టీఆర్‌ఎస్‌లో చేరిన ఫరీదుద్దీన్, నరేంద్రనాథ్

టీఆర్‌ఎస్‌లో చేరిన ఫరీదుద్దీన్, నరేంద్రనాథ్ - Sakshi


సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఫరీదుద్దీన్ గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతో పాటు గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసిన చాగన్ల నరేంద్రనాథ్, మెదక్ జిల్లాకే చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత స్వామిచరణ్ సైతం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి హరీశ్‌రావు ఈ ముగ్గురు నేతలు, వారి అనుచరులు, పలువురు ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను స్వయంగా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు.

 

ఒక్కొక్కరినీ పేరుపేరునా పలుకరించిన కేసీఆర్ వారికి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి భారీ మెజార్టీ దక్కేలా సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం వారికి సూచించారు. మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ‘జిల్లాకు చెందిన సీనియర్ నేతల చేరికతో పార్టీకి మరింత బలం చేకూరింది. అంతా కలిసి పార్టీ అభ్యర్థికి భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషిచేస్తాం. ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసమే పార్టీకి విజయాన్ని సాధించి పెడుతుంది’ అని పేర్కొన్నారు. అనంతరం హరీశ్‌రావు, పార్టీలో చేరిన నేతలు సంగారెడ్డి  సభలో పాల్గొనేందుకు ర్యాలీగా సంగారెడ్డి బయలుదేరి వెళ్లారు.

 

టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా: మదన్‌లాల్


సాక్షి, ఖమ్మం: తైలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ వెల్లడించారు. వైఎస్సార్సీపీకి, ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన విలేకరులతో చెప్పారు. కాగా, సీఎం చంద్రశేఖర్‌రావును కాంగ్రెస్‌కు చెందిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గురువారం హైదరాబాద్‌లో కలిశారు. ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top