్వంలోని మౌలిక వసతుల కల్పన అథారిటీ నిరసించింది.

 

మార్గదర్శకం 3: ఒరిజినల్ ప్రాజెక్టు ప్రపోజర్(ఓపీపీ) చేసిన ప్రతిపాదనలపై ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయాలి. ఈ వ్యవహారంలో ఎలాంటి గోప్యత ఉండకూడదు.

ఉల్లంఘన: స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తామన్నది సింగపూర్ సంస్థలు బహిర్గతం చేయలేదు. వాటిని సీల్డ్ కవర్‌లో ఉంచినట్లు టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇది కౌంటర్ ప్రతిపాదనలు చేసే సంస్థలకు ప్రతికూలం.

 

మార్గదర్శకం 4: ఓపీపీ కన్నా మెరుగైన ప్రతిపాదనలతో తక్కువ ధరకు ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశాలను అన్వేషించాలి. కౌంటర్ ప్రతిపాదనల దాఖలుకు కనీసం 60 రోజుల సమయం ఇవ్వాలి.

ఉల్లంఘన..: కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు.

 

మార్గదర్శకం 5: ఓపీపీతోపాటు కౌంటర్ దాఖలు చేసే సంస్థలకూ సమాన అవకాశాలు కల్పించే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి.

ఉల్లంఘన: కేవలం విదేశాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టిన సంస్థలకే కౌంటర్ ప్రతిపాదనలు దాఖలు చేసే అర్హత కల్పించారు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం ఏడాదికి కనిష్టంగా రూ.150 కోట్ల నుంచి గరిష్టంగా రూ.300 కోట్లు ఖర్చు చేస్తారు. టెండర్‌లో షెడ్యూలు దాఖలుకు ఏడాదికి కనీసం రూ.రెండు వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలకే అవకాశం కల్పించేలా నిబంధన పెట్టారు. వీటిని పరిశీలిస్తే సింగపూర్ కన్సార్టియంకు లబ్ధి చేకూర్చడానికే సుప్రీం మార్గదర్శకాలను అడ్డగోలుగా ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది.

 

ప్రభుత్వ వాటా తగ్గించారు... ఏపీఐడీఈ-2001 చట్టం తుంగలో తొక్కారు

ఉమ్మడి రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబ్లింగ్ (ఏపీఐడీఈ)-2001 చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ చట్టాన్ని సింగపూర్ సంస్థల కోసం తానే సవరించారు. రాష్ట్రంలో ఏ సంస్థకైనా గరిష్టంగా 33 ఏళ్లకు భూములు లీజుకివ్వాలని ఏపీఐడీఈ చట్టంలోని నిబంధనను.. 99 ఏళ్లకు లీజు లేదా భూమిపై పూర్తి హక్కులు కల్పించేలా మార్పులు చేశారు. ఇక ఆ చట్టాన్ని అడ్డగోలుగా ఉల్లంఘించారు.

 

నిబంధన 1: ఏ ప్రాజెక్టులోనైనా ప్రభుత్వానికి కనిష్టంగా 51 శాతం వాటా ఉండాలి.

ఉల్లంఘన: సింగపూర్ సంస్థల కన్సార్టియం స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 50 శాతం.. తనకు 50 శాతం వాటా ఉండేలా అక్టోబరు 30, 2015న ప్రతిపాదించింది. కానీ.. గత జూలై 7న సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో సీఎం నేరుగా చర్చలు జరిపాక ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 48 శాతానికి పరిమితమైంది. సింగపూర్ సంస్థల కన్సార్టియం వాటా 52 శాతానికి పెరిగింది.ఈ మర్మమేమిటన్నది సీఎం చంద్రబాబుకే ఎరుక.

 

నిబంధన 2: ప్రాజెక్టులపై  అజమాయిషీ ప్రభుత్వానికే ఉండాలి.

ఉల్లంఘన..: ఆరుగురు డెరైక్టర్లతో ఏడీపీ పాలక మండలిని ఏర్పాటు చేయాలని సింగపూర్ సంస్థలు ప్రతిపాదించాయి. ఇందులో నలుగురు సింగపూర్ సంస్థల ప్రతినిధులు.. ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. ఏడీపీ చైర్మన్‌గా తమ సంస్థలకు చెందిన డెరైక్టర్‌నే నియమించాలని కోరాయి. ఒక్కో డెరైక్టర్‌కు కనిష్ఠంగా 15 శాతం వాటా ఉంటుంది. ఏడాదికి నాలుగు సార్లు బోర్డు సమావేశమవుతుంది. 12 నెలలపాటూ ఒక డెరైక్టర్ బోర్డు సమావేశాలకు గైర్హాజరైతే ఆయన సభ్యత్వం రద్దవుతుంది. ఆ స్థానంలో మరొకరిని ఎంపిక చేస్తారు. ఒప్పందంలో అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఐదేళ్లపాటు ఎవరూ వాటాలను విక్రయించకూడదు.



ఆ తర్వాత కూడా ప్రైవేటు సంస్థ వాటా 26 శాతానికి తగ్గకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటాలను విక్రయించాలని భావిస్తే తొలుత సింగపూర్ సంస్థలకే అవకాశం ఇవ్వాలి. సింగపూర్ సంస్థలు కొనేందుకు నిరాకరిస్తేనే ఇతరులకు విక్రయించాలి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీన్ని బట్టి చూస్తే సింగపూర్‌కు ఏ స్థాయిలో రాష్టర ప్రభుత్వం సాగిలబడిందో అర్థం చేసుకోవచ్చు.

 

నిబంధన 3: ప్రాజెక్టుల్లో ఏవైనా వివాదాలు తలెత్తితే హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఇద్దరు నిపుణులు సభ్యులుగా నియమించిన కమిటీ వాటిని పరిష్కరిస్తుంది.

ఉల్లంఘన..: సింగపూర్ కన్సార్టియం ఒత్తిళ్లకు తలొగ్గిన సర్కార్.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో వివాదాల పరిష్కారానికి లండన్ కోర్టును వేదికగా ఎంచుకున్నారు.

 

కేల్కర్ కమిటీ ప్రతిపాదనలూ బుట్టదాఖలే..

దేశంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు చేపట్టే విధానాలపై అధ్యయనం చేయడానికి విజయ్ కేల్కర్ అధ్యక్షతన 2011లో యూపీఏ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. బీవోటీ(బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్‌పర్) నుంచి స్విస్ చాలెంజ్ వరకూ అన్ని విధానాలపై సమగ్ర అధ్యయనం చేసిన కేల్కర్ కమిటీ.. దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్విస్ చాలెంజ్ విధానాన్ని అమలు చేయవద్దంటూ నవంబర్, 2015న కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించింది. కానీ.. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి అయిన సీఎం చంద్రబాబు మాత్రం కేల్కర్ కమిటీ ప్రతిపాదనలను తుంగలోతొక్కి స్విస్ చాలెంజ్ విధానాన్ని అమలు చేస్తోండటం గమనార్హం.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top