పంట ఎండె.. గుండె పగిలె!

పంట ఎండె.. గుండె పగిలె! - Sakshi


సాక్షి, హైదరాబాద్: వానల్లేక పంటలు ఎండిపోతున్నాయి. రైతుల గుండెలు పగులుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా.. అధికారిక లెక్కల ప్రకారమే సగానికిపైగా పంటలు తుడిచి పెట్టుకుపోయాయి. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతన్నలు కుదేలయ్యారు. ఖరీఫ్ ప్రారంభమైన ఈ జూన్, జూలై నెలల్లోనే తెలంగాణ వ్యాప్తంగా 40 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు రైతు సంఘాలు లెక్కగట్టాయి. జూన్‌లో 15 మంది, జూలైలో 25 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.



రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఇప్పటివరకు మొత్తం 1,024 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు రైతు సంఘాలు చెబుతున్నాయి.

 

తీవ్ర కరువు పరిస్థితులు..

రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. జూన్‌లో సకాలంలో ఆశలు రేపిన రుతుపవనాలు.. ఆ నెల చివరికల్లా నిరాశపర్చాయి. జూలైలో పెద్దఎత్తున కురవాల్సిన వర్షాలు ముఖం చాటేశాయి. జూన్ 1 నుంచి  ఆదివారం వరకు 23 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఖమ్మం, వరంగల్  మినహా అన్ని జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. మొదట కురిసిన వర్షాలకు ఆశపడిన రైతులు పెద్దఎత్తున పంటల సాగు చేపట్టారు.



ఖరీఫ్‌లో 1.03 కోట్ల ఎకరాల్లో సాధారణ పంటల సాగు జరగాల్సి ఉండగా... 67.42 లక్షల ఎకరాల్లో (65%) సాగు జరిగింది. అందులో పత్తి 38.02 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 8.72 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. కానీ ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో 35 లక్షల ఎకరాల్లో (50% పైగా) పంటలు తుడిచిపెట్టుకుపోయాయని వ్యవసాయ శాఖ అధికారులే చెబుతున్నారు. వారం రోజుల్లోగా వర్షాలు కురవకుంటే మరో 25% ఎండిపోతాయంటున్నారు.



ఇక వరి సాగు సాధారణంగా ఇప్పటివరకు 38 శాతం జరగాల్సి ఉండగా... 11 శాతం వరకే నాట్లు పడ్డాయి. భూగర్భ జలాలు కూడా గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది 2.08 మీటర్ల లోతుల్లోకి అడుగంటిపోయాయి. దీంతో బోర్లు, బావుల కింద పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. కాగా, తెలంగాణలో మరో రెండు వారాల వరకు వర్షాలు కురిసే అవకాశం లేదని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి స్పష్టంచేశారు. అక్కడక్కడ అడపాదడపా చినుకులు మాత్రమే ఉంటాయంటున్నారు.

 

కొత్త రుణాలకు కొర్రీలు..

తెలంగాణ ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలకు రుణమాఫీ ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.17 వేల కోట్లు రుణాలను మాఫీ చేయాలని గతేడాది నిర్ణయించింది. అర్హులైన 35.82 లక్షల రైతులను గుర్తించి, మొదటి విడతగా గతేడాది రూ.4,230 కోట్ల మాఫీ ప్రకటించింది. ఆ మొత్తం జిల్లాల్లోని బ్యాంకులకు అందజేసింది. రెండో విడతగా రూ.4,086 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. గత నెలలలో రూ.2,043 కోట్లు మాత్రమే విడుదల చేసిన ప్రభుత్వం.. మిగిలిన సగంపై దోబూచులాడుతోంది. రూ.2,043 కోట్లలో ఇప్పటివరకు 30 శాతమే రైతు ఖాతాల్లో జమ అయింది. మిగిలిన సొమ్ము ఇంకా జమ కాకపోవడంతో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు.

 

ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏదీ?

ప్రత్యామ్నాయ ప్రణాళికపై సర్కారు ఇప్పటికీ సన్నద్ధం కాలేదు. విత్తనాలను అందుబాటులో ఉంచలేదు. మొదటి విడత ప్రత్యామ్నాయ ప్రణాళికకు రూ.32 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా ఆ ఊసే లేదు. కంది, పెసర, మొక్కజొన్న, జొన్న, ఆముదం, మినప విత్తనాలను అవసరాలకు తగ్గట్లుగా అందుబాటులో ఉంచలేదు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top