వివాహం పేరుతో వలపన్నుతారు

వివాహం పేరుతో వలపన్నుతారు - Sakshi


- కొత్త తరహా మోసాలు ప్రారంభించిన నైజీరియన్లు

- మాట్రిమోనియల్ సైట్ల వేదికగా మహిళలకు ఎర



సాక్షి, హైదరాబాద్:
ఆన్‌లైన్ ద్వారా మోసాలకు పాల్పడే నైజీరియన్లు నానాటికీ కొత్త పంథాలు అనుసరిస్తున్నారు. ఈ కోణంలో వెలుగులోకి వచ్చిన మరో వ్యవహారమే మాట్రిమోనియల్ ఫ్రాడ్స్. ఇటీవల కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్న ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ నిపుణులు సూచిస్తున్నారు.



వివిధ రకాలైన వీసాలపై భారత్‌కు వస్తున్న నైజీరియన్లు ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో తిష్ట వేస్తున్నారు. లాటరీలు, బహుమతులు అంటూ ఎస్సెమ్మెస్‌లు, ఈ-మెయిల్స్ ఇస్తూ అనేక రకాలైన ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ఈ నైజీరియన్లు తాజాగా మాట్రిమోనియల్ సైట్స్‌ను ఆధారంగా చేసుకుంటున్నారు. తాము ప్రవాస భారతీయులం అంటూ మారుపేర్లతో ఈ వెబ్‌సైట్స్‌లో రిజిస్టర్ చేసుకుంటున్నారు. తన భార్య చనిపోయిందనో, విడాకులు తీసుకున్నామనో చెప్తూ అదే కోవకు చెందిన పెళ్ళి కుమార్తెల కోసం వెతుకున్నట్లు వల వేస్తున్నారు. ఈ ప్రొఫైల్స్ చూసి ఆకర్షితులవుతున్న మహిళలు ఆసక్తి చూపుతూ పోస్ట్ చేసిన వెంటనే అసలు కథ ప్రారంభిస్తున్నారు.



వీరితో చాటింగ్ చూస్తూ వివాహానికి సమ్మతించినట్లు చెప్తూ పరిచయాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా కొన్ని రోజులు సాగిన తరవాత భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంటానని ఆయా మహిళల్ని నమ్మిస్తున్నారు. వివాహ కానుకలు పంపిస్తున్నాననో, తాను వేరే దేశంలో వెళ్తున్న నేపథ్యంలో తన వద్ద ఉన్న విలువైన వస్తువుల్ని భద్రపరిచేందుకు పంపిస్తున్నానో చెప్పి ఆ మహిళల చిరునామా, ఫోన్ నెంబర్ తదితరాలు సేకరిస్తున్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఢిల్లీ, ముంబైలకు చెందిన నెంబర్ల నుంచి ఆయా మహిళలకు ఫోన్లు వస్తున్నాయి. మీ పేరుతో విదేశాల నుంచి గిఫ్ట్ ప్యాక్ లేదా బంగారం వచ్చిందని, కస్టమ్స్ క్లియరెన్స్‌తో పాటు వివిధ పన్నుల చెల్లింపు జరగని నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో ఆగిపోయిందని చెప్తున్నారు. ఆయా పన్నుల నిమిత్తం నిర్ణీత మొత్తాలను తాము చెప్పిన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాల్సిందిగా కోరుతున్నారు.



సాధారణంగా ఈ మహిళలు ఉద్యోగ, వ్యాపార రంగాలకు చెందిన వారే కావడంతో నైజీరియన్ల మాటలు నమ్మి పలు దఫాలుగా వారి కోరిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తున్నారు. బోగస్ పేర్లు, వివరాలను తెరుస్తున్న ఈ ఖాతాల్లో డిపాజిట్ అయిన సొమ్మును ఎప్పటికప్పుడు డ్రా చేసుకుంటున్న నైజీరియన్లు ఆనక ఫోన్ నెంబర్లు మార్చేయడంతో పాటు బ్యాంకు ఖాతాలనూ మూసేస్తున్నారు. చివరకు తాము మోసపోయామని గుర్తిస్తున్న బాధితులు పోలీసుల్ని ఆశ్రయించినా ఫలితం ఉండట్లేదు. మాట్రిమోనియల్ సైట్‌లో నమోదు నుంచి ప్రతి దశలోనూ నైజీరియన్లు బోగస్ వివరాలే పొందుపరుస్తుండటంతో పట్టుకోవడం కష్టసాధ్యంగా మారింది.


 


గడిచిన ఆరు నెలల వ్యవధిలో హైదరాబాద్‌కు చెందిన పలువురు మహిళలు దాదాపు రూ.2 కోట్ల మేర మోసపోయి సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడల్లోనూ బాధితులు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. కేవలం వెబ్‌సైట్లు, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ ద్వారా అయిన పరిచయాలు నమ్మవద్దని, అవతలి వ్యక్తిని వ్యక్తిగతంగా కలవడమో, పూర్తి వివరాలు సరిచూసుకోవడమో చేయకుండా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నెరపవద్దని సీఐడీ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. అనేక కష్టనష్టాలకు ఓర్చి నిందితుల్ని పట్టుకున్నా వారి నుంచి నగదు రికవరీ అసాధ్యంగా మారిందని వివరిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top