సినిమా చూపించిన డీసీపీ

సినిమా చూపించిన డీసీపీ - Sakshi


చాంద్రాయణగుట్ట: అభం శుభం తెలియని చిన్నారులను హత్య చేసిన రెండు వేర్వేరు ఉదంతాలలో నిందితులను దక్షిణ మండల పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. ఈ రెండు కేసులు ఒకే కోవకు చెందినవి కావడంతో దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ వారి కోసం ప్రత్యేకంగా లేగ దూడ, పులి సినిమాను చూపించారు. ఒక ఘటనలో నిందితుడు కన్న తండ్రి కాగా... మరో ఘటనలో నిందితురాలు పాపకు పెద్దమ్మ. డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... బండ్లగూడ మదీనా కాలనీకి చెందిన సయ్యదా ఆలియాకు మహ్మద్ సలీం (32)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు. దుబాయిలో పని చేసే సలీం ఇక్కడికి సెలవులపై వచ్చి పోతుంటాడు. ముగ్గురూ ఆడ పిల్లలే కావడంతో సలీం భార్యను తరచూ మానసికంగా, శారీరకంగా వేధించేవాడు.



ఈ క్రమంలోనే గత నెల 27న వేకువజామున 4 గంటలకు ఆలియా చిన్న కుమార్తె జైనాబ్ ఫాతీమా (6 నెలలు) పాల కోసం ఏడవసాగింది. నిద్రలో ఉన్న సలీం కోపంతో లేచి పసికందును విసిరి కొట్టాడు. సోపాలో పడిన చిన్నారి అక్కడి నుంచి కింద పడిపోయింది. దీంతో ఆలియా ఆ బిడ్డను చికిత్స కోసం శాలిబండలోని అస్రా ఆస్పత్రికి తరలించారు. పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తేల్చారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కామాటీపురా పోలీసులు.. పాప మృతికి కారకుడైన సలీంపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విలేకర్ల సమావేశంలో కామాటీపురా, భవానీనగర్‌ల ఇన్‌స్పెక్టర్లు రమేష్, శ్రీనివాసారావు పాల్గొన్నారు.



తోటి కోడలుపై కోపంతో...

ఇంట్లో తలెత్తిన చిన్న విభేదాలతో తోటి కోడలుపై కక్ష పెంచుకున్న మహిళ ఆరు నెలల చిన్నారిని నీటి సంప్‌లో పడేసి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భవానీ నగర్‌రోడ్డు నంబర్ 3కి చెందిన హలీమా బేగం, మహ్మద్ ఇస్మాయిల్ దంపతుల బిడ్డ కతీజా ఖుబ్రా (6 నెలలు). హలీమా బేగంకు తోటి కోడలు హర్షియ బేగం(23)తో మనస్పర్ధలున్నాయి. ఈ నేపథ్యంలో హలీమాపై హర్షియ కక్ష పెంచుకుంది. గత నెల 30వ తేదీ రాత్రి 8.45 గంటల సమయంలో హలీమా బేగం తన కుమార్తెను ఇంట్లోనే వదిలిపెట్టి.. పక్కనే ఉన్న పెద్ద తోటి కోడలు ముంతాజ్ బేగం ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో హర్షియ బేగంతో పాటు మరియం, రక్కియ అనే చిన్నారులూ ఇంట్లోనే ఉన్నారు. ఇంతలో పాప ఏడుస్తుండడంతో ఊయలలో పడుకోబెట్టిన మరియం ఈ విషయం హలీమాకు చెప్పడానికి వెళ్లింది. దీంతో తిరిగి వచ్చిన తల్లి పాప కోసం వెదకగా సంప్‌లో స్పృహ లేని స్థితిలో కనిపించింది. వెంటనే సమీపంలోని సమీనా ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే పాప మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న భవానీనగర్ పోలీసుల విచారణలో హర్షియ బేగం ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. నిందితురాలిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

 


సినిమా చూపించిన డీసీపీ

 ఈ రెండు కేసులు ఒకే కోవకు చెందినవి కావడంతో దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ వారి కోసం ప్రత్యేకంగా లేగ దూడ, పులి సినిమాను చూపించారు. నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో లేగ దూడను చూసిన పులి తరుముకుంటూ వస్తుంది. చివరకు దూడను పట్టుకున్న పులి తినేందుకు నోరు తెరిచి...ఆలోచిస్తుంది. తన బిడ్డంత వయసున్న దూడను మానవత్వంతో తినలేకపోతుంది. ఆ సమయంలో మరో పులి దూడను తినడానికి పరిగెత్తుకొస్తుంది. ఇది గమనించిన మొదటి పులి రెండో పులితో పోరాడి దూడకు రక్షణగా నిలుస్తుంది.... ఇలా క్రూర జంతువులకు ఉన్న ప్రేమ మన మనుషులకు ఎందుకు ఉండడం లేదని ఆయన నిందితులను ప్రశ్నించారు.


 


 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top